అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎంపికపై బుధవారం తుది నిర్ణయం తీసుకోనుంది. 5,500కి పైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ తుది జాబితాను రూపొందించింది. అయోధ్యలోని మణిరాందాస్ చావనీలో ట్రస్ట్ అధ్యక్షుడు నృత్యగోపాల్ దాస్ నివాసంలో జరిగే సమావేశంలో సీఈవోతో పాటు ఖాళీగా ఉన్న ఇతర కీలక పదవుల నియామకాలనూ ఖరారు చేయనున్నారు.
రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణుల కమిటీ సభ్యుడు సురేష్ హవ్డేలతో కూడిన ప్యానెల్ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. మొత్తం 5,585 దరఖాస్తులను క్షుణ్ణంగా సమీక్షించి, 16 మంది అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించినట్లు ట్రస్ట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. జులై 11 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 600 మార్కుల మూల్యాంకన విధానం ద్వారా అభ్యర్థుల అర్హతలను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 3,577 మందికి ఫారాలు పంపగా, కనీసం 470 మార్కులు సాధించిన 108 మంది అర్హత పొందారు.
వీరికి నాలుగు రోజుల పాటు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వారి ప్రతిభ ఆధారంగా 17 మందిని గ్రేడ్లుగా విభజించారు. చివరికి నిబద్ధత, దార్శనికత ఆధారంగా అత్యుత్తమమైన ముగ్గురిని ఎంపిక చేసి ట్రస్ట్‌కు సమర్పించారు. ట్రస్ట్ సభ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం, కానుకల చోరీ ఆరోపణలు, మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాల అనంతరం ఏర్పడిన ఖాళీల నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా ట్రస్ట్ తొలి కార్యదర్శిగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి జగదీశ్ ఆఫ్లే నియమితులయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అలాగే వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాంగ్డాను కూడా ట్రస్ట్‌లోకి తీసుకునే అవకాశముంది. తుది నిర్ణయాన్ని బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ప్రకటిస్తుందని ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు.
ఇది కూడా చదవండి: నేపాల్: టన్నెళ్లలో భారత రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు


