Nepal Flash Floods నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన అస్సాంకు చెందిన ఎనిమిది మంది కార్మికులు క్షేమంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అదే రాష్ట్రానికి చెందిన మరో ఎనిమిది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ సందర్భంగా ప్రాణాలతో బయటపడ్డ కార్మికులు తమకెదురైన భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు. వీ
రంతా నేపాల్‌లోని 'అప్పర్ త్రిశూలి-1' హైడ్రోపవర్ ప్రాజెక్టు' (Upper Trishuli-1 Hydropower Project) లో పనిచేస్తున్నారు. నేపాల్ అధికారులు , అస్సాం ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల ద్వారా సురక్షితంగా ప్రాణాలతో బయటపడి ఆదివారం రాత్రి అస్సాం చేరుకున్నారు.
సురక్షితంగా తిరిగొచ్చినవారు
పంకజ్ బర్మన్, గోపాల్ చాంద్ దేబ్‌నాథ్, గౌతమ్ దాస్, సమర్ బెజ్బారువా, సర్విషన్ మరక్, సనేశ్వర్ నర్జారీ, సిల్వా మరక్ , ఎలిప్సన్ సంగ్మా ఆదివారం రాత్రి అస్సాం చేరుకున్నారు.
ఇదీ చదవండి : 6 రోజుల్లొ 100 రెస్క్యూ ఆపరేషన్లు: ఎవరీ ప్రియా అధికారి?
భయానక అనుభవం
వరద నీరు, శిథిలాలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తడంతో, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఈ కార్మికుల కష్టాలు మొదలయ్యాయి. పెద్ద శబ్దం వినపడటంతో కార్మికులు కొండలపైకి పరుగులు తీశారు. దాదాపు రెండు రోజుల పాటు ఆహారం, తాగునీరు లేకుండా అక్కడే గడిపారు. చివరకు నేపాల్ సైనిక హెలికాప్టర్లు కొండపై ఉన్న వీరిని గుర్తించి వాటర్ బాటిళ్లు, బిస్కెట్లు అందించాయి. ఆ తర్వాత వారిని ఖాట్మండుకు తరలించి, అక్కడి నుండి అస్సాం ప్రభుత్వం సహాయంతో భారతదేశానికి రప్పించారు.
నల్బారీకి చెందిన పంకజ్ బర్మన్ మాట్లాడుతూ,పెద్ద శబ్దం వినడంతో ఏదో తీవ్రమైన ప్రమాదం జరిగిందని గ్రహించి తమ బృందం కొండల వైపు పరుగెత్తిందని, కొండ పైభాగానికి చేరి, ఆ తర్వాత కనీస అవసరాలు కూడా లేకుండా అక్కడే గడపాల్సి వచ్చిందని చెప్పారు హోజాయ్‌కి చెందిన గౌతమ్ దాస్ మాట్లాడుతూ ఈ భయంకరమైన అనుభవాన్ని తాను జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. మృత్యువును చాలా దగ్గరగా చూశాను, ఏదోలా ప్రాణాలతో బయటపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
మరో 8 మంది గల్లంతు
విపత్తు సమయంలో అస్సాంకు చెందిన 16 మంది అక్కడ పనిచేస్తున్నారు. ఎనిమిది మంది క్షేమంగా తిరిగొచ్చినప్పటికీ, మిగిలిన ఎనిమిది మంది సమాచారం ఇంకా తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బాధితుల కుటుంబాల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. గల్లంతైన వారికోసం నేపాల్ అధికారులతో కలిసి శోధన చర్యలు కొనసాగుతున్నాయి.


