పార్టీ సంస్థాగత బలోపేతానికి చర్యలు తీసుకోవాలి
స్థానిక, మునిసిపల్ ఎన్నికలను ఇందుకు అవకాశంగా తీసుకోవాలి
బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి పార్టీ పెద్దల నిర్దేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతానికి స్థానిక, మునిసిపల్ ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ జాతీయ పెద్దలు సూచించినట్లు తెలిసింది. 2014–18 తరహాలో కాకుండా.. గెలిచే అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా రానున్న మునిసిపల్ ఎన్నికల్లో విశాఖపట్నం, రాజమండ్రి మేయర్ స్థానాలను తమకే కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం మేయర్, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లసహా అన్ని కేటగిరి స్థానాల్లో బీజేపీ తగిన వాటా పొందేలా రాష్ట్ర పార్టీ ఒక ప్రణాళికను రూపొందిస్తోంది.
నాలుగు జోన్లుగా విభజన..
కృష్ణా లేదా ఏలూరు జిల్లాల్లో ఏదో ఒక జెడ్పీ చైర్మన్ పదవిని అలాగే నరసాపురం, గుంటూరు, తిరుపతి, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పలు మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ స్థానాలను తమకు కేటాయించేలా ఒత్తిడి చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ క్రియాశీలకంగా వ్యవహరించేందుకు వీలుగా రాష్ట్ర నాయకత్వం రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే నాలుగు జోన్లుగా విభజించింది. ప్రతి జోన్‌కు వేర్వేరు ప్రణాళికలు సిద్ధం చేసింది.
నాలుగు జోన్లకు బాధ్యతలు పొందిన నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ పోటీకి అనువుగా ఉన్న స్థానాలు, అభ్యర్థులను గుర్తించి ఓ జాబితాను రూపొందించారు. నామినేటెడ్ పదవుల నియామకాల్లో బీజేపీకి అంతంత మాత్రంగానే ప్రాధాన్యత లభించిందని, స్థానిక సంస్థల, మునిసిపల్ ఎన్నికల విషయంలో ఇలా ఎంతమాత్రం జరగడానికి వీల్లేదని పార్టీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం టీడీపీ పెద్దలకు తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది.


