ప్రముఖ రచయిత, పెట్టుబడుల నిపుణుడు 'రాబర్ట్ కియోసాకి' చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశానికీ అప్పులు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అమెరికా, చైనా, జపాన్, ఫ్రాన్స్, భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా భారీ అప్పులను కలిగి ఉన్నాయి. అయితే.. ఒక దేశం ఎంత అప్పు తీసుకుంది అనేదాని కంటే, ఆ అప్పుపై ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తోంది? దాన్ని భరించే సామర్థ్యం ఎంత ఉంది? అనేదే అసలు విషయమని కియోసాకి చెబుతున్నారు.
అమెరికా పరిస్థితి ఎందుకు భిన్నం?
అమెరికా ప్రస్తుతం భారీగా అప్పులు కలిగి ఉంది. ఈ అప్పులపై ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన వడ్డీ కూడా భారీగా పెరుగుతోంది. కియోసాకి చెప్పిన లెక్కల ప్రకారం అమెరికా ఏడాదికి సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లను వడ్డీగా చెల్లిస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తగా తీసుకునే అప్పుల ఖర్చు కూడా పెరుగుతుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై మరింత భారం పడుతుంది. అంటే పాత అప్పుల వడ్డీ చెల్లించేందుకే భారీ మొత్తంలో డబ్బు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అప్పు పెరిగితే ఏం జరుగుతుంది?
అధిక రేట్లు అంటే అధిక వడ్డీ చెల్లింపులు
అధిక చెల్లింపులు అంటే పెద్ద లోటు అని అర్థం
పెద్ద లోటు అంటే ఎక్కువ అప్పు చేయాల్సి రావడం
ఎక్కువ అప్పు అంటే ఎక్కువ రుణం
ఎక్కువ అప్పు అంటే ఎక్కువ వడ్డీ
కియోసాకి ప్రకారం.. ఒక రకమైన అప్పు చక్రంలా మారుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే ప్రభుత్వ వడ్డీ భారం పెరుగుతుంది. వడ్డీ చెల్లింపులు పెరగడంతో బడ్జెట్ లోటు ఎక్కువవుతుంది. ఆ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం మరింత అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కొత్త అప్పు పెరిగితే భవిష్యత్తులో చెల్లించాల్సిన వడ్డీ కూడా పెరుగుతుంది. ఇలా అప్పు.. వడ్డీ.. మరింత అప్పు.. మరింత వడ్డీ అనే చక్రం కొనసాగుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు.


