ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రొఫెసర్‌పై కేసు | Sahil Wakode Death Case: Father Accuses IIT Bombay Director and Professor of Harassment | Sakshi
Sakshi News home page

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రొఫెసర్‌పై కేసు

Sep 20 2026 10:43 AM | Updated on Sep 20 2026 10:46 AM

Sahil Wakode Death Case: Father Accuses IIT Bombay Director and Professor of Harassment

ముంబై: ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుల వివక్ష, వేధింపులే తన కుమారుడి మరణానికి కారణమని సాహిల్‌ తండ్రి రవీంద్ర చక్రధర్ వాకోడే ఆరోపిస్తున్నారు.

ఇటీవల ఐఐటీ బాంబే నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి సాహిల్ వాకోడే మొబైల్ ఫోన్ ఉపయోగించి, సమాధానాలు వెతికేందుకు ప్రశ్నాపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. ఇన్విజిలేటర్‌కు దొరికిపోవడంతో మనస్తాపం చెంది అతను తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడని ఐఐటీ బాంబే అధికారికంగా ప్రకటించింది.

అయితే, తన కుమారుడి మరణానికి కుల వేధింపులే కారణమని బాధిత విద్యార్థి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ బి. కేదారే ఆదేశాల మేరకే ప్రొఫెసర్ సూర్యనారాయణన్‌ దూళ్ల తనను వేధించారని సాహిల్ తనతో చెప్పినట్లు ఆయన తండ్రి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని యవత్మాల్‌కు చెందిన సాహిల్, 12వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ఆ తర్వాత ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందాడు. కాలేజీ మొదటి సంవత్సరం సజావుగా సాగినప్పటికీ, రెండవ సంవత్సరంలో అతనికి సమస్యలు మొదలయ్యాయి. గత మూడు నెలలుగా సాహిల్ తీవ్రమైన మానసిక వేధింపులకు, కుల దూషణలకు గురయ్యాని వాకోడే ఆరోపించారు.

సాహిల్ కాపీ కొడుతూ పట్టుబడిన పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ సూర్యనారాయణన్‌ దూళ్ల పేరిట ఈ ఫిర్యాదును నమోదు చేశారు. డైరెక్టర్ శిరీష్ బి. కేదారే ఆదేశాల మేరకు ఆయన కులపరమైన దూషణలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను 'తక్కువ కులానికి' చెందినవాడిని కాబట్టి, తనపై సులభంగా తప్పుడు కేసు బనాయించగలనని ప్రొఫెసర్ దుల్లా బెదిరించినట్లు సాహిల్ తన తండ్రికి తెలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు ప్రొఫెసర్ దుల్లాను బాధ్యుడిగా పేర్కొంటూ, ఆయనతో పాటు ఇతర ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాకోడే డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఐఐటీ బాంబే ప్రొఫెసర్ సూర్యనారాయణన్‌ దూళ్లపై ఆత్మహత్యకు ప్రేరేపణ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యాజమాన్యం ఖండన
మరోవైపు, క్యాంపస్‌లో ఎలాంటి కుల వివక్ష లేదని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ బి. కేదారే తీవ్రంగా ఖండించారు. సాహిల్ ఎప్పుడూ ఎస్సీ, ఎస్టీ సెల్‌కు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కళాశాల వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదంతం నేపథ్యంలో ఐఐటీ బాంబే విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేపట్టి, డైరెక్టర్, సంబంధిత ప్రొఫెసర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సాహిల్ వాకోడే ఐఐటీలోని ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంఎస్సీ రెండవ సంవత్సరం విద్యార్థి. శుక్రవారం సాయంత్రం ఐఐటీ బాంబే పవాయ్ క్యాంపస్‌లోని తన హాస్టల్ గదిలో అతను విగతజీవిగా కనిపించాడు.

ఐఐటీ బొంబాయి వివరాల ప్రకారం.. సాహిల్ ఆ రోజు అంతకుముందు పరీక్షా హాలులో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ, సమాధానాల కోసం ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తూ పట్టుబడ్డాడు. అయినప్పటికీ, అతనిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని, బదులుగా అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి, అతని కెరీర్‌కు ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చామని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement