సాక్షి, న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల్లో పాల్గొన్న ఒక విద్యార్థికి గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. CJP నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన అన్ని FIRలను కొట్టివేస్తూ, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ మేజిస్ట్రేట్ నోటీసు ఎలా ఇస్తారని కోర్టు ప్రశ్నించింది.. తీర్పు స్పష్టంగా ఉన్నప్పటికీ నోటీసు ఎలా ఇస్తారంటూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ల నుంచి ఈ ఘటనపై వివరణ కోరనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది జూలైలో జరిగిన సీజేపీ నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి తామిచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ నోటీసు ఎలా జారీ చేస్తారు? మేజిస్ట్రేట్‌కు అంత ధైర్యమా?" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది!
గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ రెండో సంవత్సరం విద్యార్థి అక్షత్ త్రిపాఠికి సెప్టెంబర్ 4న గ్రేటర్ నోయిడా మేజిస్ట్రేట్ నోటీసు పంపారు. నిరసనల్లో పాల్గొనమని విద్యార్థులను ప్రోత్సహించినట్లు అందులో ఆరోపించారు. (ఈ నోటీసును మరుసటి రోజే ఉపసంహరించు కున్నట్లు కోర్టుకు తెలిపారు). ఇందుకు రూ. 5 లక్షల వ్యక్తిగత బాండ్‌ను అందించాలనికోరారు.
అయితే ఆర్టికల్ 142 ప్రత్యేక అధికారాలను ఉపయోగించి, జూలై 20 - 25 మధ్య CJP నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులన్నింటినీ సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలాగే కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కూడా స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్‌ఐఆర్ నోటీసు
కాగా సీజేఐ సూర్యకాంత్ అనూహ్య వ్యాఖ్యల తరువాత పుట్టుకొచ్చిన సీజేపీ నీట్ ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యంగా జెన్-జీ నుంచి ఈ పోరాటానికి లభించిన ఆదరణ, మద్దతు విశేషంగా నిలిచింది.


