ఐఏఎస్‌కు దివ్య మిట్టల్‌ గుడ్‌బై.. అఖిలేష్‌ సంచలన వ్యాఖ్యలు | Divya Mittal said her resignation from the IAS | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌కు దివ్య మిట్టల్‌ గుడ్‌బై.. అఖిలేష్‌ సంచలన వ్యాఖ్యలు

Aug 31 2026 7:43 AM | Updated on Aug 31 2026 7:51 AM

Divya Mittal said her resignation from the IAS

విదేశాల్లో లక్షల జీతం.. ఐఏఎస్‌లో ప్రతిష్ఠాత్మక కెరీర్‌.. అయినా ఆమె ఎందుకు అన్నింటినీ వదిలేశారు? 13 ఏళ్ల సుదీర్ఘ ఐఏఎస్‌ ప్రస్థానానికి దివ్య మిట్టల్‌ స్వచ్ఛందంగా ముగింపు పలికారు. ఉన్నత పదవి, అధికారం, గుర్తింపు ఉన్నప్పటికీ తన జీవితానికి అవే అంతా కాదని తేల్చిచెప్పారు. ఎలాంటి ఒత్తిడి లేదని, ఆకస్మిక నిర్ణయం కాదని స్పష్టం చేసిన ఆమె.. కుటుంబం, వ్యక్తిగత ఆసక్తులు, జీవితంలో చేయాలనుకున్న మరిన్ని పనుల కోసమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఆమె..‘ఐఏఎస్‌ నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే.. నా మొత్తం జీవితం కాదు’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు.. ఆమె రాజీనామా అంశంపై అఖిలేష్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2013 బ్యాచ్‌కు చెందిన దివ్య మిట్టల్‌ యూపీలోని దేవరియా, మీర్జాపూర్‌, సంత్‌ కబీర్‌నగర్‌ జిల్లాలకు జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. ప్రస్తుతం రెవెన్యూ బోర్డులో స్పెషల్‌ సెక్రటరీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాపై స్పందించిన దివ్య మిట్టల్‌.. ‘ఐఏఎస్‌ ఉద్యోగం నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే.. నా మొత్తం ఉనికి కాదని అన్నారు. తన ఇద్దరు కుమార్తెలు, కుటుంబ బాధ్యతలతో పాటు చాలాకాలంగా తనకు ఉన్న ఆసక్తులను కూడా ఇకపై కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. రచన, బోధన లేదా సామాజిక సేవలో ఏదైనా చేయొచ్చని ఆమె వెల్లడించారు. అయితే భవిష్యత్‌ ప్రణాళికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.

అఖిలేష్‌ సంచలన వ్యాఖ్యలు..
మరోవైపు.. ఐఏఎస్‌ అధికారి దివ్య మిట్టల్‌ రాజీనామా రాజకీయ రంగు పులుముకుంది. ఆమె నిర్ణయంపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌.. ఉత్తరప్రదేశ్‌లో నిజాయితీగా పనిచేసే అధికారులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు. యోగి ప్రభుత్వంలో నిజాయితీగల అధికారులు పనిచేయలేకపోతున్నారు. అవినీతి కారణంగా వారు విధులు నిర్వర్తించలేకపోతున్నారు. అధికారులపై అంత ఒత్తిడి ఉంది.. రిటైర్మెంట్‌కు ముందే ఉద్యోగాలను వదిలేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.

విదేశాల్లో భారీ జీతాలు.. అయినా భారత్‌కు తిరిగి
ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్న దివ్య మిట్టల్‌.. లండన్‌లో ఉద్యోగం కూడా చేశారు. జేపీ మోర్గాన్‌లో పనిచేసిన ఆమెకు అక్కడ మంచి కెరీర్‌ ఉండేది. ఆమె భర్త, మాజీ ఐఏఎస్‌ అధికారి గగన్‌దీప్‌ సింగ్‌ ధిల్లాన్‌ కూడా సిటీ గ్రూప్‌లో పనిచేశారు. అయితే విదేశాల్లో మంచి జీతాలు, విజయవంతమైన కెరీర్‌ ఉన్నప్పటికీ ఏదో లోటుగా అనిపించడంతో ఇద్దరూ భారత్‌కు తిరిగివచ్చారు. అనంతరం దివ్య మిట్టల్‌ సివిల్‌ సర్వీసెస్‌లోకి ప్రవేశించారు. 2012లో రెండో ప్రయత్నంలో ఆల్‌ ఇండియా 68వ ర్యాంక్‌తో ఐఏఎస్‌ సాధించారు.

దేవరియా నుంచి మీర్జాపూర్‌ వరకు..
ఉత్తరప్రదేశ్‌లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన దివ్య మిట్టల్‌ తన పోస్టింగులు తనకు పరిపాలనకు మించిన జీవిత పాఠాలను నేర్పాయని చెప్పారు. దేవరియాలో సరైనదాని కోసం నిలబడటం బాధ్యత అని నేర్చుకున్నానని, మీర్జాపూర్‌లో ‘‘అసాధ్యం’’ అనేది వాస్తవం కాదు.. ఒక అభిప్రాయం మాత్రమే అని తెలుసుకున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె సమర్పించిన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. యూపీ ప్రభుత్వం సిఫార్సు చేసిన అనంతరం తుది నిర్ణయం కేంద్ర హోంశాఖ తీసుకోనుంది.

ఆమె సేవలో గుర్తుండిపోయే అంశాలు
లహురియాదహ్‌కు నల్లా నీరు: మిర్జాపూర్‌లోని లహురియాదహ్‌ గ్రామ ప్రజలు చాలా కాలంగా ట్యాంకర్‌ నీటిపై ఆధారపడేవారు. దివ్య మిట్టల్‌ హయాంలో అక్కడ పైపుల ద్వారా నీటి సరఫరా అందింది. తాజా కథనాలు దీనిని ఆమెకు గుర్తుండిపోయే ప్రజా సేవగా పేర్కొంటున్నాయి. కాగా, పదవి పోతుంది.. కానీ ప్రజల మనసుల్లో మిగిలే జ్ఞాపకాలు పోవు. లహురియాదహ్‌లో నల్లా నీరు వచ్చిన రోజు ఓ వృద్ధురాలి ఆశీర్వాదం తనతో జీవితాంతం ఉంటుందని దివ్య మిట్టల్‌ చెప్పడం.. ఆమె 13 ఏళ్ల ప్రస్థానానికి అద్దం పడుతోంది. ఇప్పుడు ఐఏఎస్‌కు రాజీనామా చేసినా ప్రజా సేవకు పూర్తిగా దూరం కావాలనుకోవడం లేదని ఆమె సంకేతాలిచ్చారు. ఐఏఎస్‌కు దివ్య మిట్టల్‌ వీడ్కోలు పలికినా.. తన లక్ష్యాలకు మాత్రం కాదని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: మాట్లాడింది.. రాహులా? భగవతా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement