తండ్రితో లాటరీ విజేత గుర్‌ప్రీత్
ఫిరోజ్‌పూర్: యథాలాపంగా కొనుగోలు చేసిన ఆ లాటరీ టిక్కెట్ ఓ పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని ఊహించని మలుపుతిప్పింది. ఒకటీరెండూ కాదు ఏకంగా 7 కోట్ల రూపాయల పంట పండించింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని మల్వాల్ కదీమ్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల గుర్‌ప్రీత్ సింగ్ 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఫిరోజ్‌పూర్‌కు వ చ్చిన గుర్‌ప్రీత్ ‘పంజాబ్ స్టేట్ డియర్ రాఖీ బంపర్ డ్రా’ లాటరీ టిక్కెట్ ఒకటి కొనుగోలు చేశారు.
ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయారు. ఆదివారం ఉదయం గురుద్వారా వాజిద్‌పూర్ సాహిబ్‌లో సేవా కార్యక్రమాల్లో ఉండగా ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. తాను కొనుగోలు చేసిన టిక్కెట్ డ్రాలో గెలిచిందన్నదే ఆ ఫోన్ సమాచారం. దీంతో, ఎగిరి గంతేశారు గుర్‌ప్రీత్. ‘ఎదో యథాలాపంగా కొనుగోలు చేసిన ఆ టిక్కెట్ నాకు ఇంతపెద్ద అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని అస్సలు అనుకోలేదు. ఇదంతా ఒక కలగా ఉంది’ అని ఆనందంతో చెప్పారు. గుర్‌ప్రీత్ 2022లో పంజాబ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా చేరారు. ఈయన తండ్రి దర్శన్ సింగ్ రైల్వే గార్డ్‌గా పనిచేసి రిటైరయ్యారు. లాటరీ గెలిచిన విషయం తెలియగానే ఆయన నివాసంలో పండగ వాతావరణం నెలకొంది.


