ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో అత్యంత సంచలన పరిణామం చోటు చేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసుకు సంబంధించి అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్‌లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేలతో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ఉండటం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
దిశా మరణంపై ఆమె తండ్రి సతీష్ సాలియన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. గత నెల ఆగస్ట్ చివరి నాటికి వాదనలు పూర్తి చేసి సెప్టెంబర్ 3న కీలక తీర్పు వెలువరించింది. దాదాపు ఆరేళ్ల పాటు ముంబై పోలీసులు ఈ ఘటనను కేవలం ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తు అకస్మాత్తు మృతి (ADR - Accidental Death Report) కోణంలోనే దర్యాప్తు చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలే ఎక్కువ
పోలీసుల దర్యాప్తు తీరు ‘సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలను లేవనెత్తుతోందని’, విచారణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా, దిశా మరణించి ఆరేళ్లు గడుస్తున్నా కుటుంబ సభ్యులకు పోస్ట్ మార్టం రిపోర్ట్, ఏడీఆర్ కాపీలను కూడా అందజేయలేదని హైకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులోని అనేక అనుమానాలను పరిగణలోకి తీసుకుంటూ సమగ్ర దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తూ వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లోని కీలక అంశాలు
కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ.. గత వారం దిశా తండ్రి సతీష్ సాలియన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆదిత్య ఠాక్రే తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఇతరులు ఈ కుట్రలో, ఆ తర్వాత జరిగిన పరిణామాలను కప్పిపుచ్చడంలో కీలక పాత్ర పోషించారని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.
కేసు పత్రాలు, ఫైళ్లు, ఇతర ప్రభుత్వ రికార్డులను ధ్వంసం చేయడం, అధికారిక రికార్డులను తారుమారు చేయడం, ప్రజాధనాన్ని, మానవ వనరులను, పోలీసు యంత్రాంగాన్ని చట్టవిరుద్ధమైన పనులకు, నేరస్థులను రక్షించడానికి దుర్వినియోగం చేశారని పేర్కొంటూ.. సంబంధిత ప్రభుత్వోద్యోగులు, పోలీసు అధికారులు కూడా ఈ విచారణకు బాధ్యులవుతారని సీబీఐ తేల్చిచెప్పింది.
నాటి సీఎం,ఆయన కుమారుడికి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఎఫ్‌ఐఆర్‌లో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, నటులు డీనో మోరియో, సూరజ్ పంచోలి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి, అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్, దిశా కాబోయే భర్తతో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించారు. దిశా అటాప్సీ(పోస్ట్‌మార్టం) రిపోర్టును ఆలస్యం చేశారని, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రయత్నం చేసేందుకు అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే, అప్పటి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పాత్రపై కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపణలు గుప్పించారు. అలాగే ఆలస్యమైన పోస్ట్‌మార్టమ్‌కు సంబంధించిన వైద్యులు, సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరగాల్సి ఉందని తెలిపారు.
అకస్మిక మృతిగా కేసు నమోదు చేసి..
2020 జూన్ 8న ముంబైలోని మాలాడ్ ప్రాంతంలో ఓ నివాస భవనం 14వ అంతస్తు నుంచి కింద పడి దిశా సాలియన్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సరిగ్గా వారం రోజుల వ్యవధిలోనే (జూన్ 14న) ఆమె సహచరుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అప్పట్లో ముంబై పోలీసులు దిశా మృతి కేసుకు సంబంధించి కేవలం అకస్మిక మృతిగా నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే, తన కుమార్తెను ముందస్తు పథకం ప్రకారం గ్యాంగ్‌రేప్ చేసి హత్య చేశారని, దీని వెనుక పెద్దల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సతీష్ సాలియన్ గత ఏడాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగడంతో ఈ కేసులో మునుముందు మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


