బీడు పడ్డ కేసీ ఆయకట్టు! | Government not providing water to Kadapa Kurnool canal | Sakshi
Sakshi News home page

బీడు పడ్డ కేసీ ఆయకట్టు!

Aug 30 2026 5:48 AM | Updated on Aug 30 2026 5:48 AM

Government not providing water to Kadapa Kurnool canal

కడప–కర్నూలు కాలువకు నీరివ్వని కఠిన సర్కార్‌

సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమకు తిండి గింజలు.. పశువులకు పశుగ్రాసం అందించే కేసీ కాలువ ఆయకట్టు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైంది. 31.90 టీఎంసీల నీటి కేటాయింపులున్నా ఈ ఏడాది కేసీ ఆయకట్టుకు చుక్కనీరు విడుదల చేయకపోవడంతో కర్నూలు, నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. 

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని మరో 1.76 లక్షల ఎకరాల ఆయకట్టుపైనా ఈ ఏడాది తీవ్ర ప్రభావం పడనున్నది. నీళ్లొస్తాయన్న ఆశతో రైతులు వేసిన వరిపంటలు, నారుమళ్లు ఎండిపోవడంతో పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. ఏటా రెండు లక్షల ఎకరాలకు పైగా వరి సాగయ్యే కేసీ ఆయకట్టు ప్రాంతంలో ఈసారి సాగు నిలిచిపోవడంతో రాయలసీమలో తిండిగింజలతోపాటు పశుగ్రాసం కొరత తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది.

బీళ్లుగా మారిన పంటపొలాలు..  
కర్నూలు, నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో విస్తరించిన కేసీ కాలువ పరిధిలో నేరుగా 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉండగా.. పరోక్షంగా కేసీ చివరి ఆయకట్టు నీరు కడప జిల్లాలోని పెన్నానది గుండా  సోమశిలకు చేరి నెల్లూరు జిల్లాలో 1.36 లక్షల ఎకరాలతోపాటు కండలేరు ద్వారా చిత్తూరు జిల్లాలోనూ 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది. కేసీకి 31.90 టీఎంసీల నీటి కేటాయింపులున్నా ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం కేసీ ఆయకట్టుకు చుక్క నీరివ్వలేదు. దీంతో ఆయకట్టు మొత్తం బీడుగా మారింది. నీళ్లొస్తాయన్న ఆశతో అరకొరగా ఎదపద్ధతిలో సాగుచేసిన వరిపంటతోపాటు, నారుమళ్లు కూడా ఎండిపోయాయి. దీంతో పెట్టుబడులు నష్టపోయి అన్నదాతలు లబోదిబోమంటున్నారు. 

సీమలో తిండిగింజలు,  పశుగ్రాసం కష్టాలు   
నీటికోసం రైతులు వేడుకుంటున్నా.. చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడాలేదు. కేసీకి నీళ్లిచ్చే ఆలోచన ఏమాత్రం కనిపించడంలేదు. కేసీ పరిధిలో ఏటా 2 లక్షల ఎకరాలకు పైగా రైతులు  వరిపంట సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కేసీకి నీళ్లివ్వకపోతే వరితోపాటు ఇతర పంటలసాగు కూడా లేకుండా పోతుంది. తిండి గింజలతోపాటు సీమలో పశుగ్రాసం కొరత తీవ్ర రూపం దాల్చనుంది. ఏటా కర్నూలు, అనంతపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా పరిధిలోని ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల రైతులు కేసీ పరిధిలోని గ్రామాలనుంచి ధాన్యం, పశుగ్రాసం తీసుకు వెళ్లేవారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలతోపాటు లక్షలాది పశువులకు ఈ ఏడాది గ్రాసం దొరికే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటికే గ్రాసం కొరతతో మూగ జీవాలను కబేళాలకు అమ్ముకుంటున్నారు.

వైఎస్‌ జగన్‌ పాలనలో కేసీ కింద ఏటా రెండు పంటలు   
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాయలసీమ­లోని కేసీ, తుంగభద్ర ఎగువకాలువ, దిగువ­కాలువ, గోరకల్లు, అవుకు, గండికోట, బ్రహ్మంసాగర్, మైలవరం, చిత్రావతి, అన్నమయ్య, సోమశిల, కండలేరుతో సహా అన్ని సాగునీటి వనరులను నీటితో నింపారు. ఐదేళ్లపాటు పంటలకు అదునులో నీళ్లిచ్చారు. దీంతో రైతులు కేసీ పరిధిలో ఎకరాకు 40 బస్తాలు (75 కిలోలు) లెక్కన 30 క్వింటాళ్ల ధాన్యం పండించారు. ఈ లెక్కన 2లక్షల ఎకరాల్లో ఒక పంటకు 60 లక్షల క్వింటాళ్ల చొప్పున రెండు పంటలకు 1.20 కోట్ల క్వింటాళ్ల ధాన్యం పండించారు. బస్తా ధాన్యం రూ. 2,500 నుంచి రూ.3 వేల వరకూ ధరపలికింది. సీమలో తిండిగింజలు, పశుగ్రాసం కొరతలేకుండా పోయింది.

వరిపంట మొత్తం ఎండిపోయింది
ఐదు ఎకరాల సొంత భూమితో పాటు మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. ట్రాక్టర్లతో దుక్కి దున్ని వరి పంట సాగు చేశాను. కేసీ కెనాల్‌కు సాగు నీరు రాకపోవడంతో ఐదు ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. ఇప్పటికే ఎకరాకు రూ. 15,000 చొప్పున రూ. 75000 పెట్టుబడి పెట్టాను. మొత్తం నష్టపోవాల్సి వచ్చింది. – పల్లె వెంకట సుబ్బారెడ్డి, రైతు, ఈర్నపాడు గ్రామం, బండి ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా.

పెట్టుబడి మొత్తం నష్టపోయాం
కేసీ కెనాల్‌ ఆయకట్టు కింద ఐదు ఎకరాల ఆలయ మాన్యం భూమి, రెండు­న్నర ఎకరాలు కౌలు భూ­ముల్లో వరి సాగు చేస్తు­న్నాను. ఎకరాకు రూ.18వేల  చొప్పున మొత్తం రూ.1.30లక్షల దాకా ఖర్చు పెట్టాను. వర్షాలు కురవక పోవడం, కేసీకి సాగునీరు రాకపోవడంతో వరి పైరు మొత్తం ఎండిపోతోంది. – సూరిపల్లి మధుబాబు గౌడ్, కానాల గ్రామం, నంద్యాల మండలం

భూములన్నీ బీడు పడ్డాయి
ఈ ఏడు వర్షాలు కురవలేదు. కేసీ కెనాల్‌ నీళ్లన్నా ఇస్తారనుకుంటే ప్రభుత్వం చుక్కనీరివ్వలేదు. దీంతో భూములన్నీ బీడు పడ్డాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌నెడ్డి హయాంలో  కేసీ కాలువకు ఐదేళ్లు వరుసగా నీళ్లిచ్చారు. ఏటా రెండు పంటలు పండించుకున్నాం. – ఆంజనేయులు, రైతు, సిద్దారెడ్డిపల్లె, చాపాడు మండలం, వైఎస్సార్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement