తాష్కెంట్: రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్థాన్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, తాష్కెంట్‌లో ‘యోగా ఫెడరేషన్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్’ నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఉజ్బెకిస్థాన్‌లో యోగాకు విశేష ఆదరణ లభిస్తోందని, ప్రజలను యోగాతో అనుసంధానం చేసినందుకు అక్కడి అధ్యక్షుడికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. యోగా ద్వారా ఇరు దేశాల సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుకుంటాయని, ప్రజల మధ్య స్నేహం మరింత బలపడుతుందని అన్నారు.
అంతకుముందు తాష్కెంట్ విమానాశ్రయంలో ప్రధానికి ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్‌కత్ మిర్జియోయెవ్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా అధ్యక్ష భవనంలో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్యారంగాల్లో సహకారాన్ని ఇరు దేశాధినేతలు సమీక్షించనున్నారు. ‘వికసిత్ భారత్ 2047’, ‘ఉజ్బెకిస్థాన్-2030’ అభివృద్ధి లక్ష్యాలపై సమాలోచనలు జరుపుతారు. అలాగే తాష్కెంట్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారకం, మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు.
మోదీ రాక సందర్భంగా తాష్కెంట్‌లోని ప్రముఖ హోటల్ హిల్టన్‌తో పాటు చారిత్రక కట్టడాలను భారత త్రివర్ణ పతాక కాంతులతో ముస్తాబు చేశారు. అక్కడి 16 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు, ప్రవాసులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఉజ్బెకిస్థాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ కిర్గిజ్ రిపబ్లిక్‌లోని బిష్కెక్‌కు వెళ్లి 26వ ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.
Uzbekistan loves Yoga! pic.twitter.com/1AtlHCN0kF
— Narendra Modi (@narendramodi) August 30, 2026


