చైనాలో భారీ భూకంపం.. నేపాల్‌లో హైఅలర్ట్‌ | Asia on Edge: Earthquake Hits China Amid Nepal Flood Alert | Sakshi
Sakshi News home page

చైనాలో భారీ భూకంపం.. నేపాల్‌లో హైఅలర్ట్‌

Aug 28 2026 11:37 AM | Updated on Aug 28 2026 12:23 PM

Asia on Edge: Earthquake Hits China Amid Nepal Flood Alert

బీజింగ్‌: వరుస ప్రకృతి విలయాలు ఆసియా దేశాలను వణికిస్తున్నాయి. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో జలవిలయం మరువక ముందే.. చైనాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో చైనా నేపాల్‌ను అప్రమత్తం చేసింది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో మరో భారీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. తాజా పరిణామం మరింత వణుకు పుట్టిస్తోంది.

సిచువాన్‌ ప్రావిన్స్‌ లాంగ్‌చాంగ్‌ నగరంలో  శుక్రవారం మధ్యాహ్నం 5.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు చైనా ఎర్త్‌క్వేక్‌ నెట్‌వర్క్స్‌ సెంటర్‌ (CENC) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. లాంగ్‌చాంగ్‌ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెంటనే వెల్లడికాలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

గత రాత్రి నేపాల్‌, టిబెట్‌లు కూడా భూకంపంతో వణికిపోయాయి. ఆకస్మిక వరదల తర్వాత మరోసారి ఏ ముప్పు ముంచుకొస్తుందేమోనని వణికిపోయిన ప్రజలు రాత్రంతా నడి రోడ్లపైనే గడిపారు. ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం గ్లేసియర్‌ కూలిపోవడంతోనే సిచువాన్‌ ప్రావిన్స్‌ భూకంపం సంభవించిందని.. బారియర్‌ సర్సు తెగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటు భూకంపం నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. ఏ క్షణంలోనైనా వరద విరుచుకుపడొచ్చని నేపాల్‌కు హెచ్చరిక జారీ చేసింది. ఇక టిబెట్‌ సరిహద్దులో వరద సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిచింది. మరో వరద ముంచుకొస్తున్న నేపథ్యంలోనే రెస్క్యూ నిలిపివేసినట్లు వెల్లడించింది. గైరాంగ్‌ పోర్ట్‌ వద్ద వరద ప్రవాహాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. 

మరో జల ప్రళయం ముప్పు నేపథ్యంలో నేపాల్‌ కూడా అప్రమత్తమైంది. రుసువా, నువాకోట్‌లకు తీవ్ర ముప్పు పొంచి ఉండడంతో.. అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. మరికాసేపట్లో భారీ వరద దూసుకొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మొన్నటి వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ఏ క్షణమైనా వరద ముంచెత్తుతుందన్న పోలీసుల హెచ్చరికలతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పారిపోతున్నారు.

ఇదీ చదవండి: యుగాంతాన్ని తలపించేలా నేపాల్‌కు మరో ముప్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement