జపాన్‌ అణ్వస్త్ర డైలమా | Sakshi Guest Column On Japan nuclear dilemma | Sakshi
Sakshi News home page

జపాన్‌ అణ్వస్త్ర డైలమా

Aug 25 2026 12:31 AM | Updated on Aug 25 2026 12:31 AM

Sakshi Guest Column On Japan nuclear dilemma

అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా జపాన్‌లో నిరసన ప్రదర్శన

అభిప్రాయం

కొన్ని విషయాలు వినేందుకు విచిత్రంగా తోస్తాయి. ప్రపంచంలో అణ్వస్త్రాలంటూ తయారైన తర్వాత వాటి దాడికి 1945లో మొట్టమొదట గురైన దేశం జపాన్‌. అప్పటినుంచి 81 సంవత్సరాలు గడిచినా మరెవరూ ఎవరిపై ఆ దాడులు చేయ లేదు. అనగా ఆ ఊహాతీత వినాశనానికి గురైన ఏకైక దేశం జపాన్‌. ఆ దుష్ఫలితాలను వారు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ఇటీవల తాము కూడా అణ్వాయుధాలు తయారు చేయాలా, లేదా కనీసం తమ దేశంలో అణ్వస్త్ర స్థావరాల ఏర్పాటుకు అనుమతించాలా అనే చర్చ జరుగుతున్నది.

ఇప్పటికే వ్యతిరేకతే
1945 ఆగస్టు నెలలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణ్వస్త్రాలను ప్రయోగించింది. ఆ సందర్భంగా ఆ రెండు నగరాలలో అక్కడి మునిసిపల్‌ కార్పొరేషన్ల ఆధ్వర్యాన ప్రతి సంవ త్సరం విస్తృత స్థాయిలో సంతాప సభలు జరిగినట్లే ఈసారి కూడా 81వ సంవత్సర సభలు జరిగాయి. మునిసిపల్‌ మేయర్ల అధ్యక్షతన జరిగిన ఆ కార్యక్రమాలలో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ కూడా సభికులలో ఒకరిగా కూర్చుని పాల్గొన్నారు. అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా రెండు నగరాల మేయర్లు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. జపాన్‌ నగరాలన్నిటా భారీ ప్రదర్శనలు జరిగాయి. దేశ వ్యాప్తంగా జరిగిన వేర్వేరు ప్రజాభిప్రాయ సేకరణలలో సగటున 70 శాతానికి పైగా ప్రజలు అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా ఓటు చేయగా, మరొక 10 శాతం వరకు తటస్థంగా ఉండిపోయారు.

దీనంతటి మధ్య గమనించదగినదేమంటే, 1971 నాటి అణ్వస్త్ర విధానాన్ని తీవ్ర మితవాద తకాయిచీ ప్రభుత్వం అధికారికంగానైతే ఏమీ మార్చలేదు. కానీ దానిని సవరించాలంటూ జరుగుతున్న చర్చను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నది. అప్పటి విధానం ప్రకారం జపాన్‌ స్వయంగా అణ్వాయుధాలను తయారు చేయ రాదు, ఇతర దేశాల నుంచి స్వీకరించి నిల్వ చేయరాదు, ఇతరులు తమ అణ్వాస్త్రాలను జపాన్‌ భూభాగంపై మోహరించేందుకు అంగీ కరించరాదు. ఇపుడు జరుగుతున్న చర్చ ఇందులో మొదటి రెండు నిబంధనలు యథాతథంగా కొనసాగాలనీ, మూడవ దానిని మాత్రం సడలించాలనే ధోరణిలో సాగుతున్నది. అనగా జపాన్‌లో ఇతర దేశాల అణుస్థావరాలకు అవకాశం ఇవ్వటం. ఇతర దేశాల న్నవి తమపై 1945లో అణుదాడి చేసిన అమెరికాయే అవుతుందని వేరే చెప్పనక్కర లేదు. రెండు దేశాల మధ్య ఇప్పటికే పూర్తిస్థాయి రక్షణ ఒప్పందం ఉంది. జపాన్‌కు అణ్వస్త్ర స్థాయి రక్షణ కల్పించటం అందులోని అంశాలలో ఒకటి. జపాన్‌లోని ఒకినావా దీవిపై గల విస్తారమైన రక్షణ స్థావరాలు గాక దేశవ్యాప్తంగా 80కి పైగా సైనిక సదుపాయాలున్నాయి. పసిఫిక్‌ ప్రాంతంలో ఇరువురి ప్రయోజ నాలు, వ్యూహాలు ఒకటే. ఇటువంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నపుడు, జపాన్‌కు స్వయంగా అణ్వస్త్రాలు ఉత్పత్తి చేసుకోవలసిన అవసరం ఏమిటి? లేదా ఇతరుల అణ్వస్త్ర స్థావరాలకు చోటివ్వటం ఏమిటి?

మారుతున్న అమెరికా వైఖరి
మొదట ఒక మాటగా అనుకోవాలంటే, పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా వ్యూహాలు మారు తున్నాయనే అంచనా. చైనాను ప్రపంచంలో తమ పోటీదారు, పసిఫిక్‌ ప్రాంతంలో తమకు సవాలు అంటూ వచ్చిన అమెరికా, ఇటీవల జి–2 ఫ్రేమ్‌వర్క్‌ పద్ధతిలో వారితో సహకారానికి సిద్ధ పడటం. ఇదే సంవత్సరం ఆరంభంలో ‘ఇండో–పసిఫిక్‌ వ్యూహ పత్రం’ ప్రకటించిన ట్రంప్‌ ప్రభుత్వం, పసిఫిక్‌ నుంచి ఉపసంహరించుకున్నట్లయితే ప్రకటించలేదుగానీ (ఆ పని ఎన్నటికీ చేయరు), ఆ ప్రాంతంలోని తమ మిత్ర దేశాలు ఇక నుంచి తమ రక్షణ భారాన్ని చాలావరకు తామే మోయాలని స్పష్టం చేసింది. ఇదిగాక, దక్షిణ కొరియాను ఉపేక్షించి ఉత్తర కొరియాతో మైత్రికి ప్రయత్నించటం, జపాన్‌పై రకరకాల ఒత్తిడులు సృష్టించటం వంటివి జరుగుతున్నాయి.

