సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వ హయాంలో భారీగా మైనింగ్ అక్రమాలు, అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. మైనింగ్ యజమానులను బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని, ఈ వ్యవహారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ ఎంపీకి సవాల్ విసిరారు.
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ పర్మిట్ల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.55 కోట్ల ఆదాయం వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.7 కోట్లు, రూ.12 కోట్లకు పరిమితమైందని ఆరోపించారు. గూడూరు నియోజకవర్గంలో మైనింగ్ యజమానులను బెదిరించి టన్నుకు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని అన్నారు.
ఎగుమతులు చేయాలంటే కూటమి ఎంపీ అనుచరులకు తప్పనిసరిగా ‘శిస్తు’ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కో మైనింగ్ యజమాని నుంచి రూ.10 కోట్ల చొప్పున వసూలు చేసి దాదాపు రూ.200 కోట్లు సమీకరించారు. ఈ వ్యవహారం ‘ఫినీ క్వార్ట్జ్’ అనే కంపెనీ పేరుతో ఎంపీ అనుచరుడు విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సాగుతోందని పేర్కొన్నారు. చైనాకు చెందిన ‘డౌ’ అనే వ్యక్తిని తీసుకొచ్చి, అతనికే మైనింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఒక చైనా వ్యక్తిని రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ తరహా వ్యవహారాలు నడపడం దేశ భద్రతకు ముప్పుగా మారే అంశమని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని డిమాండ్ చేశారు.
చదవండి: పార్టీ పదవుల భర్తీ అన్నారు.. ఎప్పుడు?
తమకు ఎదురు తిరిగిన మైనింగ్ సంస్థలపై డీఎంజీ శాఖ ద్వారా చర్యలు తీసుకుని మైన్స్ మూసివేయిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలతో కొన్ని గనులు మూతపడే పరిస్థితి వచ్చిందని, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల్లోనూ అక్రమ మైనింగ్ జరుగుతోంది. సైదాపురం మండలంలోని సిద్ధేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మైనింగ్ చేసి సహజ వనరులను దోచేస్తున్నారని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి విచారణకు ఆదేశించినా అది ముందుకు సాగకుండా అడ్డుకునే స్థాయి ఒక్క ఎంపీ వేమిరెడ్డికే ఉందని ఆరోపించారు.
తన ఆరోపణలకు మరిన్ని లోతైన ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలో బయటపెడతానని అన్నారు. మైనింగ్ అక్రమాల్లో వేమిరెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.


