కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ జవాన్లు సుమారు రూ.17.40 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను స్వా«దీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక బంగ్లాదేశ్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. బీఎస్‌ఎఫ్ 32వ బెటాలియన్ పహారాలో ఉండే నాడియా జిల్లాలోని హల్దార్‌పారా పోస్ట్ సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని తెలిపారు.
బంగ్లాదేశ్ జాతీయుడి నుంచి మొత్తం 11.28 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువైన దాదాపు రూ.17.40 కోట్ల విలువైన 89 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ కోసం ఆ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. 2023 ఆగస్టు నుంచి ఇప్పటివరకు దేశ సరిహద్దులో రూ.100 కోట్ల విలువైన 120 కిలోగ్రాములకు పైగా బంగారాన్ని స్వా«దీనం చేసుకోవడం గమనార్హం.


