తెలంగాణ: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఇచ్చిన ఏడేళ్ల వయోపరిమితి సడలింపునకు అదనంగా మరో మూడేళ్లు పెంచడంతో మొత్తం పదేళ్ల వరకు వయోపరిమితి సడలింపు అందుబాటులోకి వచ్చింది.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టే నియామకాలకు ఈ సడలింపు వర్తించనుంది. పోలీస్ శాఖతో పాటు ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)లోని కానిస్టేబుల్ పోస్టులకు ఇది వర్తించనుంది. అలాగే, కానిస్టేబుల్‌తో సమాన హోదా కలిగిన ఇతర పోస్టులకు కూడా ఈ అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీంతో వయోపరిమితి కారణంగా ఇప్పటివరకు పోలీస్ ఉద్యోగాలకు దూరమైన పలువురు అభ్యర్థులకు మరోసారి అవకాశం లభించనుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పోలీస్ నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నిర్ణయం ఊరటనివ్వగా, రాబోయే నియామకాల్లో అర్హత కలిగిన మరికొందరు అభ్యర్థులు పోటీ పడేందుకు అవకాశం ఏర్పడింది.
అయితే ఈ అదనపు మూడేళ్ల సడలింపుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పోలీస్ శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు ఈ సడలింపు చెల్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధించిన వయోపరిమితి నిబంధనలను ప్రత్యేకంగా పరిశీలించాలి.
ఈ వయోపరిమితి పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9, 2026న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఏడేళ్ల సడలింపునకు మరో మూడేళ్లు కలపడంతో మొత్తం పదేళ్ల వరకు సడలింపు లభించనుంది.
దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్‌పీఎఫ్ విభాగాల్లో కానిస్టేబుల్, సమాన హోదా పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చనుంది. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, శారీరక ప్రమాణాలు, ఇతర అర్హతలను అభ్యర్థులు తప్పనిసరిగా పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది.
ఇవి కూడా చదవండి: ఇందిరమ్మ టవర్స్ డిపాజిట్ వాపస్


