కువైట్‌ నుంచి సుపారీ.. లైవ్‌ వీడియో మర్డర్‌! | Supari from Kuwait assassination in andhra | Sakshi
Sakshi News home page

కువైట్‌ నుంచి సుపారీ.. లైవ్‌ వీడియో మర్డర్‌!

Aug 30 2026 5:37 AM | Updated on Aug 30 2026 5:37 AM

Supari from Kuwait assassination in andhra

వివాహేతర సంబంధం అనుమానంతో చిన్నమ్మ కొడుకును హత్య చేయించిన సోదరుడు 

రాయచోటి టౌన్‌/వీరబల్లె: వివాహేతర సంబంధం అనుమానంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం అన్నమయ్య జిల్లా వీరబల్లె మండలం ఓదివీడులో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కడపకు చెందిన బాషాకు, ఓదివీడుకి చెందిన బేల్దారి ఖాదర్‌ బాషా కుమార్తె షాహీదాతో 2010లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. షాహీదా ఏడేళ్ల క్రితం కువైట్‌ నుంచి స్వదేశానికి వచ్చి, పుట్టిన ఊరు ఓదివీడులోనే ఇల్లు నిర్మించుకుని ఉంటోంది. 

ఆమె భర్త బాషా కువైట్‌ నుంచి కుటుంబానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చేవాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భర్త బాషా పిన్నమ్మ కుమారుడైన ఖాసీం (ఇతడు కూడా కువైట్‌లో ఉంటూ అప్పుడప్పుడూ ఓదివీడుకు వచ్చిపోయేవాడు) తరచూ ఓదివీడులోని షాహీదా ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. దీనిపై భర్త బాషాకు తీవ్ర అనుమానం వచ్చి పగ పెంచుకున్నాడు. 

కువైట్‌ నుంచి సుపారీ.. లైవ్‌ వీడియోలు తీసి కిరాతకం 
పది రోజుల క్రితమే ఖాసీం కువైట్‌ నుంచి ఇంటికి వచ్చిన విషయం బాషాకు తెలిసింది. దీంతో ఆయన తన మరో పిన్నమ్మ కుమారులు అయిన బాబ్జి, ఖాదర్‌వలిని పురమాయించాడు. ఖాసీంను వెంటాడి చంపాలని, ఆ సమయంలో తనకు వీడియోలు తీసి పంపాలని వారికి సూచించాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం బాబ్జి, ఖాదర్‌వలి ఓదివీడుకు చేరుకున్నారు. అప్పటికే ఇంట్లో ఖాసీం, షాహీదాతోపాటు ఆమె కుమార్తె ఉన్నారు. నిందితులిద్దరూ లోపలికి వెళ్లి గడియలు పెట్టారు. తమతో తీసుకొచ్చిన కర్ర, బెల్ట్‌తో ఖాసీం, షాహీదాలను తీవ్రంగా కొట్టారు. 

షాహీదా కుమార్తెతో బలవంతంగా వీడియోలు తీయించి కువైట్‌లోని బాషాకు పంపారు. ఈ ఘటన దాదాపు రెండు గంటలపాటు సాగింది. లోపల జరుగుతున్న అరాచకాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్‌ చేశారు. అయితే పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి రాలేదు. చివరికి ఖాసీం చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు.. గదుల్లో ఉన్న రక్తపు మరకల్ని నీళ్లతో పూర్తిగా కడిగేసి సాక్ష్యాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. నిందితులు తలుపులు తీయగానే స్థానికులు బాబ్జీని పట్టుకుని, ఘటనా స్థలానికి చేరుకున్న వీరబల్లె ఎస్‌ఐ సుస్మితారెడ్డికి అప్పగించారు. అనంతరం పోలీసులు ఇల్లు, లోపలి ప్రాంతాలను తనిఖీ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఖాసీం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement