అర్హత లేని వారికి టీచర్‌ పోస్టులా | Supreme Court Fires On Chandrababu Govt education system Flaws | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలతో చెలగాటంపై ‘సుప్రీం’ సీరియస్‌.. అర్హత లేని వారికి టీచర్‌ పోస్టులా

Sep 9 2026 5:44 AM | Updated on Sep 9 2026 5:44 AM

Supreme Court Fires On Chandrababu Govt education system Flaws

అనర్హులైన వ్యక్తులను ఎందుకు నియమిస్తున్నారు?  

విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా చెలగాటమాడతారు? 

పోటీ పరీక్షలు లేకుండా అడ్డదారి నియామకాలతో తరతరాల భవిష్యత్తు నాశనమే

విద్యా హక్కు, ఎన్‌సీటీఈ, యూజీసీ చట్టాల ప్రకారం.. నిర్దేశిత అర్హతలు లేనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులుగా నియమించరాదు 

ఒకవేళ అలాంటి వారిని నియమిస్తే సర్వీసులో కొనసాగించరాదు 

దేశంలోని పాఠశాలలు, కళాశాలల్లో అనర్హుల నియామకాలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు  

విద్యావ్యవస్థలోని లోపాలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆందోళన

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మెగా డీఎస్సీ 2025 పోస్టుల భర్తీలో అక్రమాలను కప్పిపుచ్చుతూ చంద్రబాబు సర్కారు బుకాయింపులు, బెదిరింపులకు దిగిన తరుణంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా జారీ చేసిన కీలక ఆదేశాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పోటీ పరీక్షలు లేకుండా అడ్డదారి విధానాలతో టీచర్ల నియామ­కాలు చేపడితే తరతరాల భవిష్యత్తు నాశనం అవు­తుందని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. నిర్దేశిత అర్హతలు లేనివారికి టీచర్‌ పోస్టులు కట్టబెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారా? అని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.  విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ యాక్ట్‌), నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చట్టాల ప్రకారం, నిర్దేశిత అర్హతలు లేనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులుగా నియమించరా­దని తేల్చి చెప్పింది. ఒకవేళ  అలాంటి వారిని నియమిస్తే సర్వీసులో కొనసాగించరాదని స్పష్టం చేసింది. ఈమేరకు ఆయా చట్టాల ప్రకారం, నిర్దేశిత అర్హతలు లేని ఉపాధ్యాయుల నియామకాలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

ప్రభుత్వాల ఇష్టానుసార నియామకాలపై పిల్‌.. 
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అక్రమాల మయంగా మారడం.. మెగా డీఎస్సీపై రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తుండటం.. స్పోర్ట్స్‌ కోటా ముసుగులో ప్రతిభకు పాతరవేసి ఇష్టారాజ్యంగా జీవోలతో అనర్హులకు ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పారదర్శకత, పోటీ పరీక్షల ప్రక్రియ లేకుండా ప్రైవేట్‌ లేదా వెంచర్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. పోటీ పరీక్షల ప్రక్రియ లేకుండా నిర్దేశిత అర్హతలు లేనివారిని నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించడంపై పిటిషనర్లు పిల్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు (ఆర్టికల్‌ 14), ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల హక్కు (ఆర్టికల్‌ 16)లను ఈ విధానాలు ఉల్లంఘిస్తున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్‌ నివేదించారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విద్యావ్యవస్థలోని లోపాలపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

అనర్హులకు టీచర్‌ పోస్టులపై సీజేఐ సీరియస్‌.. 
అనర్హులైన వ్యక్తులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టడంపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అనర్హులైన వ్యక్తులను ఎందుకు నియమిస్తున్నారు? విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా చెలగాటమాడతారు?’’ అని మండిపడ్డారు. ఉపాధ్యాయుల నియామకాల్లో నిబంధనలను తప్పించుకునేందుకు ప్రభుత్వాలు అనర్హులను ‘ట్యూటర్లు’ లాంటి రకరకాల పేర్లతో నియమిస్తూ విద్యా ప్రమాణాలను భ్రష్టు పట్టిస్తున్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించారు. దీనిపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. ‘‘ఈ రకమైన విధానాలతో వారు తరతరాల భవిష్యత్తును నాశనం చేస్తారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.   

అర్హతలు లేకుండా నియమించొద్దు.. 
విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీఈ, ఎన్‌సీటీఈ, యూజీసీ నిబంధనల ప్రకారం నిర్దిష్ట అర్హతలు లేనిదే ఏ ఒక్కరినీ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ సర్వీసులో నియమించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజేశ్‌ చౌహాన్‌ అండ్‌ అదర్స్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసుకు సంబంధించి ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

సీబీఐ విచారణకు ఆదేశించాలి  
సుప్రీం తీర్పు నేపథ్యంలో.. ఏపీలో డీఎస్సీ­లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. ఈ డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా పేరుతో కనీసం పరీక్షలు కూడా లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లలో ఎక్కువ ఫేక్‌గా నిర్ధారణ కావడం, టెట్‌ అర్హత లేనివారికి ఉద్యోగాలు ఇవ్వడం, మెరిట్‌ అభ్యర్థులను పక్కనపెట్టి అర్హతలు లేనివారికి ఉద్యోగాలు ఇవ్వడం.. వంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ మెగా డీఎస్సీ స్కాం వెనుక మెగా హ్యాండ్‌ ఎవరన్నది బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి.  
    – రామచంద్ర, ఏపీ విద్యార్థి, నిరుద్యోగ యువజన జేఏసీ కన్వీనర్‌  

న్యాయవ్యవస్థ చెప్పినా లెక్కలేనితనం 
ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌సహా సంబంధిత నియమ నిబంధనలను అన్నింటినీ తప్పనిసరిగా పాటించాలని న్యాయ వ్యవస్థ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ  విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారు. డీఏస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత రావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే స్వచ్ఛందంగా సీబీఐ విచారణకు ముందుకు రావాలి. అయితే ఈ దిశలో మంత్రి లోకేశ్‌ వెనుకడుగు వేయడాన్ని చూస్తే.. తప్పు జరిగినట్లు అర్థమైపోతోంది.  
    –  బండేల నాసర్‌జి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నిష్పక్షపాత విచారణ జరిపించాలి 
రాష్ట్రంలో డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీలో అవకతవకలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి. ఎటువంటి అవకతవకలు జరగలేదని ఒకపక్క చెబుతున్న ప్రభుత్వం మరోవైపు కొంతమందిని అరెస్టు చేయడం, పలు ఘటనలపై విచారణకు ఆదేశించడం అనుమానాలకు తావిస్తోంది. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో పారదర్శకత లోపించడం వల్ల ఏళ్ల తరబడి కష్టపడి చదువుతూ రూ.లక్షల ఖర్చు చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.  
    – కె.ప్రసన్న, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  

సీబీఐ విచారణతో నిజాలు నిగ్గుతేలుతాయి  
విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే ఉపాధ్యాయుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ–2025 స్పోర్ట్స్‌ కోటాలో నియామకాలపై వస్తున్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలి. కొంతమంది అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లతో తమకు సంబంధం లేదని పలు అసోసియేషన్లు స్వయంగా అధికారులకు లేఖలు రాయడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సీబీఐ విచారణతోనే నిజాలు నిగ్గుతేలుతాయి.  
    – ఎన్‌.నాగభూషణం, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement