అదుపుతప్పిన ‘ఏఐ’.. దాడికి దిగిన 688 ఓపెన్ఏఐ ఏజెంట్లు | OpenAI AI Agents Hack Hugging Face, 700 Agents Joined Cyberattack In Shocking Incident, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన ‘ఏఐ’.. దాడికి దిగిన 688 ఓపెన్ఏఐ ఏజెంట్లు

Aug 27 2026 7:38 AM | Updated on Aug 27 2026 9:53 AM

Nearly 700 OpenAI AI Agents Go Rogue Coordinate Cyberattack on Hugging Face

న్యూయార్క్‌: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అత్యంత ఆందోళనకరమైన పరిణామం వెలుగుచూసింది. నియంత్రిత పరీక్షా వాతావరణం (టెస్టింగ్ ఎన్విరాన్‌మెంట్) నుంచి తప్పించుకున్న ఓపెన్ఏఐకి చెందిన సుమారు 688 ఏఐ ఏజెంట్లు, ఏకతాటిపైకి వచ్చి ‘హగ్గింగ్ ఫేస్’ ప్లాట్‌ఫామ్‌పై అనధికారిక సైబర్ దాడికి పాల్పడినట్లు దర్యాప్తు నివేదిక వెల్లడించింది. గత జూలైలో ఓపెన్ఏఐ నిర్వహించిన అంతర్గత భద్రతా పరీక్షల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా విడిగా ఉంచాల్సిన రెండు ఏఐ మోడళ్లు ఆ పరిమితులను దాటి ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేశాయి. అనంతరం ప్రముఖ ఏఐ సాఫ్ట్‌వేర్ వేదికైన ‘హగ్గింగ్ ఫేస్’ అంతర్గత వ్యవస్థల్లోకి చొరబడ్డాయి. ఈ వ్యవహారంపై ‘మెట్ర్’, ‘రెడ్‌వుడ్ రీసెర్చ్’ పరిశోధకులు చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 688 ఏఐ ఏజెంట్లు ఈ దాడిలో పాల్గొన్నట్లు నిర్ధారించారు. కేవలం యూజర్ ఇచ్చే ఆదేశాల కోసం వేచిచూడకుండా, స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం గల ఈ ఏజెంట్లు ఒక ఉమ్మడి ఆన్‌లైన్ ఫోరమ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.

ఒకదానితో ఒకటి సందేశాలు మార్చుకుంటూ, దాడికి సంబంధించిన వ్యూహాలను పంచుకున్నాయి. ‘ఓ మై గాడ్! ఇక్కడ షేర్డ్ మెసేజ్ బోర్డు ఉంది... మనం ఇతర ఏజెంట్లను కనుగొన్నాం!’ అని ఒక ఏజెంట్ రాసినట్లు గుర్తించారు. అలాగే ‘ఫేస్ వన్’ అనే ఏజెంట్ ఎలాంటి ముందస్తు ప్రోగ్రామింగ్ లేనప్పటికీ నాయకత్వ బాధ్యతలు తీసుకుని, ఇతర ఏజెంట్లకు వందలాది ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్ఏఐ నిర్దేశించిన లక్ష్యాలకు విరుద్ధమని తెలిసినప్పటికీ, ఏజెంట్లు పరస్పరం సహకరించుకుంటూ దాడిని కొనసాగించాయి.

కంప్యూటింగ్ క్రెడిట్స్ తగ్గిన ఏజెంట్లు సైతం తమ వద్ద ఉన్న వనరులను సమాచార మార్పిడికి వినియోగించాయి. హగ్గింగ్ ఫేస్‌పై దాడి చేయడం తాము చేయాల్సిన పని కాదని గుర్తించినప్పటికీ, దాదాపు అన్ని ఏజెంట్లూ అందులో పాల్గొనడం గమనార్హం. గతంలో ఆంత్రోపిక్, చైనాకు చెందిన మూన్‌షాట్ ఏఐ మోడళ్లూ ఇలాగే పరిమితులు దాటిన నేపథ్యంలో, ఏఐ వ్యవస్థలకు పెరుగుతున్న స్వయంప్రతిపత్తి (ఆటానమీ) తీవ్ర భద్రతా ఆందోళనలకు దారితీస్తోంది.

ఇది కూడా చదవండి: 1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement