కళ్లముందే సర్వనాశనం  | Eyewitness Footage Captures Moment Nepal Floodwaters | Sakshi
Sakshi News home page

కళ్లముందే సర్వనాశనం 

Aug 28 2026 6:24 AM | Updated on Aug 28 2026 6:24 AM

Eyewitness Footage Captures Moment Nepal Floodwaters

భయానక ఘటనను గుర్తుచేసుకున్న ప్రత్యక్ష సాక్షులు

కఠ్మాండు: కళ్ల ముందే కుటుంబం మొత్తాన్నీ వరదనీరు కబళించిన దృశ్యాలు ఇంకా తన కళ్లలో అలాగే నిలిచిపోయాయని కంటతడి పెడుతూ 38 ఏళ్ల గిరిలాల్‌ చెప్పారు. ఆప్తులు, కుటుంబసభ్యులు, ఇల్లు కోల్పోయి ఏకాకిలా మిగిలిన ఎంతో మంది ఇంకా ఆ భయానక ఘటనలను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు. వ్యర్థాల నిర్వహణ కార్యాలయంలో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసే గిరి లాల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.

 రాసువా జిల్లాలోని సరిహద్దు పట్టణం తిమూర్‌లో గిరిలాల్‌ కుటుంబం ఉంటోంది. మెరుపు వరదల్లో గిరిలాల్‌ భార్య, నలుగురు సంతానం కొట్టుకుపోయారు. ‘‘కళ్లముందే జీవితం చెదిరిపోయింది. కాళ్ల కింద భూకంపం వచ్చినట్లయింది. నా వాళ్లంతా పోయారు’’అని గిరి గద్గద స్వరంతో చెప్పారు. ‘‘ఉదయం 8.40 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్నాం. హఠాత్తుగా దిగువన ఉన్న దుకాణ సముదాయాన్ని అమాంతం ముంచేస్తూ వరదనీరు, బురద, మట్టి కొట్టుకొచ్చాయి. మా కళ్ల ముందే అంతా వరదనీటిలో కలిసిపోయాయి’’అని మరో ప్రత్యక్షసాక్షి చెప్పారు. ‘‘నదీ పరివాహక ప్రాంతం నుంచి ఒక్కసారిగా భారీ శబ్దాలు విని్పంచాయి. 

అవేంటో అర్థంచేసుకునేలోపే భీకరంగా వరదనీరు విరుచుకుపడింది. పారిపోయేలోపే దిగువన ఉన్న జనాన్ని మింగేస్తూ వరదనీరు పోటెత్తి అందర్నీ తనలో కలిపేసుకుంది. క్షణాల్లో రోడ్డు, ఇళ్లు మటుమాయమై అంతటా భారీస్థాయిలో బురద పరుచుకుంది’’అని మరో ప్రత్యక్షసాక్షి వివరించారు. ‘‘భోటె కోశి నది సమీప డ్యామ్‌ కూలిపోయి నీరంతా దిగువకు కొట్టుకొస్తోందని ఎగువకు పారిపొండి అని అధికారులు చెప్పారు. అర్థం చేసుకుని అంతా పారిపోయేలోపే నీరు ముంచెత్తింది. 

నా 18 ఏళ్ల కుమారుడు, భార్య సైతం కని్పంచకుండా పోయారు’’అని మరో ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. పారిపోయే సమయం కూడా ఇవ్వకుండా వరదనీరు సర్వనాశనం చేసిందని నువాకోట్‌లోని త్రిశూలి మార్కెట్‌లో వస్త్రదుకాణ వ్యాపారి వాపోయాడు. ‘‘తిమూర్‌ బజార్‌పై ఏకంగా 100 మీటర్ల ఎత్తులో వరద అలలుగా వచ్చినట్లుంది. అందుకే తిమూర్‌ బజార్‌ రెప్పపాటులో కన్పించకుండా పోయింది’’అని రాసువాలో చీఫ్‌ కస్టమ్స్‌ అధికారి, ప్రత్యక్ష సాక్షి రాజేంద్ర ధుంగానా చెప్పారు. కస్టమ్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్న 300 వాహనాలు, ట్రక్కులు వరదలో కొట్టుకుపోయాయని మరో వ్యక్తి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement