పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పాలన సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతుందనుకున్న వేళ.. ఓ ఎమ్మెల్యే సొంత పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని బలోపేతం చేయడం, ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాల్సిన నేతలు.. రీల్స్ చేయడం, ఫాలోవర్లను పెంచుకోవడం, సొంత ప్రచారానికే పరిమితమవుతున్నారని ఆరోపించారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే కొందరు నాయకులు ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు.
బంకురా జిల్లా ఓండా నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అమర్‌నాథ్ షాకా(Amarnath Sakha).. సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని కొందరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నో ఏళ్లుగా బీజేపీతో కొనసాగుతున్నానని, తప్పు అనిపించిన విషయాలపై మౌనంగా ఉండలేనని పేర్కొన్నారు. ‘‘ఎవరినీ సంతోషపెట్టేందుకు నేను ప్రయత్నించను. తప్పు అనిపించిన దానిని వ్యతిరేకిస్తాను. అందుకే చాలామంది శత్రువులయ్యారు. అది నాకు సమస్య కాదు’’ అని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బీజేపీ నేతలు వాటిని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టడం లేదని షాకా విమర్శించారు. ‘‘ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కొందరు నేతలు సొంత ప్రచారంలోనే మునిగిపోతున్నారు. సీపీఐ(ఎం)కు కౌంటర్ లేదు.. నిరసన లేదు.. ఏమీ లేదు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకంటే బయటి ఈవెంట్లలో ఎక్కువ పాల్గొంటున్నారు. అందరూ రీల్స్ చేయడం, ఫాలోవర్లను పెంచుకోవడం, ఫ్యాన్ క్లబ్‌లు ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు’’ అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘పార్టీని పతనం దిశగా..’
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు నేతల వైఖరిలో మార్పు వచ్చిందని షాకా ఆరోపించారు. పదవులు, అధికారంతో వచ్చే ప్రయోజనాలపైనే వారి దృష్టి ఉందని విమర్శించారు. ‘‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా.. అందరూ దాని ప్రయోజనాలను అనుభవించడంలో బిజీగా ఉన్నారు. సొంత కడుపులు నిండితే చాలు.. పార్టీ నరకానికి పోయినా పట్టించుకోరు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘సంపాదన మీదే దృష్టా?’’
బీజేపీ కార్యకర్తలు వ్యక్తిగత నాయకుల అభిమానులుగా కాకుండా పార్టీ కోసం పనిచేయాలని షాకా పిలుపునిచ్చారు. ‘‘ఫలానా నాయకుడి అనుచరుడు అవ్వడం బదులు ముందుగా పార్టీకి అనుచరులుగా మారండి. నాయకులు వస్తారు.. పోతారు.. పార్టీ మాత్రం శాశ్వతంగా ఉంటుంది’’ అని సూచించారు.
తాను పార్టీ కోసం వ్యక్తిగత జీవితాన్ని, యవ్వనాన్ని, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టానని షాకా చెప్పుకున్నారు. సీపీఐ(ఎం) పాలనలో 34 ఏళ్ల హింస, రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొన్నానని, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పాలనలోనూ ఎన్నో ఇబ్బందులు చూశానని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని అన్నారు.
అయితే ఇప్పుడు కొందరి వ్యవహారశైలితో పార్టీ నష్టపోతోందని ఆరోపించారు. ‘‘పార్టీ బాధపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. డబ్బు సంపాదించడంపైనే అందరి దృష్టి’’ అని వ్యాఖ్యానించారు.
వామపక్షాల పునరాగమనంపై చర్చ
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసింది. దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం టీఎంసీ పార్టీని పతన స్థితికి తీసుకెళ్లింది. ఇదే అదనుగా బెంగాల్‌లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష కూటమి మరోసారి సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. యువ నాయకులను ముందుకు తీసుకురావడంతో పాటు వీధి పోరాటాలను ముమ్మరం చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నాయకత్వంపై షాకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అయితే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. వామపక్ష కూటమి కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. 2021తో పోలిస్తే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి ఓటు శాతం దాదాపు నాలుగు శాతం తగ్గింది. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు నెలల పాలన పూర్తి చేసుకోబోతున్న వేళ.. ప్రస్తుత పరిస్థితులు మాత్రం లెఫ్ట్ పార్టీల జనాదరణ కాస్త పెరిగిందనే చెబుతున్నాయి.
పార్టీ వేదికపైనే మాట్లాడాలి: బీజేపీ నేత
షాకా సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలపై బీజేపీ స్పందించింది. ఓ సీనియర్ నేత మాట్లాడుతూ.. పార్టీకి సంబంధించిన అంశాలను బహిరంగంగా కాకుండా అంతర్గత వేదికల్లో చర్చించాలని సూచించారు. షాకా పార్టీకి నమ్మిన బంటని.. సీనియర్ నాయకుడని, ఆయన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉందని, పార్టీ అంతర్గతంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తే పరిశీలిస్తామని పేర్కొన్నారు.
ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని కొందరు నేతలు పార్టీ కార్యకర్తలు, నాయకులు వసూళ్లు, కట్‌మనీ వంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో షాకా తాజా వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తంగా బెంగాల్‌లో వామపక్షాలు తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. బీజేపీ అంతర్గతంగా నాయకత్వం, సంస్థాగత పనితీరు, సోషల్ మీడియా ప్రచారం చుట్టూ మొదలైన ఈ వివాదం పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది.
ఇదీ చదవండి: పాక్ ప్రధాని సమక్షంలో మోదీ స్ట్రాంగ్ కౌంటర్


