రాంచీ: రాంచీలో జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థుల భారీ ఆందోళనల నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులతో జరిపిన రెండు విడతల చర్చలు విజయవంతం కావడంతో, 14వ జేపీఎస్‌సీ పరీక్షను రద్దు చేయడానికి హేమంత్ సోరెన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ మంత్రి దీపికా పాండే వెల్లడించారు.
రాంచీలో నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులతో చర్చల అనంతరం మీడియాతో మంత్రి దీపికా పాండే మాట్లాడుతూ.. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందులో భాగంగా 14వ జేపీఎస్‌సీ పరీక్షను రద్దు చేయడంతో పాటు, టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలు, జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన సీఐడీతో సమగ్ర విచారణ జరిపించనున్నట్లు స్పష్టం చేశారు. అవసరమైతే ఈ దర్యాప్తు కోసం ఈడీని కూడా సంప్రదిస్తామని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం గతంలో విడుదలైన ఫలితాలు, నియామక పత్రాల విషయంలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పరిగణలోకి తీసుకున్నారు. సీఐడీ దర్యాప్తును ఒక ప్రత్యేక న్యాయ కమిటీ పర్యవేక్షిస్తుందని, రాబోయే 90 రోజుల్లోగా ఈ విచారణను పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆశ్రయించి బాధితులకు త్వరగా న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పేపర్ లీక్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.


