కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించే దేశంలోని ఐదు ప్రముఖ కృష్ణ దేవాలయాలు ఇవే..
ఇస్కాన్ ద్వారక (న్యూఢిల్లీ)
ఢిల్లీలోని రుక్మిణీ ద్వారకాధీశ్ ఆలయంలో సెప్టెంబరు 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. మొదటి రోజు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, అధివాస వేడుకలు ఉండగా, రెండో రోజు మంగళ హారతి, కలశ అభిషేకం, కీర్తనలతో పాటు అర్ధరాత్రి మహా అభిషేకం, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శ్రీకృష్ణ జన్మభూమి (మథుర)
శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర స్థలంగా భావించే మథురలో జన్మాష్టమి ఉత్సవాలు అంబరాన్నంటుతాయి. ఆలయంతో పాటు నగర వీధులన్నీ భక్తుల కోలాహలం, అర్ధరాత్రి ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటాయి.
బాంకే బిహారీ ఆలయం (బృందావనం)
కృష్ణుని బాల్య స్మృతులతో ముడిపడిన బృందావనంలోని ఈ ప్రసిద్ధ ఆలయ పరిసరాలు ‘రాధే రాధే’ నామస్మరణతో మార్మోగుతాయి. బ్రజ్ ప్రాంతపు ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తారు.
ద్వారకాధీశ్ ఆలయం (ద్వారక, గుజరాత్)
శ్రీకృష్ణుడు పరిపాలకుడిగా వెలుగొందిన ద్వారకలో జన్మాష్టమి వేడుకలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రోజంతా సాగే ప్రత్యేక పూజాదికాలు, అలంకరణలు అర్ధరాత్రి కృష్ణుని జన్మ మహోత్సవంతో పతాక స్థాయికి చేరుకుంటాయి.
ప్రేమ్ మందిర్ (బృందావనం)
తెల్లటి పాలరాతితో నిర్మితమైన ఈ ఆలయం కృష్ణుని జీవిత ఘట్టాల కళారూపాలతో కనువిందు చేస్తుంది. జన్మాష్టమి వేళ రాత్రిపూట విద్యుద్దీపాల కాంతుల్లో హారతులు, భజనలతో ఈ ప్రాంగణం భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. భక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణానికి అనుగుణంగా ఈ క్షేత్రాలను సందర్శించి శ్రీకృష్ణుని అనుగ్రహం పొందవచ్చు.
ఇది కూడా చదవండి: ఎస్‌సీవో వేదికగా పాక్‌కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్


