ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకుండానే కేసులో ఇరికించారా? | Supreme Court is shocked by the behavior of Telangana Police | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకుండానే కేసులో ఇరికించారా?

Sep 10 2026 1:47 AM | Updated on Sep 10 2026 1:47 AM

Supreme Court is shocked by the behavior of Telangana Police

తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు విస్మయం

సాక్షి, న్యూఢిల్లీ: ఒక కేసులో అరెస్టు చేసి, అందులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాని మరో కేసులో ముద్దాయిగా చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ పోలీసుల దర్యాప్తు తీరును తప్పుబడుతూ దీనిని పూర్తిగా ’రివర్స్‌ ఇంజనీరింగ్‌’ కేసుగా అభివర్ణించింది. ఈ కేసులో 11 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన పులి ఓబులేసుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

పులి ఓబులేసు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ (క్రిమినల్‌)పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.  పోలీసుల దర్యాప్తు తీరుపై ధర్మా సనం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘మీరు అతడిని ఒక కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు నేరం అంగీకరించాడని చెప్పి ఈ కేసులో ఇరికించారు. ఆ తర్వాతే ఫిర్యాదుదారుడిని సృష్టించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇదొక రివర్స్‌ ఇంజనీరింగ్‌ కేసు‘ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్‌ కోర్టు విధించే షరతులకు లోబడి పిటిషనర్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని పేర్కొంది.

అసలేం జరిగిందంటే...: 2014 నవంబర్‌ 19న హైదరాబాద్‌లో కేబీఆర్‌ పార్కు వద్ద ఆడి కారులో కూర్చున్న ఓ వ్యక్తి వద్దకు పులి ఓబులేసు తుపాకీతో వెళ్లి బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేశాడు. బాధితుడు ప్రతిఘటించడంతో కారు అద్దంపై కాల్పులు జరిపాడు. బాధితుడి సోదరుడు అడ్డు కోగా, అతడిని కొరికి తుపాకీ వదిలేసి పరారయ్యాడు. విచారణ జరిపిన కింది కోర్టు.. కిడ్నాప్, హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద నేరాలు రుజు వైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు, కఠిన కారాగార శిక్షలు విధించింది. అయితే, బాధితుడిని కారు నుంచి మరో ప్రాంతానికి తరలించనందున కిడ్నాప్‌ సెక్షన్‌ వర్తించదంటూ జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేసింది. అయితే, హత్యా యత్నం, ఆయుధ చట్టం కింద కింది కోర్టు విధించిన శిక్షలను మాత్రం సమర్థించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement