Climate Risk Alert: డేంజర్‌ జోన్‌లో హైదరాబాద్‌! | Ahmedabad Hyderabad Among Worlds Least Climate Resilient Cities | Sakshi
Sakshi News home page

Climate Risk Alert: డేంజర్‌ జోన్‌లో హైదరాబాద్‌!

Sep 8 2026 9:04 AM | Updated on Sep 8 2026 9:13 AM

Ahmedabad Hyderabad Among Worlds Least Climate Resilient Cities

న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ నిలిచింది. ప్రపంచంలోని 72 ప్రధాన నగరాలపై నిర్వహించిన తాజా అధ్యయనంలో అహ్మదాబాద్‌ అత్యంత ప్రమాదకర నగరంగా, హైదరాబాద్‌ రెండో అత్యంత ప్రమాదకర నగరంగా నిలిచాయి. జియోస్పేషియల్‌ ఏఐ సంస్థ ఆల్ఫాజియో ఈ ర్యాంకింగ్‌ను రూపొందించింది. నగరాలు ఎదుర్కొనే వాతావరణ విపత్తుల ముప్పుతోపాటు వాటిని తట్టుకుని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని కూడా సంస్థ పరిగణనలోకి తీసుకుంది.

వరదలు, తీవ్రమైన వేడి, కరువు, కార్చిచ్చు, హరికేన్‌ గాలులు తదితర ముప్పులను అంచనా వేశారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, పాలన, విధానపరమైన చర్యలు, మౌలిక సదుపాయాలు, వరద నిరోధక నిర్మాణాలు, అధిక సామర్థ్యం కలిగిన డ్రైనేజీ వ్యవస్థలు వంటి అంశాల ఆధారంగా ఆయా నగరాల సామర్థ్యాన్ని పరిశీలించారు.

వాతావరణ ముప్పులను తట్టుకునే సామర్థ్యంలో అమెరికాలోని చికాగో మొదటి స్థానంలో నిలిచింది. సమశీతోష్ణ అక్షాంశంలో ఉండటం, మంచినీటి వనరులకు చేరువగా ఉండటం, హరికేన్‌ ముప్పు తక్కువగా ఉండటం దీనికి కలిసొచ్చాయి. వాతావరణ సంబంధిత ముప్పులను ఎదుర్కొనేందుకు నగరం మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టింది. వరదలు, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన ‘డీప్‌ టన్నెల్‌ ప్రాజెక్ట్‌’ ఇందులో ఒకటి.

ఆల్ఫాజియో వ్యవస్థాపకుడు, సీఈఓ పరాగ్‌ ఖన్నా మాట్లాడుతూ.. ముప్పులను మాత్రమే కాకుండా వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా తమ విధానం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. ర్యాంకింగ్‌లో అహ్మదాబాద్‌ చివరి స్థానంలో నిలిచింది. నదీ తీర ప్రాంతంలో ఉన్న ఈ నగరానికి వరదల ముప్పు అధికంగా ఉందని, గుర్తించిన ప్రమాదాలకు అనుగుణంగా తగిన స్థాయిలో సన్నద్ధత లేదని అంచనా పేర్కొంది. దక్షిణాసియా నగరాలు కూడా అత్యంత తక్కువ వాతావరణ నిరోధకత కలిగిన నగరాల జాబితాలో ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌, ముల్తాన్‌, ఢాకా, లాహోర్‌, కోల్‌కతా, ఫైసలాబాద్‌, కరాచీ, చిట్టగాంగ్‌ దిగువ 10 స్థానాల్లో ఉన్నాయి. వరదలు, రుతుపవనాల ప్రభావం దీనికి కారణమని వెల్లడైంది.

అమెరికాలోని ఫీనిక్స్‌ అత్యంత ప్రమాదకర నగరంగా గుర్తించగా, దీనికి ఇక్కడి తీవ్రమైన వేడి ప్రధాన కారణంగా నిలిచింది. మరోవైపు అడిస్‌ అబాబా, మెల్‌బోర్న్‌, బార్సిలోనా, అంకారా తదితర నగరాలు అత్యంత నిరోధకత కలిగిన 10 నగరాల్లో చోటు దక్కించుకున్నాయి. వాతావరణ ముప్పుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నది మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుందని ఆల్ఫాజియో పేర్కొంది. తీవ్రమైన వేడి.. విద్యుత్‌ వ్యవస్థలపై ఒత్తిడి పెంచుతుందని, బలమైన విద్యుత్‌ గ్రిడ్లు, ప్రత్యామ్నాయ మౌలిక సదుపాయాలు విద్యుత్‌ అంతరాయాల ప్రభావాన్ని తగ్గించగలవని తెలిపింది. నేపాల్‌, టిబెట్‌లో ఇటీవల సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు లోయలు, దిగువ ప్రాంతాల్లోని నివాసాలకు ఉన్న ముప్పును కూడా స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ సభకు భారీ క్రేజ్.. బేజారెత్తిన బుక్‌మైషో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement