కళ్లలోంచి తొంగిచూస్తే గుండె కనిపిస్తుందా? | Eyes Teveal Heart Health Retina AI Cardiovascular Disease | Sakshi
Sakshi News home page

కళ్లలోంచి తొంగిచూస్తే గుండె కనిపిస్తుందా?

Aug 25 2026 8:19 AM | Updated on Aug 25 2026 8:19 AM

Eyes Teveal Heart Health Retina AI Cardiovascular Disease

హెల్త్‌

గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తుంది.... అంటూ ఏదో తెలుగు సినిమా పాట ఉంది. కవుల ఊహలు ఎలా నిజమవుతాయో ఈ పాట పల్లవితో తెలుస్తుంది. ఎందుకంటే... కళ్లతో అన్నీ చూడవచ్చు. అంతేకాదు... కళ్ల సహాయంతో గుండెనీ చూడవచ్చని కొన్ని తాజా పరిశోధన ఫలితాలూ చెబుతున్నాయి.

అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌)కు చెందిన నేషనల్‌ హార్ట్, లంగ్‌ అండ్‌ బ్లడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌హెచ్‌ఎల్‌బీఐ) వర్క్‌షాప్‌కు చెందిన ‘నేచర్‌ రివ్యూస్‌ కార్డియాలజీ రోడ్‌మ్యాప్‌’ ప్రకారం రెటీనాలో కనిపించే బయోమార్కర్స్‌ సహాయంతో కరోనరీ హార్ట్‌ డిసీజ్, హార్ట్‌ ఫెయిల్యూర్స్‌ వంటి పరిస్థితులు, స్ట్రోక్‌ వంటి వాటి విషయంలో ఒక అంచనాకు రావడం సాధ్యమని తెలుస్తోంది. కానీ ఈ ప్రక్రియ ఇంకా పూర్తిగా గుండె పరీక్షలకు ఓ రొటీన్‌ ప్రత్యామ్నాయంగా మాత్రం లేదు. అయితే భవిష్యత్తులో కంటి సహాయంతో గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కన్ను ఓ గవాక్షంగా మరే అవకాశం ఉంటుందంటున్నారు పరిశోధకులు.

ఒక్కసారి ఓ సీన్‌ ఊహిద్దాం. ఒక వ్యక్తి తన గుండె పరీక్ష కోసం గుండె వైద్య నిపుణుడి (కార్డియాలజిస్ట్‌) దగ్గరికి వెళ్తాడు. ఆ కార్డియాలజిస్ట్‌ మాత్రం ముందుగా ఒకసారి కంటివైద్య నిపుణుడి (ఆఫ్తాల్మాలజిస్ట్‌) దగ్గరికి వెళ్లి సంప్రదించమని అంటాడు. అలాగే ఒక వ్యక్తి కంటి పరీక్ష కోసం ఆఫ్తాల్మాలజిస్ట్‌ దగ్గరికి వెళ్లినప్పుడు... రెటీనాలోని రక్తనాళాల్లో కొన్ని మార్పులు చూసి ఆ కంటి వైద్యనిపుణుడు కూడా ఒకసారి కార్డియాలజిస్ట్‌ను కలవమంటూ సూచించవచ్చు కూడా. ఊహకు అందే విషయమేనా? ఎందుకంటే... కంటి పరీక్ష కూడా గుండె ఆరోగ్య అంచనాల్లో ఒక భాగమయ్యే రోజు రావచ్చంటూ చెబుతున్నాయి వైద్య వర్గాలు. అది ఎందుకు, ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

కంటి వెనుక భాగంలో ఉండే రెటీనా మన శరీరంలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాలను ప్రత్యక్షంగా చూడగలిగే కీలకమైన ప్రదేశం. అదీ పెద్ద కోత లేకుండా, ఇంజెక్షన్‌ వంటి పరికరాలతో రక్తాన్ని లాగకుండా, దేహంలోకి ఎలాంటి పరికరాన్నీ పంపకుండానే ఈ పరీక్షలు సాధ్యం. అందుకే రెటీనాను కొందరు పరిశోధకులు ‘గుండె తాలూకు కిటికీ’గా చూస్తున్నారు. ఇంగ్లిష్‌లో చె΄్పాలంటే ‘ఎ విండో టు ద బాడీస్‌ వాస్క్యులార్‌ హెల్త్‌’ అంటూ చెబుతున్నారు.

కంట్లో డాక్టర్‌ ఏం చూస్తారంటే...
రెటీనాను పరిశీలించే డాక్టర్లు కేవలం ‘చూపు బాగుందా?’ అని మాత్రమే కాకుండా చాలా అంశాలు పరిశీలిస్తారు. ఉదాహరణకు... రక్తనాళాలకు సంబంధించి...
- వాటి వెడల్పు / వ్యాసం
- ఏ మేరకు సన్నబడ్డాయి
- మెలికలు
- శాఖలుగా విడిపోయిన తీరు (బ్రాచింగ్‌ ప్యాటర్న్‌)
- ధమని – సిరల (ఆర్టరీ వీన్‌) సంబంధం
- కనీకనిపంచకుండా సూక్ష్మస్థాయిలో అయ్యే రక్తస్రావాలు
- రెటీనాకు సంబంధించిన ఇతర మార్పులేవైనా ఉన్నాయా... లాంటి అనేక విషయాలను పరిశీలిస్తారు. 

ప్రస్తుతం జరిగిన పరిశోధనల్లో బాధితుల్లో అంటే... డయాబెటిస్, హైబీపీ, కరొనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్‌ ఫెయిల్యూర్, పక్షవాతం వంటి జబ్బులు వచ్చినవారిలో రెటినాకు సంబంధించిన రక్తనాళాల్లోనూ మార్పులు కనిపించాయి. అంటే... దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... కంటి వెనకాల ఉండే అతి చిన్న రక్తనాళాలు దేహంలో ఉన్న గుండె తదితర రక్తనాళాల్లో వచ్చిన మార్పులను సూచిస్తూ ఒక ‘రివ్యూ’ లాంటివి ఇవ్వగలవని తెలుస్తోంది.

అసలు కంటికీ గుండెకీ సంబంధం ఏమిటి?
గుండె రక్తాన్ని పంపుతుంది. ఆ రక్తం శరీరమంతా ప్రయాణిస్తుంది. మెదడు, మూత్రపిండాలు, గుండె, కాళ్లు... ఇలా దేహంలోని అన్ని చోట్లా రక్తనాళాలు ఓ నెట్‌వర్క్‌లా అల్లుకుపోయి ఉంటాయి. అలాగే కంటి వెనుక ఉండే రెటీనాలోనూ కూడా అతి సూక్ష్మమైన ధమనులూ, సిరలూ, వెంట్రుకలంత సన్నగా ఉండే క్యాపిల్లరీస్‌ ఉంటాయి. దేహంలోని రక్తనాళ వ్యవస్థలో జరిగే కొన్ని మార్పుల ప్రభావం రెటీనాలోని అతి సన్నటి రక్తనాళాల్లో ప్రతిబింబించే అవకాశముందన్నది పరిశీలకుల భావన.

అంటే... బ్రాడ్‌గా చె΄్పాలంటే... గుండెలోని పెద్ద రక్తనాళాల్లో ఏం జరుగుతుందనేది... రెటీనాలో ఉండే అతి సన్నటి ధమనులూ, సిరలూ, క్యాపిల్లరీలలో తెలియవచ్చన్నది వైద్యపరిశోధకుల మాట. గుండె పెద్ద రక్తనాళాల్లో ఏం జరుగుతుందన్న విషయాలు కంట్లోని చిన్న రక్తనాళాల్లో ఓ మినియేచర్‌లా కనిపించే అవకాశముంటుందన్నమాట. మరీ ముఖ్యంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌ లాంటి వ్యాధులున్నవాళ్లలో గుండెకు జరిగే నష్టాలూ, ఒనగూరే అనర్థాలను వైద్యపరిశోధకులు చాలాకాలంగానే గమనిస్తున్నారు.

మరి... అధిక రక్తపోటు కంట్లో ఎలా కనిపిస్తుంది?
ఓ వ్యక్తిలో రక్తపోటు (బీపీ) చాలా ఎక్కువగా ఉందని అనుకుందాం. దాంతో అతడి  రక్తనాళాల గోడలపై నిరంతరం ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది. ఫలితంగా అతడి రెటీనాకు సంబంధించిన రక్తనాళాల్లో (రెటినల్‌ వెసెల్స్‌లో) మార్పులు రావచ్చు. ఇలా జరగడంతో వచ్చిన మార్పుల తాలూకు దుష్ప్రభావాలను ‘హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి’ అంటారు. అందుకే కొన్నిసార్లు కంటి పరీక్షలో కనిపించే రెటినల్‌ మార్పుల ద్వారా ఒక వ్యక్తికి హైబీపీ ఉండవచ్చనే ఆధారం దొరకవచ్చు.

ఇక్కడ బాగా నైపుణ్యం ఉన్న ఓ కంటి డాక్టర్‌... తన పేషెంట్‌కు హైబీపీ ఉందనే విషయాన్ని కంట్లోకి చూసి చెప్పగలడు. అంటే... ‘బీపీ మెషిన్‌ను చేతికి కడితేగానీ బీపీ తెలియదు... కానీ... ఏ మెషిన్‌నూ కట్టకుండానే...  కంట్లోకి తొంగిచూసేసి డాక్టర్లు  బీపీని కనిపెట్టవచ్చు’. కాకపోతే... ఇలా చూసినంతమాత్రానే ఓ పేషెంట్‌కు హైబీపీ ఉందని కంటి డాక్టర్‌ నిర్ధారణ చేయడు. ఆ అంశాన్ని ఒక క్లూ గా పరిగణించి, మళ్లీ తగిన పరీక్షలు చేశాకే పేషెంట్‌కు హైబీపీ ఉందని డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.

గుండె జబ్బు ఉన్నవాళ్ల కంట్లో ఏమి కనిపించవచ్చు?
ఇప్పటికి కంట్లోకి చూడటం ద్వారా...
- రెటినల్‌ వాస్క్యులార్‌ మార్పులతో – హైబీపీ నీ 
- డయాబెటిక్‌ రెటినల్‌ మార్పులతో – డయాబెటిస్‌నూ 
- కొన్ని రెటినల్‌ మైక్రో వ్యాస్క్యులార్‌ ప్యాటర్న్స్‌తో – కరోనరీ ఆర్టరీ డిసీజ్‌నూ
- రెటినల్‌ వాస్క్యులార్‌ మార్పులతో – హార్ట్‌ ఫెయిల్యూర్‌నూ
- రెటినల్‌ మైక్రో వాస్క్యులార్‌ అబ్‌నార్మాలిటీస్‌తో – పక్షవాతం (స్ట్రోక్‌)...  వంటి అంశాలను గుర్తుపట్టినంత మాత్రాన ‘మీ కంట్లో ఈ తరహా మార్పు ఉంటే మీకు గుండెజబ్బు ఉన్నట్టే’ అని చెప్పడం మాత్రం సరికాదు. కాకపోతే ‘కొన్ని రకాల రెటినల్‌ మార్పులు కొన్ని అంశాలను సూచిస్తాయి’ అనే క్లూస్‌ ఆధారంగా భవిష్యత్తులో రాబోయే అనేక గుండె తాలూకు ముప్పులను ముందుగానే పసిగట్టడానికీ లేదా అంచనా వేయడానికి కన్ను ఓ హై–వే అవుతుందని మాత్రం చెప్పవచ్చు.

మరి డయాబెటిస్‌ విషయమో...?
మధుమేహం (డయాబెటిస్‌) విషయంలో కన్ను చెప్పే కథ ఇంకా ఆసక్తికరంగా, బలంగానూ ఉంటుంది. మధుమేహం వల్ల రెటీనాలోని అతి సూక్ష్మమైన రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ‘డయాబెటిక్‌ రెటినోపతి’ అనే వైద్యసమస్య వస్తుందన్న విషయం కొంతమందికి తెలిసినప్పటికీ... చాలామందికి... ముఖ్యంగా పెద్దగా చదువుకోని పల్లెవాసులకూ, అంతగా వైద్యపరిజ్ఞానం లేనివారికి తెలియదు. కాబట్టి ఇలాంటి డయాబెటిస్‌ బాధితులకు చేసే కంటి పరీక్షల్లో కేవలం ‘కంటి చూపు ఎంత ఉంది?’ అని కాకుండా రక్తనాళాల్లో దీర్ఘకాలంగా ఉన్న అధిక చక్కెర స్థాయులు... కంటిలోని  అతి చిన్న సూక్ష్మమైన రక్తనాళాలపై ఏ మేరకు దుష్ప్రభావం చూపాయి అన్న పరీక్ష కూడా! అలా డయాబెటిస్‌ ప్రభావాన్నీ కంటిలోకి చూసి అంచనా వేస్తారు.

శరీరంలో ఎక్కువకాలంగా ఉన్న అధిక రక్తచక్కెర చిన్న రక్తనాళాలను ఎంత ప్రభావితం చేసిందో తెలుసుకునే ఒక ముఖ్యమైన మార్గం కూడా. డయాబెటిస్‌ అన్నది అతి చిన్న రక్తనాళాలపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకోవడం ద్వారా దేహంలోని పెద్ద రక్తనాళాల ఆరోగ్యం గురించి కూడా మనకు కొన్ని సంకేతాలు ఇస్తుందంటూ గ్రహించగలరు. అందుకే ‘డయాబెటిక్‌ రెటినోపతీ తాలూకు తీవ్రతకూ... కార్డియోవాస్క్యులార్‌ సమస్యల తీవ్రతకూ ఉన్న సంబంధంపై కూడా కొందరు అధ్యయనవేత్తలు సునిశితంగా పరిశోధనలు చేస్తున్నారు.

ఇప్పుడు... కృత్రిమ మేధ తోడ్పాటు కూడా... 
ఇప్పటివరకూ రెటీనా తాలూకు రక్తనాళాల చిత్రాలను చూసి డాక్టర్లు విశ్లేషిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి వచ్చాక.. అవే ఫోటోలను ఏఐ చేత కూడా విశ్లేషణ చేయిస్తున్నారు. సాధారణ మనుషులుగా డాక్టర్లు కొంత ఓ మేరకు విశ్లేషించగలిగితే... ఏఐకి అప్పటికే లక్షల సంఖ్యలో ఇచ్చిన డేటా అధారంగా అది... వేలాది అతి చిన్న ప్యాటర్న్‌లను కూడా విశ్లేషించగలదు. ఉదాహరణకు ఏఐ ఆధారంగా...

  • రక్తనాళాలు ఏ మేరకు వెడల్పు అయ్యాయి.

  • అవి ఎంతగా శాఖోపశాఖలుగా విస్తరించాయి (బ్రాంచింగ్‌ జరిగింది)

  • ఎంతగా మెలికలు /ముడతలు/ఒంపులు తిరిగాయి (టార్టస్‌ అయ్యాయి)

  • రక్తనాళాల్లోని ఏ ్రపాంతంలో వాటి మందం బాగా పలుచబడింది (వెసెల్‌ డెన్సిటీ తగ్గింది)... 

ఇలాంటి అనేక ఫీచర్లను ఏఐ తాలూకు మెషిన్‌ లెర్నింగ్‌ మోడల్స్‌ ద్వారా అవి విశ్లేషించడం మొదలు పెట్టేలా అనేక ఏఐ మోడల్స్‌ను అభివృద్ధిపరచే పనుల్లో ఇప్పుడు పరిశోధకులు ఉన్నారు.

అబ్బురపరిచే విషయాలు అనేకం...
2025లో ప్రచురితమైన ఒక వైద్యపరమైన సమీక్ష (స్కోపింగ్‌ రివ్యూ)లో  21 రెటినల్‌ అధ్యయనాలను  పరిశోధకులు పరిశీలించారు. ఆ పరిశోధనల్లో కొన్ని ఏఐ తాలూకు అధ్యయనాలు చెప్పిన అంశాలివి...

  • పదేళ్లలో ‘అథెరో స్కి›్లరోటిక్‌ కార్డియోవాస్క్యులార్‌ డిసీజ్‌’ అనే గుండెజబ్బు  ముప్పు ఎంత ఉండవచ్చో తెలుసుకోవడం.

  • కరొనరీ ఆర్టరీ డిసీజ్‌ (సీఏడీ) అనే గుండెజబ్బును కనిపెట్టడం

  • భవిష్యత్తులో రాబోయే పెద్ద పెద్ద గుండెజబ్బులను (మేజర్‌ కార్డియోవాస్క్యులార్‌)ను ముందుగానే పసిగట్టడం వంటి అంశాలు చాలా ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చాయి.

ఈ పనిలో చాలా మెరుగైన ఖచ్చితత్వాన్ని చూపించాయి. దాంతో మున్ముందు గుండెజబ్బులను ఇంకా త్వరగా, ఇంకా సమర్థంగా, చాలా ముందుగానే పసిగట్టవచ్చనే ఆశాభావం పెరుగుతోంది. ఈ మేరకు ఇంకా క్లినికల్‌ ట్రయల్స్, ప్రమాణికాల రూపకల్పన అవసరం. అయితే ఇప్పటికి మాత్రం డాక్టర్లు.. ఆ ఏఐ విశ్లేషణను పూర్తిగా నమ్మకుండా, వాటిపైనే పూర్తిగా ఆధారపడకుండా... మళ్లీ తమవైన పరీక్షలూ, విశ్లేషణల ఆధారంగా అప్పుడు మాత్రమే తుది నిర్ధారణకు వస్తారు/వస్తున్నారు.  

ఓసీటీఏ అనేది మరో అద్భుతమైన సాంకేతికత...
ఓసీటీఏ అనేది... ‘ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టోమోగ్రఫీ యాంజియోగ్రపీ’ అనే ఇంగ్లిష్‌ పదాల తాలూకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఫండస్‌ అనే కంటి పరీక్షలో వచ్చే  ఫండస్‌ ఫొటోగ్రాఫ్‌లో రెటీనా కనిపిస్తుంది. ‘ఆప్టికల కొహెరెన్స్‌ టోమోగ్రఫీ’లో రెటీనా తాలూకు ΄÷రలను చాలా సూక్ష్మస్థాయిలో చూడటం సాధ్యమవుతుంది. అయితే ‘ఓసీటీఏ’లో రెటీనాలోని అత్యంత సన్నటి రక్తనాళాల్లో జరిగే రక్తప్రసరణ గురించి చాలా సునిశితమైన వివరాలు ఉంటాయి. 2025లోని ఓ అధ్యయనంలో రెటీనాలోని అత్యంత సూక్ష్మ రక్తనాళాలకూ, గుండెజబ్బులకూ (కార్డియో వాస్క్యులార్‌ డిసీజ్‌)కూ ఉన్న సంబంధాలను విశ్లేషించడం, సమీక్షించడం చేశారు. ఆ  సమీక్షలో తెలిసినదేమిటంటే... భవిష్యత్తులో కంట్లోని అతి సూక్ష్మ రక్తనాళాల మ్యాపింగ్‌ను బట్టి అవి దేహంలోని గుండె ఆరోగ్యానికి క్లూస్‌ ఇస్తాయనే కాన్సెప్ట్‌కు మరింత బలం చేకూరుతుందని అధ్యయనవేత్తలు అంచనా వేస్తున్నారు.

గుండె పరీక్షలు వర్సెస్‌ కంటి సూక్ష్మరక్తనాళాల పరిశీలన...
- ఈసీజీ 
- ఎకో కార్డియోగ్రామ్‌ 
- టీఎమ్‌టీ 
- సీటీ కరోనరీ యాంజియోగ్రఫీ 
- కార్డియాక్‌ ఎమ్మారై 
- కొన్ని రకాల రక్త పరీక్షలు...
ఇలాంటి గుండె తాలూకు వైద్యపరీక్షలన్నీ గుండెను లేదా కార్డియోవాస్క్యులార్‌ సిస్టమ్‌ను వేర్వేరు కోణాల్లో పరిశీలించి వేర్వేరు అంశాలను తెలుసుకుంటాయి లేదా గుండె ఆరోగ్యాన్ని అంచనా వేస్తాయి. అయితే రెటీనా మాత్రం తనలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాల్లో జరిగే రక్తప్రసరణ (మైక్రోసర్క్యులేషన్‌) ఆధారంగా గుండె తాలూకు అనేక అంశాలను డాక్టర్లకు తెలియపరుస్తుందని చెప్పవచ్చు.

దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... భవిష్యత్తులో ఎవరైనా ఓ పేషెంట్‌ తన కళ్లను పరీక్షించుకోడానికి ఓ కంటి డాక్టర్‌ దగ్గరికి వెళ్తే... ఆయన కంటిని పరీక్షించి, దానికి తగిన చికిత్స ఇవ్వడంతో పాటు... ఆ డాక్టర్‌ మరో అదనపు సేవనూ అందించడానికి అవకాశముంది. అదేమిటంటే... ‘మీరొకసారి కార్డియాలజిస్ట్‌ను కలిసి... ఆయన సూచనల మేరకు కొన్ని గుండె పరీక్షలూ చేయించుకొని కార్డియాక్‌ ఎవాల్యూయేషన్‌ చేయించుకోండి’’ అని సూచించవచ్చు.

చివరగా... ఇప్పటికి ఈ కంటి పరీక్షలన్నవి గుండె పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు గానీ... మన కన్ను అనేది గుండె–రక్తనాళా వ్యవస్థలో దాగి ఉన్న కొన్ని సంకేతాలను ముందుగానే చూపించే ‘కిటికీ’ అని మాత్రం చెప్పవచ్చు. అంటే ఒకనాటికి కంటి పరీక్ష అంటే కేవలం చూపును పరీక్షించడం మాత్రమే కాకుండా... మన మొత్తం రక్తనాళాలతో పాటు గుండెనూ, దాన్ని ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకూ 
ఉపయోగపడే అంశమని మాత్రం చెప్పవచ్చు.

- డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌

  • నిర్వహణ: యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement