పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ.. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మార్గంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు మరింత కఠిన ఆంక్షలకు ఇరాన్ సిద్ధమవుతోంది. జలసంధి సమీపంలో కొత్తగా ‘నిషేధిత జోన్’ ఏర్పాటు చేయడంతోపాటు.. నౌకల కోసం ఒమన్‌తో కలిసి కొత్త షిప్పింగ్ రూట్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
ఇరాన్ ప్రకటించబోయే కొత్త నిషేధిత ప్రాంతం హర్ముజ్ జలసంధికి వెలుపల గల గల్ఫ్ ప్రాంతాల్లో ఉంటుందని ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ తెలిపారు. ఈ ప్రాంతం అమెరికా నౌకాదళం ఏర్పాటు చేసిన దిగ్బంధ రేఖ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ జోన్‌లోకి ప్రవేశించే నౌకలను ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు హెచ్చరించారు.
అయితే ఈ నిషేధిత ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితమైన సరిహద్దులను ఇరాన్ ఇంకా వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ఒమన్‌తో కలిసి కొత్త రూట్
ఇదే సమయంలో హర్ముజ్ గుండా సాగే నౌకలకు ప్రత్యామ్నాయంగా కొత్త అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఇరాన్, ఒమన్ నిర్ణయించాయి. ఈ రూట్ ఇరాన్, ఒమన్ జలాల్లోనే ఉంటుంది. దీనికి సంబంధించిన మ్యాప్‌లు, ఏర్పాట్లపై ఇరు దేశాలు ఇప్పటికే అంగీకారానికి వచ్చినట్లు రెజాయీ వెల్లడించారు. త్వరలోనే దీనిపై అధికారికంగా సంతకాలు చేయనున్నారు.
కొత్త మార్గాన్ని ఇరాన్ నిర్వహించనుంది. అయితే అమెరికా నుంచి తమపై కొనసాగుతున్న ‘దాడులు, బెదిరింపులు, విధ్వంసక చర్యలు’ ఆగే వరకు హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని హామీ ఇవ్వలేమని ఇరాన్ స్పష్టం చేసింది.
రోజుకు పది నౌకలే!
ప్రపంచ రవాణాకు కీలకమైన హర్ముజ్‌లో ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. గత పది రోజుల్లో ఈ జలసంధి గుండా రోజుకు సగటున కేవలం 10 సరుకు నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మే తర్వాత ఇదే అత్యల్ప స్థాయి.
శనివారం కేవలం రెండు నౌకలు, ఆదివారం ఆరు నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాయి. వాటిలో ఎక్కువ శాతం ఇరాన్ సూచించిన మార్గాన్నే ఉపయోగించినట్లు సమాచారం. సముద్ర రవాణా డేటా సంస్థ కేప్లర్ ప్రకారం.. బుధవారం తర్వాత హర్ముజ్ నుంచి ఒక్క భారీ ముడిచమురు రవాణా నౌక (వీఎల్‌సీసీ) కూడా బయటకు రాలేదు.
చమురు మార్కెట్‌పై ప్రభావం
హర్ముజ్ ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మార్గం. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి గుండా రవాణా అయ్యేది. ఎల్‌ఎన్‌జీ సరఫరాకు కూడా ఇది ప్రధాన మార్గమే. నౌకల రాకపోకలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర 0.8 శాతం పెరిగి బ్యారెల్‌కు 97 డాలర్లకు పైగా చేరింది.
మూడు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడి
మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. శనివారం అమెరికా దళాలు మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడులు చేశాయి. వీటిలో ఒకటి ఖార్గ్ ద్వీపం సమీపంలో ఉన్నట్లు సమాచారం. అంతకుముందు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికా యుద్ధ నౌకలపై దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది.
అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. దిగ్బంధ నిబంధనలను అమలు చేసే క్రమంలో ఇప్పటికే 92 వాణిజ్య నౌకలను దారి మళ్లించారు. మూడు నౌకలను నిర్వీర్యం చేసి, మరో రెండు నౌకలను తనిఖీ కోసం అదుపులోకి తీసుకున్నారు.
ఖార్గ్‌పై 550 దాడులా?
ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖార్గ్ ద్వీపం కూడా ఈ ఘర్షణల్లో ప్రధాన లక్ష్యంగా మారింది. గత కొన్ని నెలల్లో ఖార్గ్‌పై సుమారు 550 సార్లు దాడులు జరిగినప్పటికీ.. అక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఇరాన్ ఇంధన శాఖ మంత్రి మొహ్సెన్ పక్ణేజాద్ తెలిపారు. యుద్ధానికి ముందు ఇరాన్ ఎగుమతి చేసే ముడిచమురులో దాదాపు 90 శాతం ఖార్గ్ ద్వీపం నుంచే వెళ్లేది. అయితే ఏప్రిల్ మధ్య నుంచి అమెరికా దిగ్బంధం కారణంగా ఈ సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
‘రోజుకు 90 లక్షల బ్యారెళ్లు వెళ్తున్నాయి’
హర్ముజ్ పూర్తిగా మూసుకుపోయిందన్న వార్తలను అమెరికా ఖండిస్తోంది. రోజుకు సుమారు 90 లక్షల బ్యారెళ్ల చమురు ఇప్పటికీ ఈ జలసంధి గుండా వెళ్తోందని అమెరికా ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. పైప్‌లైన్ల ద్వారా ప్రత్యామ్నాయంగా తరలిస్తున్న చమురును కలుపుకుంటే యుద్ధానికి ముందు రవాణాలో మూడింట రెండొంతులు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో సరఫరా కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్ మాత్రం రోజుకు 10–15 లక్షల బ్యారెళ్ల చమురు విక్రయిస్తున్నామని చెబుతోంది. తమ ఉత్పత్తి, వాణిజ్యం సాధ్యమైనంత వరకు కొనసాగుతున్నాయని ఆ దేశం పేర్కొంటోంది.
‘దాడి చేస్తే మరింత తీవ్రంగా స్పందిస్తాం’
ఇదిలా ఉండగా.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలీబాఫ్ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. తమ దేశ ప్రయోజనాలు, భద్రతపై దాడులు జరిగితే ఇకపై స్పందన మరింత వేగంగా, భారీగా, బాధాకరంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి. అయినప్పటికీ ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదెహ్ స్పష్టం చేశారు.
చర్చలకు బ్రేక్.. మళ్లీ దాడులు
ఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు నిలిచిపోవడం, జూన్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. ఆ తర్వాత మళ్లీ పరస్పర దాడులు ప్రారంభం కావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో హర్ముజ్‌లో కొత్త నిషేధిత జోన్, ఇరాన్-ఒమన్ కొత్త షిప్పింగ్ రూట్ ప్రకటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హర్ముజ్ గుండా నౌకల రాకపోకలపై ఇరాన్ తీసుకునే తదుపరి నిర్ణయాలు.. చమురు ధరల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం వరకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: చైనా కాస్ట్‌లీ కలను చిదిమేసిన నేపాల్ వరద


