ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
పూర్వం అయోధ్యను అనరణ్యమహారాజు పాలించేవాడు. ఆ రోజులలో రావణుడు తనకు యక్ష కిన్నర కింపురుషాదులలో ఎవరి వలననూ మరణం కలగకుండా బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు. ఆ బలంతో రాజులందరినీ పరాజితులను చేసి, అవమానపరచి ఆనందిస్తున్నాడు. అది తెలిసి, ముందుగానే లొంగిపోయి ప్రాణం రక్షించుకున్నారు కొందరు.
అయోధ్యను పాలించిన అనరణ్యమహారాజు మాత్రం రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ‘పూటకొకమాటు ఆకలిదప్పులతో అల్లాడే నరుల సేనను నా సైన్యం వేసే శరసమూహజ్వాలల దాహాన్ని తీర్చడానికి తెచ్చావా?’ అని హాస్యమాడాడు రావణుడు. ఇరువురికీ ముఖాముఖి జరిగిన యుద్ధంలో చివరన సారథిని కూల్చి, అనరణ్యమహారాజును రథహీనుడిని చేసి నేలమీద పడేట్లు చేశాడు.
‘మృత్యువు కూడా నా దగ్గరకు రావడానికి భయపడుతుంది. అలాంటిది నువ్వెంత? ఓడిపోయానని ఒప్పుకో, వదిలేస్తాను!’ అన్నాడు. ఒప్పుకోకుండా రావణుడి చేతిలో వీరమణం పొందాడు. అయితే, మరణానికి ముందు, ‘ఎప్పటికైనా నా వంశంలో పుట్టిన వీరుడి చేతిలోనే నీవు మరణం పొందుతావు!’ అన్నాడు. ఆ మాటలకు నవ్విన రావణుడితో అనరణ్యమహారాజు ఇంకా ఇలా అన్నాడని కంకంటి పాపరాజు రచించిన ‘శ్రీమదుత్తర రామాయణం’ తృతీయాశ్వాసంలోని ఈ క్రింది పద్యం చెబుతోంది:
చ. పురుషుడు కర్మసంగమున బొందు సుఖంబులు దుఃఖ మెవ్వరె
వ్వరికి విరోధముల్ సలుపు వా రిది దైవవశంబు దీనగా
తరతవహింప నే గనక దానమఖాధ్యయనాది కర్మముల్
వొరసితి నేని బల్కు పొలివోవక నట్లగుగాక యంచనన్.
‘మనిషి చేసే పనులను బట్టి సుఖదుఃఖాలు ఉంటాయి. ఎవరూ ఎవరికీ విరోధులు కారు. దైవం జరిపించే విధంగా జరిగేవే అన్నీ. నేనే గనుక దానధర్మాధ్యయనాది పుణ్యకర్మలను నిష్ఠగా చేసినవాడనైతే నా మాట అక్షరం పొల్లుపోకుండా జరుగుతుంది!’ అన్నట్లుగానే రావణుడి మరణం అయోధ్యను పాలించిన శ్రీరాముడి వలన జరిగింది. ధర్మబద్ధమైన జీవనం సాగించే వ్యక్తికి కష్టం కలిగి మాట్లాడే మాట తప్పక జరుగుతుందని దీనివలన అర్థమౌతుంది.
– భట్టు వెంకటరావు


