సంచలనం.. అమెరికాలో భారీ సైబర్‌ దాడుల కుట్ర భగ్నం | Cyber Shock: Massive Attack Plot Targeting US Agencies Foiled | Sakshi
Sakshi News home page

సంచలనం.. అమెరికాలో భారీ సైబర్‌ దాడుల కుట్ర భగ్నం

Aug 27 2026 9:21 AM | Updated on Aug 27 2026 10:47 AM

Cyber Shock: Massive Attack Plot Targeting US Agencies Foiled

అమెరికాలో భారీ సైబర్‌ దాడి కలకలం రేపింది. ఆ దేశపు అత్యంత కీలకమైన ప్రభుత్వ వ్యవస్థలపై హ్యాకింగ్‌ ప్రయత్నాలు జరిగాయని అక్కడి అధికారులు వెల్లడించారు. సెనెట్‌తో పాటు న్యాయశాఖ, అంతరిక్ష సంస్థ నాసా, ఫెడరల్‌ రిజర్వ్‌ లాంటి కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న సైబర్‌ ఆపరేషన్‌ను అడ్డుకున్నట్లు అమెరికా ప్రకటించింది.

అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. క్యూస్కాన్‌(QScan), క్యూటీరూటర్‌( QTRouter) అనే రెండు హ్యాకింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన డొమైన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ వేదికల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు నెట్‌వర్క్‌లలోకి చొరబడేందుకు ప్రయత్నాలు జరిగాయని వెల్లడించింది. అయితే డాటా సురక్షితమేనా?.. కీలక సమాచారం ఏదైనా బయటకు పొక్కిందా? అనే వివరాలను మాత్రం ధృవీకరించలేదు.

చైనా హ్యాకర్లపై ఆరోపణలు
ఈ సైబర్‌ దాడుల వెనుక చైనా కేంద్రంగా పనిచేసే సంస్థ ఉందని అమెరికా ఆరోపించింది. చైనాకు చెందిన నాన్జింగ్‌ జిన్‌జియువీ నెట్‌వర్క్‌ టెక్నాలజీ కంపెనీ నిర్వహించిన ఈ వ్యవస్థలను చైనా గూఢచార సంస్థలు, సైన్యానికి సంబంధించిన వర్గాలు ఉపయోగించినట్లు అమెరికా దర్యాప్తు పత్రాల్లో పేర్కొంది. 

2018 నుంచే దాడుల ప్రయత్నాలు?
ఈ హ్యాకింగ్‌ కార్యకలాపాలు 2018 నుంచే కొనసాగుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. కీలక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ నెట్‌వర్క్‌లు, అంతర్జాతీయ సంస్థల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడుల ప్రయత్నాలు జరిగినట్లు తెలిపారు.  2019లో నాసా నెట్‌వర్క్‌లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం జరిగినా.. అది విఫలమైందని అధికారులు తెలిపారు. 2024లో ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ల్యాబ్‌లు, ఆరోగ్య శాఖకు చెందిన సంస్థలు, ఇతర సున్నితమైన నెట్‌వర్క్‌లపై చొరబాట్లు జరిగినట్లు వెల్లడించారు. 

డాటా చోరీపై ఆందోళన
సైబర్‌ దాడితో అమెరికా రక్షణ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి సమాచారం దొంగిలించేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు సైబర్‌ భద్రతా సంస్థలు తెలిపాయి. సెనెట్‌, ఆసుపత్రి నెట్‌వర్క్‌లను కూడా హ్యాకర్లు పరిశీలించినట్లు దర్యాప్తులో తేలింది. 

చైనా రియాక్షన్‌
అమెరికా ఆరోపణలపై చైనా స్పందిస్తూ.. సైబర్‌ దాడులను తమ దేశం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని తెలిపింది. సైబర్‌ భద్రత అంశాలను ఉపయోగించుకుని చైనాను అపఖ్యాతి పాలుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. అయితే తాజా నివేదికలపై మాత్రం డ్రాగన్‌ దేశం స్పందించాల్సి ఉంది. 

సైబర్‌ యుద్ధం ఇలా..
అమెరికా-చైనా మధ్య ఇప్పటికే వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైబర్‌ నిపుణుల ప్రకారం.. ప్రభుత్వ ప్రోత్సాహంతో పనిచేసే హ్యాకింగ్‌ నెట్‌వర్క్‌లు ప్రపంచవ్యాప్తంగా కీలక సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ఆ మధ్య ట్రంప్‌ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అత్యంత జాగ్రత్తగా అమెరికా భద్రతా బలగాలు వ్యవహరించాయి. తాజాగా జరిగిన సైబర్‌ దాడుల వ్యవహారం రెండు దేశాల మధ్య డిజిటల్‌ భద్రతపై కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: కళ్లెదుటే కల్లోలం.. ఈ షాకింగ్‌ దృశ్యాలు చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement