రాజయోగలో యమ, నియమ, ఆసనాదులను గూర్చి చెబుతారు. అందులోనే కుండలిని గూర్చి ఉంటుంది. ప్రతి మనిషిలో ఆరు చక్రాలుంటాయనీ, ఆ చక్రాల్లో అట్టడుగున ఉన్న మూలాధార చక్రంలో కుండలిని ఉంటుందనీ, యోగాభ్యాసం ద్వారా దాన్ని క్రమంగా పైనున్న చక్రాలకు తీసుకపోవాలనీ చెబుతారు. యోగాన్ని అత్యంత శ్రద్ధతో అభ్యసించిన విశ్వమాత కృష్ణాబాయి ఇలా చెబుతారు:
కుండలిని మూలాధార చక్రములో నిద్రాణమై ఉంటుంది. అప్పుడా వ్యక్తి దృక్పథం కేవలం భౌతికంగా ఉంటుంది. ఒక మహాత్ముని సంపర్కం వల్ల ఆ కుండలిని జాగృతమై దాని పై కేంద్రానికి చేరుతుంది. ఆ వ్యక్తికి అప్పుడు ధార్మిక జీవనం గడపాలనే ఆకాంక్ష కలుగుతుంది. కుండలిని పై కేంద్రానికి చేరుతుంది. అతడు అంత కంతకూ సత్సంగం, దేవాలయ సందర్శనను కోరుతాడు. కుండలిని ‘అనాహత’ అను నాల్గవ కేంద్రాన్ని చేరుతుంది. అప్పుడా వ్యక్తి గురువును తన ఆత్మీయునిగా భావిస్తాడు. అతని దృష్టిని ఆ భావన విస్తరింప చేస్తుంది.
ఆ శక్తి (కుండలిని) విశుద్ధమనే అయిదవ చక్రాన్ని చేరినపుడు గురువు అవ్యక్త స్థితిని తెలుసుకుంటాడు. గురువుని గూర్చి, లేక ఆ భగవంతుని స్థితిని గూర్చి అధికంగా మాట్లాడుతాడు. తర్వాత కుండలిని పై చక్రమైన ఆజ్ఞాచక్రాన్ని చేరుతుంది. అప్పుడు ఆ సాధకునకు భగవద్దర్శనమై అతని మనస్సు క్రమంగా అవ్యక్తస్థితి వైపు ఆకర్షితమవుతుంది. అక్కడే అతనికి కొన్ని సిద్ధులు అబ్బుతాయి. అతడు వాటికి లోబడితే పతనమవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
బయటి నుండి గురువు సాధకుణ్ణి ఈ కేంద్రం వరకు మాత్రమే ప్రేరేపించగలడు. దీని తరువాత హృదయంలో ఉన్న గురువునుండి మార్గదర్శనం వస్తుంది (పుటలు 81, 82 – విశ్వమాత కృష్ణాబాయి – ఆనందా శ్రమం, కేరళం). ఆమె అంతవరకే చెప్పి తన గురువైన రామదాసు కృపవల్ల తనకు ఆజ్ఞా చక్రం నుండి కుండలిని అధికమైన వేగంతో మెరుపును మించిన కాంతితోను పైకి పోయిందనీ, తనకు అనిర్వచనీయమైన ఆనందం కలిగిందనీ అంతకుమించి ఇక ఏమీ చెప్పజాలననీ అంటారు.
– రాచమడుగు శ్రీనివాసులు


