రాంచీ: 61 ఏళ్ల రిటైర్డ్ అధికారి సునీల్ కుమార్ సింగ్ ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జార్ఖండ్ రాజధాని నగరం రాంచీలోని సిధో-కన్హు పార్క్ సమీపంలో ఉన్న ఒక ఫ్లాట్‌లో ఆయన ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నారు.
లాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిధో-కన్హు పార్క్ సమీపంలో ఉన్న ఒక ఫ్లాట్‌లో, సీలింగ్ ఫ్యాన్ హుక్‌కు వేలాడుతూ ఆయన మృతదేహం ఆదివారం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. తీవ్రమైన కీళ్ల నొప్పులు లాంటి వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో, ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా తెలుస్తోందని లాల్‌పూర్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఉత్తమ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
పోలీసులు ఎనిమిది పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ఆయన తన వృద్ధాప్య అనారోగ్య సమస్యల వల్ల పడుతున్న బాధను వివరంగా పేర్కొన్నారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణం నిర్ధారణ అవుతుందని ఆయన తెలిపారు. అసాధారణ మరణం (UD) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. రాంచీలోని RIMSలో పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కాగా సునీల్ కుమార్ సింగ్ బీహార్‌లోని పాట్నాకు చెందినవారు. ఆయన ఏడాది క్రితం రాంచీలో డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ (DDC)గా పదవీ విరమణ చేశారు. ఆయన కుటుంబం పాట్నాలో ఉంటుండగా, ఈయన మాత్రం రాంచీలోని ఒక ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు.
ఇదీ చదవండి: అపుడు భర్త, ఇపుడు భార్య రాజీనామా? యూపీ రాజకీయాల్లోకి ఎంట్రీ?