ట్రంప్‌ ఇదే విధంగా ఇచ్చిన స్పష్టతలతో యూరప్‌పై ఒత్తిడులు పెరిగినట్లు, పసిఫిక్‌ ప్రాంతంలోనూ అదే జరుగుతున్నది. దానితో ఇదే సంవత్సరం నుంచి అందరూ రక్షణ బడ్జెట్లు పెంచుతున్నారు. ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇది ప్రధా నంగా చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో ముప్పు ఉందనుకునే దేశాల నుంచి కనిపిస్తున్నది. గమనించదగినదేమంటే దీనంతటికి ప్రత్యేకమైన చొరవ తీసుకుంటూ తీవ్రస్థాయిలో మాట్లాడుతున్నది జపాన్‌ ప్రభుత్వం. చైనాతో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో సరిహద్దు వివాదాలు మరికొన్ని దేశాలకు కూడా చిరకాలంగా ఉన్నాయి. అదే విధంగా ఆ సముద్ర ప్రాంతం నుంచి స్వేచ్ఛా నౌకా యాన సమస్యలు. కానీ అక్కడినుంచి పూర్తిగా తూర్పున గల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల వరకు ఏదో ఒక మేరకు సామరస్యత చూపుతూ ఆర్థిక సంబంధాలకు ప్రాధాన్యతనిస్తుండగా, జపాన్‌ నుంచి భిన్న ధోరణి కనిపిస్తున్నది.

తైవాన్‌పై వైఖరిలో దూకుడు
నిరుడు అక్టోబర్‌లో ప్రధానిగా ఎన్నికైన తకాయిచీ నవంబర్‌లో పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ఒకవేళ చైనా సైన్యం తైవాన్‌ను ఆక్ర మించుకొనజూసినట్లయితే, అందువల్ల జపాన్‌ ఉనికికి ప్రమాదం వాటిల్లగలదు గనుక తాము కూడా ఆ యుద్ధంలో పాల్గొనవలసి రావచ్చునని అన్నారు. దానితో ఒక్కసారిగా పరిస్థితి వికటించింది. ఆ ప్రకటనలోని ప్రమాదాన్ని గుర్తించిన ట్రంప్‌ హెచ్చరించిన మీదట తకాయిచీ మౌనం వహించటమైతే చేశారుగానీ, చైనా డిమాండ్‌ చేసినట్లు తన ప్రకటనను ఉపసంహరించుకోలేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తైవాన్‌ చైనాలో అంతర్భాగ మని ఐక్యరాజ్యసమితితో పాటు అత్యధిక దేశాలు గుర్తిస్తున్నాయి. వాటిలో జపాన్‌ కూడా ఉంది. తైవాన్‌ చైనాలో శాంతియుతంగా విలీనమవుతుందా, బలప్రయోగం ద్వారానా అన్నది వేరే విషయం. కానీ అసలు ఆ విలీనం విషయంలో జపాన్‌కుగానీ, మరొకరికిగానీ పాత్ర ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఆ విలీనం సైనికంగా జరిగినా తైవాన్‌ నుంచి 100 కిలోమీటర్లకు పైగా దూరంలో గల జపాన్‌ ఉనికికి ముప్పు కలగడమేమిటి? విలీనాలు శాంతియుతంగా జరగాలని కోరటానికీ, ఇటువంటి వైఖరి తీసుకోవటానికీ తేడా ఉంటుంది. అందుకు కారణం తకాయిచీ పూర్తి కన్సర్వేటివ్‌ కావటంతోపాటు, తైవాన్‌ కొంతకాలం తమ ఆక్రమణలో ఉండటం, అమెరికా వ్యూహంలో భాగం కావటమనే అభిప్రాయం ఉంది.

సమస్య ఈ విధంగా మొదలై ఇపుడు జపాన్‌ అణ్వస్త్రాల గురించి ఆలోచించే వరకు వచ్చింది. తైవాన్, చైనా ఒకటేనని స్వయంగా తైవాన్‌ కూడా సూత్ర రీత్యా అంగీకరించటం మరొక విశేషం. తమకు స్వాతంత్య్రం కావాలనే వర్గం ఒకటి అక్కడ ఉన్నా, వద్దనే వర్గం కూడా ఉంది. ఎప్పటికైనా, ఏదో విధంగా విలీనం చేసు కోగలమని చైనా కృతనిశ్చయంతో చెప్తున్నది. ట్రంప్‌ ఈ సంవత్సరం మే నెలలో చైనాకు వెళ్లినపుడు తనకు ఆ మాట అర్థమైనట్లే రాజీ ధోరణిలో వ్యాఖ్యానించారు. అటువంటి స్థితిలో, చైనాను తాము సైనికంగా నిలువరించగలమని జపాన్‌ ప్రధాని నిజంగానే నమ్ము తున్నారా? 1945 తర్వాత 81 ఏళ్లకు జపాన్‌ ప్రధాని ఆ వినాశనాన్ని మరచి అక్కరలేని అణ్వస్త్ర డైలమాను సృష్టించుకొని ఉండవచ్చు. జపాన్‌ ప్రజల వ్యతిరేకత మాత్రం సంతృప్తిని కలిగిస్తోంది.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement