చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్‌ వరద | Nepal Floods Put China's Billion Dollar Railway to the Test | Sakshi
Sakshi News home page

చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్‌ వరద

Sep 7 2026 10:56 AM | Updated on Sep 7 2026 11:07 AM

Nepal Floods Put China's Billion Dollar Railway to the Test

హిమాలయాల్లో ప్రకృతి విలయం సృష్టించిన ప్రతిసారీ అక్కడి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నేపాల్‌-చైనా సరిహద్దులో సంభవించిన భారీ వరద కూడా అలాంటి ప్రశ్నలనే ముందుకు తెచ్చింది. ఆగస్టు 26న హిమనదం కూలిపోవడంతో వచ్చిన వరదల్లో నేపాల్‌లోని రసువా ప్రాంతంతోపాటు చైనా వైపున్న గ్యిరాంగ్‌ సరిహద్దు ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు రద్దీగా ఉండే ఈ సరిహద్దు వాణిజ్య కేంద్రం.. ఇప్పుడు బురద, శిథిలాల కుప్పగా మారింది.

ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన గ్యిరాంగ్‌.. చైనా-నేపాల్‌ ప్రతిపాదిత రైల్వే మార్గంలో కీలకమైన సరిహద్దు ప్రాంతం. ఇక్కడి నుంచే రైల్వే నేపాల్‌లోకి ప్రవేశించి, రసువా మీదుగా కాఠ్‌మాండూకు చేరేలా ప్రణాళిక ఉంది. చైనా ప్రతిపాదించిన ఈ రైల్వేను బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ)లో భాగంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా నుంచి నేపాల్‌కు నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, రాకపోకలకు ఇది కీలకమైన మార్గంగా మారుతుందని అంచనా.

అంత ఈజీనా?
ఖాట్మాండు-గ్యిరాంగ్‌ రైల్వే ప్రాజెక్టు సాధారణ రైల్వే మార్గం కాదు. నేపాల్‌ పరిధిలో సుమారు 72 కిలోమీటర్ల మేర ఈ లైన్‌ నిర్మించాల్సి ఉంటుంది. కానీ పర్వత ప్రాంతం కావడంతో ఇందులో దాదాపు 98.5 శాతం మార్గం సొరంగాలు లేదంటే వంతెనల మీదుగానే నిర్మించాల్సి ఉంటుందని ప్రాథమిక అధ్యయనం తేల్చింది. అంటే.. రైల్వే పట్టాలు వేయడం కంటే ముందుగా కొండలను తొలిచి సొరంగాలు నిర్మించాలి. లోతైన లోయలపై భారీ వంతెనలు వేయాలి. ఎత్తుల్లో భారీ తేడాలను అధిగమించాలి. దీనికితోడు ఈ ప్రాంతం భూకంపాలు, కొండచరియలు, రాళ్లు విరిగిపడటం, మట్టి జారిపోవడం వంటి ప్రమాదాలకు లోనయ్యే ప్రాంతం.

ప్రాజెక్టుపై 2018లో నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. భౌగోళిక పరిస్థితులు, ఇంజినీరింగ్‌ సవాళ్లు ఈ రైల్వేకు అతిపెద్ద అడ్డంకులని పేర్కొంది. అప్పట్లో సుమారు 2.75 బిలియన్‌ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

ఏళ్లుగా సాగుతున్న అధ్యయనాలు
చైనా-నేపాల్‌ రైల్వే ఆలోచన కొత్తదేమీ కాదు. 2016లో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2018లో బీఆర్‌ఐలో భాగమైంది. 2019లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ నేపాల్‌ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 2022లో పూర్తిస్థాయి సాధ్యాసాధ్యాల అధ్యయనం మొదలైంది. మార్గం, సొరంగాలు, వంతెనలు, స్టేషన్లు, నిర్మాణ వ్యయం, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలపై చైనా సాంకేతిక బృందం పరిశీలనలు చేసింది. తుది నివేదిక ఆధారంగానే ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదా? అనేది తేలనుంది.

ఇంతలోనే భారీ విపత్తు
ఇలాంటి సమయంలోనే ఆగస్టు 26న హిమనదం(గ్లేసియర్‌) కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి నీటితో కలిసి దిగువకు దూసుకొచ్చాయి. నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. ఆ వరద చైనా వైపు గ్యిరాంగ్‌ వరకు చేరింది. కీలకమైన సరిహద్దు కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఐదు అంతస్తుల కస్టమ్స్‌ భవనం కూడా ఆనవాళ్లు లేకుండా పోయింది. తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో 1,300 మందికి పైగా మరణించగా, వేలాది మంది గల్లంతయ్యారు. చైనా వైపు గ్యిరాంగ్‌లో 43 మంది మృతి చెందగా, 519 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

ఈ విధ్వంసం ఇప్పుడు రైల్వే ప్రాజెక్టుపై కొత్త ఆలోచనలకు కారణమవుతోంది. ఒక భారీ వరదతోనే రహదారులు, వంతెనలు, సరిహద్దు మౌలిక వసతులు ఇలా ధ్వంసమైతే.. ఇదే భూభాగంలో నిర్మించబోయే రైల్వే సొరంగాలు, వంతెనలు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎలా తట్టుకుంటాయి? అనేదే అసలు ప్రశ్న.

రైల్వే కంటే ముందు..
తాజా విపత్తు నేపథ్యంలో ప్రాజెక్టు మార్గాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. హిమనదాల కదలికలు, వరదల ప్రవాహ మార్గాలు, భూకంప ముప్పు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు వంటి అంశాలపై మరింత లోతైన అధ్యయనాలు అవసరం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవిస్తే రైల్వేకు నష్టం జరగకుండా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, రక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

మరోవైపు గ్యిరాంగ్‌ ప్రాంతం చైనా-నేపాల్‌ వాణిజ్యానికి కీలకమైన మార్గం. తాజా విపత్తుతో ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైల్వే నిర్మాణానికి ముందే అక్కడి మౌలిక వసతులను ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మార్చాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.

బీఆర్‌ఐ అటకెక్కినట్లేనా?
అయితే తాజా వరదలతో చైనా బీఆర్‌ఐ మొత్తం ఆగిపోయిందని చెప్పలేం. కానీ చైనా-నేపాల్‌ అనుసంధానానికి కీలకంగా భావిస్తున్న ఈ రైల్వే ప్రాజెక్టుకు మాత్రం ప్రకృతి పెద్ద పరీక్ష పెట్టింది. నిర్మాణం ఇంకా మొదలుకాకపోవడం ఒక రకంగా ప్రాజెక్టుకు అవకాశం కూడా. ఇప్పుడు ఎదురైన విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుని మార్గం, డిజైన్‌, భద్రతా ప్రమాణాలను మార్చుకునే అవకాశం చైనాకు ఉంది.

హిమాలయాల్లో బీఆర్‌ఐ రైల్వేను ముందుకు తీసుకెళ్లడం అనుకున్నంత సులభం కాదని తాజా ప్రకృతి విపత్తు గట్టిగా చాటిచెబుతోంది. ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుందా? మార్గంలో మార్పులు వస్తాయా? లేదంటే ప్రకృతి సవాళ్లను అధిగమించేలా భారీ ఇంజినీరింగ్‌ పరిష్కారాలతో చైనా ముందుకెళ్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: యుద్దం ఎఫెక్ట్‌.. బూతు కంటెంట్‌తో మరీ ఇంత దిగజారాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement