మరో వరద ముప్పు పొంచి ఉండడంతో నేపాల్ చిగురుటాకులా వణికిపోతోంది. కాసేపట్లో.. మొన్న సంభవించిన ఆకస్మిక వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని చైనా హెచ్చరికలు జారీ చేసింది. కాసేపట్లో ఆ వరద నేపాల్‌ను ముంచెత్తబోతుందనే సమాచారం అందుతోంది. దీంతో నేపాల్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించి.. ప్రజల్ని అప్రమత్తం చేసింది. మరోవైపు ప్రాణభయంతో నదీ తీర ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు.
నేపాల్‌కు మరో భారీ జల ప్రళయ ముప్పు పొంచి ఉంది. గ్లేసియర్లు బద్ధలు కావడం.. చైనా సరిహద్దులో బారియర్ సరస్సు తెగిపోవడంతో వరద ఉధృతంగా దూసుకొస్తోందని తెలుస్తోంది. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సహాయక చర్యలను నిలిపివేసిన అధికారులు.. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని చెబుతున్నారు. ఇటు వరద ముప్పు నేపథ్యంలో ఇటు చైనా కూడా టిబెట్‌లో సహాయక చర్యలను చైనా నిలిపివేసింది. గైరాంగ్ పోర్టు వద్ద ప్రవాహాన్ని అధికారులు గమనిస్తున్నారు.
టిబెట్‌లోని గైరాంగ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన సరస్సు కట్ట తెగిపోవడంతో నేపాల్‌లో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో నేపాల్ భద్రతా బలగాలు, సహాయక సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించాయి. దీంతో గంటన్నర పాటు సహాయక చర్యలను నిలిపివేశారు. టిబెట్‌లోనూ వరద ప్రమాదం కారణంగా చైనా రెస్క్యూ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేసి, సిబ్బందిని కిలోమీటరు మేర వెనక్కి రప్పించింది. రెండు రోజుల క్రితం మట్టి, శిథిలాల ప్రవాహంతో ఏర్పడిన ఈ బారియర్ సరస్సు పొంగిపొర్లుతుండటంతో మరిన్ని వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.
ఏ క్షణమైనా నేపాల్‌ను వరదలు ముంచెత్తనున్నాయని పోలీసుల హెచ్చరికలతో నేపాల్ ప్రజలు పరుగులు తీస్తున్నారు. క్షణక్షణానికి పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. బారియర్ సరస్సు వరద విరుచుకుపడితే.. రుసువా, నువాకోట్‌కు తీవ్ర ముప్పు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Alert !! pic.twitter.com/grYxhc5N7Q
— Nepal Police (@NepalPoliceHQ) August 28, 2026
బిహార్ సరిహద్దు గ్రామాల్లో హైఅలర్ట్
నేపాల్ వరద హెచ్చరికల నేపథ్యంలో ఇటు సరిహద్దు గ్రామాలు సైతం అప్రమత్తం అవుతున్నాయి. భారత్‌లోని బిహార్‌లో గండకీ నది బ్యారేజ్‌కు వరద ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్-బిహార్ బోర్డర్‌లో గ్రామాలను స్థానికులు ఖాళీ చేస్తున్నారు. అక్కడ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
బుధవారం ఉదయం ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడడంతో నేపాల్ అతలాకుతలం అయ్యింది. ఇప్పటిదాకా 500 మృతదేహాలు వెలికి తీయగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. సుమారు 1500 మంది ఆచూకీ గల్లంతైంది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. ఈసారి ఐదు రెట్ల వరద వస్తుందన్న హెచ్చరికలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.


