పట్నా: బిహార్‌లోని బాంకీపూర్ శాసనసభ ఉపఎన్నికలో విజయం సాధించి, జన్ సురాజ్ పార్టీ తొలి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రశాంత్ కిశోర్ తాజాగా పట్నాలోని వీర్‌చంద్ పటేల్ మార్గ్‌లో ఉన్న తన అధికారిక నివాసాన్ని ‘జన సేవా కేంద్రం’గా మార్చారు. ఈ నివాసాన్ని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించబోనని, దీనికి ‘బాంకీపుర్ జన సేవా కేంద్రం’గా నామకరణం చేసినట్లు ఆయన వెల్లడించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చొరవ చూపే కార్యాలయంగా ఇది పనిచేస్తుందని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధికి, ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలు నేరుగా ఇక్కడికి వచ్చి తమ సమస్యలు, సూచనలను తెలియజేయవచ్చని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నియోజకవర్గంలోని 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ, రాయితీలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే పట్నా నగరంలో ట్రాఫిక్ సమస్య, డ్రగ్స్ దందాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పీకే తెలిపారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర ఉన్నతాధికారులతో ఆయన సమీక్షలు నిర్వహించారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న బాంకీపుర్ స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నితిన్ నవీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఆగస్టు 3న వెలువడిన ఫలితాల్లో ప్రశాంత్ కిశోర్ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19 వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో చారిత్రక విజయం సాధించి, ఆగస్టు 17న శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాంకీపుర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి: పాక్ డ్రోన్ల చొరబాటు యత్నం.. తరిమికొట్టిన భారత సైన్యం


