న్యూఢిల్లీ: అమెరికాలోని న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థ ఎక్స్ ఖాతా గురువారం కొన్ని గంటలపాటు పనిచేయకుండా నిలిచిపోయింది. ఈ విషయాన్ని అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్(ఎహెడ్) ఫోరమ్ స్వయంగా తెలిపింది. కొందరు తప్పుదోవపట్టిన వ్యతిరేకులే ఇందుకు కారణమని ఆరోపించింది.
యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్స్ గురించిన సమాచారం కొంతసేపు అందుబాటులో లేకుండా పోయిందని, ఎక్స్ జోక్యంతో తిరిగి పనిచేయడం ప్రారంభించిందని ‘ఎహెడ్’వివరించింది. తమ ఫిర్యాదుపై తక్షణమే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించిన ఎక్స్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.
ఆగస్ట్ 29వ తేదీన న్యూయార్క్‌ని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోని ఇన్ఫోసిస్ థియేటర్‌లో భాగవత్ పాల్గొనే కార్యక్రమ వివరాలను ఎహెడ్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతోంది. ఈ కార్యక్రమంలో భాగవత్‌తోపాటు వివిధ మతాలు, సంస్కృతులకు చెందిన ప్రముఖులంతా హాజరవుతున్నారు. యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్ మద్దతిచ్చే 200కు పైగా సంస్థల్లో ఎహెడ్ ఒకటి.


