తలకిందుల తామర.. ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ! | Kambadur Malleshwara Swamy Temple Interesting Facts, A Marvel Of Ancient South Indian Architecture and Stone Sculptures | Sakshi
Sakshi News home page

తలకిందుల తామర.. ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ!

Aug 20 2026 9:25 AM | Updated on Aug 20 2026 9:38 AM

Kambadur Malleshwara Swamy Temple Ancient Architecture Stone Sculptures

అరుదైన శిల్పం

శ్రీ కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయం

అనంతపురం ప్రాంతంలోని కంబదూరు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తి విశ్వాసాలకు మాత్రమే కాకుండా ప్రాచీన దక్షిణ భారత వాస్తు, శిల్పకళా వైభవానికీ విశిష్టమైన ప్రతీక. ఆలయ నిర్మాణంలో కనిపించే రాతి స్తంభాలు, మండపాలు గర్భగృహం పైభాగం విమాన నిర్మాణం, అద్భుతమైన శిల్పాలు ఆ కాలం నాటి శిల్పుల అసాధారణ ప్రతిభకు నిదర్శనాలు.

ఈ ఆలయ వాస్తుశైలిలో విమాన నిర్మాణం ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. గర్భగృహం పైన నిర్మించిన విమానం దక్షిణ భారత దేవాలయ వాస్తు సంప్రదాయానికి అనుగుణంగా గర్భగృహానికి దైవిక ప్రాధాన్యతను ప్రస్ఫుటం చేస్తుంది. విమానం కేవలం ఆలయ పైకప్పు కాదు. అది గర్భగృహంలోని మూలవిరాట్టుపైన నిలిచే పవిత్ర నిర్మాణం. భూమి నుంచి పైకి ఎదిగే దాని నిర్మాణం దేవాలయ వాస్తులో భౌతిక లోకం నుంచి దైవిక లోకం వైపు ఎదుగుదలకు ప్రతీక.

కంబదూరు ఆలయ విమాన నిర్మాణంలో కనిపించే రాతి అమరికలు, అలంకార అంశాలు దక్షిణ భారత మధ్యయుగ దేవాలయ వాస్తు పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. గర్భగృహం పైన విమానం, దాని పైభాగంలో శిఖర నిర్మాణం ఉండటం వల్ల ఆలయానికి నిలువైన సౌందర్యం ఏర్పడుతుంది. విమానంలోని ప్రతిస్థాయి, అలంకార భాగం ప్రధాన గర్భగృహాన్ని మరింత గంభీరంగా చూపించే విధంగా రూపొందించబడింది.

ఈ ఆలయానికి మరో విశేషం దాని అద్భుతమైన రాతి శిల్పాలు. ఆలయ స్తంభాలు మండపాలు, ఇతర నిర్మాణ భాగాలపై దేవతారూపాలు నర్తకీమణులు యోధులు జంతువులు, పుష్పలతా అలంకరణలు కనిపిస్తాయి. కొన్ని శిల్పాలు ఆ కాలం నాటి సామాజిక జీవితం వస్త్రధారణ ఆభరణాలు యుద్ధ సంప్రదాయాలు, కళాసంస్కృతికి సంబంధించిన దృశ్యాలను మన కళ్లముందు ఉంచినట్లుగా అనిపిస్తాయి. ముఖమండపం, స్తంభాలపై కనిపించే సూక్ష్మమైన చెక్కడాలు ముఖ్యంగా ఆకట్టుకుంటాయి. గట్టి రాతిలో అంత సున్నితమైన శరీర భంగిమలు ముఖ కవళికలు వస్త్రమడతలు, ఆభరణాలను చెక్కడం శిల్పుల అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.

ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకంగా చెప్పుకోవలసిన కళాఅంశాలలో తలకిందుల తామరపుష్పం ఒకటి. మండపం పైకప్పు మధ్యభాగంలో రాతిలో చెక్కబడిన ఈ తామరపుష్పం పైనుంచి కిందికి వికసించినట్లుగా కనిపిస్తుంది. పుష్పదళాలను పొరలుగానూ, సమచతురంగా చెక్కిన తీరు శిల్పి అపూర్వమైన సౌందర్య దృష్టికి నిదర్శనం. భారతీయ దేవాలయ కళలో తామర పవిత్రత సృష్టిసౌందర్యం దైవత్వానికి ముఖ్యమైన ప్రతీక. ఆలయ పైకప్పు మధ్యలో తలకిందులుగా కనిపించే తామరను వాస్తు అలంకరణలో భాగంగా చూడవచ్చు. దాని నిర్దిష్ట తాత్విక అర్థం గురించి ప్రాచీన శాసన ఆధారం లభించక΄ోతే దానికి ఇచ్చే ఇతర అర్థాలను స్థానిక సంప్రదాయాలు, కళావ్యాఖ్యానాలుగా మాత్రమే పరిగణించాలి.

విమానగోపురం గర్భగృహాన్ని దైవిక కేంద్రంగా ప్రకటిస్తే మండపంలోని తలక్రిందుల తామర ఆ నిర్మాణానికి కళాత్మక కిరీటంలా కనిపిస్తుంది. బయట నుంచి ఆకాశాన్ని తాకేలా పైకి ఎదిగే విమానం, లోపల పైకప్పు నుంచి కిందికి వికసించినట్లుగా కనిపించే తామర అనే రెండు రూపాలు ఆలయ వాస్తులో ఒక అద్భుతమైన దృశ్య సమన్వయాన్ని సృష్టిస్తాయి.
– జి.బి.విశ్వనాథ, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌

నిర్వహణ : డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement