నేపాల్‌-టిబెట్‌లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా? | Nepal Under Triple Threat, Deadly Floods, Fresh Earthquakes And Looming Glacial Lake Disaster Raise Alarm | Sakshi
Sakshi News home page

నేపాల్‌-టిబెట్‌లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా?

Aug 28 2026 7:15 AM | Updated on Aug 28 2026 12:04 PM

Nepal Disaster Live: Earthquake Triggers Fresh Threat Another Flood Looms

వరదలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు ప్రాంతాన్ని మరో ప్రకృతి ముప్పు వణికించింది. రెండు చోట్లా గురువారం రాత్రి భూకంపం సంభవించింది. నేపాల్‌లో రిక్టర్‌స్కేల్‌పై  3.2 తీవ్రతతో.. టిబెట్‌లో 5 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం ఖాట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో నమోదు అయ్యింది. అదే సమయంలో బారియర్‌ సరస్సు కట్టలు తెంచుకుని విరుచుకుపడొచ్చని చైనా హెచ్చరికలు నేపాల్‌ను మరింత వణికిస్తున్నాయి.

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో సంభవించిన ప్రకృతి విలయంలో ప్రాణనష్టం 500కి చేరింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. నేపాల్‌, టిబెట్‌ రెండు చోట్లా కలిపి 1500 మంది గల్లంతయ్యారు. ఇందులో 33 దేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు ఉండగా.. అత్యధికంగా భారతీయులే 300 మంది ఉన్నట్లు సమాచారం. వాళ్లలో అత్యధికంగా మానస సరోవర్‌ యాత్రకు వెళ్లారు. టెలికాం వ్యవస్థలు నాశనం కావడంతో చాలామంది జాడ తెలియక ఆందోళన నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. తెగిపోయిన రహదారులు, కొట్టుకుపోయిన వంతెనలు, భారీగా పేరుకుపోయిన బురద, శిథిలాల కారణంగా సహాయక బృందాలకు బాధిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. తాజా విషాదానికి కారణం భూకంపం కాదని.. హిమనదం కూలిపోవడంతో భారీ మంచు–రాళ్ల ప్రవాహం ఏర్పడి ఆకస్మిక వరదలకు(ప్లాష్‌ఫ్లడ్స్‌) దారితీసినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) తేల్చిచెప్పింది. 

మరో వరద ముప్పు
నేపాల్‌ ఆకస్మిక వరదల విధ్వంసం నుంచి ఇంకా తేరుకోకముందే కొత్తగా ఏర్పడిన బ్యారియర్‌ సరస్సు ప్రమాదకరంగా మారింది. భోటే కోషి నదీ వ్యవస్థకు సమీపంలో ఏర్పడిన ఈ సరస్సులో నీటి మట్టం వేగంగా పెరుగుతున్నట్లు చైనా అధికారులు గుర్తించారు. సహజంగా ఏర్పడిన అడ్డంకి తెగిపోతే భారీగా నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే ప్రమాదం ఉందని నేపాల్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో భోటే కోషి, త్రిశూలీ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులపాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి.

భారతీయుల ఆచూకీ లేదు
ఈ విపత్తుతో భారత్‌లోనూ ఆందోళన నెలకొంది. సుమారు 290 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 30 మంది ఉన్నారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు భారత అధికారులు నేపాల్‌ ప్రభుత్వంతో కలిసి అత్యవసర చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు భారతీయుల్లో 84 మందిని రక్షించినట్లు సమాచారం. మరోవైపు టిబెట్‌ వైపున కూడా సుమారు 200 మంది భారతీయులు తరలింపు కోసం సహాయం కోరినట్లు సమాచారం. వీరిలో కైలాష్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినవారు కూడా ఉన్నారు. విపత్తు కారణంగా యాత్రికుల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించారు.

ఎటు చూసినా బురద.. 
వరదల ధాటికి సెకన్ల వ్యవధిలో రసువా, నువాకోట్, ధాదింగ్‌, చిత్వన్‌ తదితర ప్రాంతాల్లో గ్రామాలు, ఇళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్‌, టెలికాం వ్యవస్థలతో పాటు జలవిద్యుత్‌ ప్రాజెక్టులకూ భారీ నష్టం వాటిల్లింది. నేపాల్‌ పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లు, భూతల బృందాలతో గాలింపు చేపడుతున్నాయి. నదీ తీరాలు, బురదలో కూరుకుపోయిన ప్రాంతాలు, ఆస్పత్రులు, సహాయక శిబిరాల్లో గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

తొలుత ఈ విపత్తుకు భూకంపమే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమైనా.. తాజా భౌగోళిక విశ్లేషణలు మరో విషయాన్ని వెల్లడించాయి. హిమనదం కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి కిందికి జారిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. ఆ సహజ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో భారీ నీరు, మట్టి, శిథిలాలు దిగువకు దూసుకెళ్లి ఈ విధ్వంసానికి కారణమయ్యాయి.  అయితే ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన సరస్సులు, కొండచరియలు మరోసారి విరిగిపడే అవకాశం ఉండటంతో విపత్తు ఇంకా ముగియలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది కుటుంబాలు తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చదవండి: కళ్ల ముందే సర్వనాశనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement