దుబాయ్: ప్రముఖ మలయాళీ గాయకుడు నిసార్ వయనాడ్ (Nisar Wayanad) దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో అకస్మాత్తుగా కన్నుమూశారు. అజ్మాన్‌లో జరగాల్సిన ఒక సంగీత విభావరి (షో)కి కొన్ని గంటల ముందే ఆయన తుదిశ్వాస విడవడం యూఏఈలోని మలయాళీ కమ్యూనిటీని, ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆయన గత నెలలో ఒక సంగీత కార్యక్రమం కోసం దుబాయ్‌కి వచ్చారు. జ్వరం రావడంతో వైద్య చికిత్స తీసుకున్నారు. రాబోయే రోజుల్లో దుబాయ్, సౌదీ అరేబియాలో పలు కార్యక్రమాల్లో ఆయన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మలయాళ సినిమాల్లో పాటలు పాడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులను, స్నేహితులను, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. నిసార్ గొంతు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ గాత్రాన్ని పోలి ఉండటంతో సంగీత కార్యక్రమాల వేదికలపై ఆయనకు విశేష ప్రజాదరణ ఉండేది.
గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నిసార్, సాధారణ పారాసిటమాల్ మాత్రలు వాడుతున్నారు. శనివారం మధ్యాహ్నంపరిస్థితి విషమించడంతో దుబాయ్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సాయంత్రం మరణించారు. సెప్టిసీమియా (రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) వల్ల అవయవాలు విఫలమై, బాడీలో అసిడోసిస్ పెరగడం వల్ల మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
శనివారం అర్ధరాత్రి వేళ ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సుమారు 300 మందికి పైగా అభిమానులు, మిత్రులు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. రికార్డు స్థాయిలో కేవలం 4 గంటల్లోనే రాత్రి 3 గంటల ప్రాంతంలో జనాజా ప్రార్థనలు పూర్తి చేసి, పార్థివ దేహాన్ని కేరళలోని ఆయన స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
దుబాయ్‌లోని కల్చరల్ ఈవెంట్లలో తన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్న నిసార్ కేరళలోని వయనాడ్ జిల్లాకు చెందిన వారు. నిసార్ అసలు పేరు నిస్సార్ అరోత్ ఇబ్రహీం. హిందీ, మలయాళ పాటలతో పాటు ఉదిత్ నారాయణ్, అర్జిత్ సింగ్, అతీఫ్ అస్లామ్ పాటలను అద్భుతంగా పాడేవారు. ఆయనకు భార్య షహానా నిసార్, ఇద్దరు కుమార్తెలు (సింబ్రీనా, అంబ్రీనా) ఉన్నారు.
ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ!
ప్రముఖుల సంతాపం
ఆయన అకాల మరణం పట్ల ఆర్జే మిథున్ రమేష్, ప్లేబ్యాక్ సింగర్ అఫ్సల్, ఇతర యూఏఈ ఈవెంట్ నిర్వాహకులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : పవిత్ర గంగలో మూడు మునకలు: అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి


