హెలికాప్టర్ నుంచి రేషన్ ప్యాకెట్లు పడి వృద్ధుడు మృతి | Helicopter Relief Package falls on Elderly man Death | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్ నుంచి రేషన్ ప్యాకెట్లు పడి వృద్ధుడు మృతి

Oct 3 2026 9:34 AM | Updated on Oct 3 2026 9:34 AM

Helicopter Relief Package falls on Elderly man Death

ఛప్రా: పైన హెలికాప్టర్ ఎగురుతోంది. కింద వరదల్లో చిక్కుకున్న జనం ఆ హెలికాప్టర్‌ నుంచి జారిపడే రేషన్‌ ప్యాకెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. అవి పడిన వెంటనే వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక రేషన్‌ ప్యాకెట్ 60 ఏళ్ల అనిల్ కుమార్ సింగ్‌పై పడింది. అనిల్ కోలుకునేలోపే, మరొక ప్యాకెట్ మళ్లీ ఆయనపై పడింది. అతను కుప్పకూలిపోయాడు. దీంతో గ్రామంలో గందరగోళం నెలకొంది. అనిల్ కుమార్ సింగ్ అలియాస్ అప్పు సింగ్ ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ ఘటన బిహార్‌లోని సారణ్ జిల్లా అమనౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరశురాంపురం గ్రామంలో చోటుచేసుకుంది.

ప్రస్తుతం వరదల కారణంగా పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు నీట మునిగాయి. ప్రధాన మార్గాల నుంచి అనేక ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు ప్రభుత్వం సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా అందిస్తోంది. నేపాల్ నుంచి వచ్చిన వరదల ప్రభావం సారణ్ జిల్లాలోని అనేక ప్రాంతాలపై పడింది. మేకర్, అమనౌర్, పరసాతో సహా పలు బ్లాక్‌లు ప్రభావితమయ్యాయి. అనేక గ్రామాలు ద్వీపాల్లా మారాయి. కాగా మృతుడు అనిల్ కుమార్ సింగ్ కుమారుడు అభినవ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ... తన తండ్రి భోజనం చేసి కూర్చుని ఉన్నారని, ఆ సమయంలో హెలికాప్టర్ నుంచి జారవిడిచిన ప్యాకెట్ ఆయన తలపై పడిందని, దాంతో ఆయన కింద పడిపోయారని చెప్పారు. అనంతరం ఆయన ఛాతీపై కూడా మరికొన్ని ప్యాకెట్లు పడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

సహాయక సామగ్రి తీసుకునే క్రమంలో వృద్ధుడు మరణించడం గ్రామస్తుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతోవారు అనిల్ సింగ్ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ధర్నాకు దిగారు. పోలీసులు, పరిపాలనా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు శాంతించి, ఆందోళనను విరమించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఛప్రా సదర్ ఆసుపత్రికి తరలించారు.

ఇదే గ్రామానికి చెందిన రంభా దేవి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి పైకప్పుపై నిలబడి హెలికాప్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. పైన హెలికాప్టర్ నుంచి సహాయక సామగ్రి పడుతోంది. ఆ సమయంలో హెలికాప్టర్ ఇంటికి దగ్గరగా రావడంతో బలమైన గాలి తగిలి, రంభా దేవి అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమె నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఇద్దరు పిల్లల కాళ్లకు కూడా ఫ్రాక్చర్లు అయినట్లు సమాచారం. ముగ్గురినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: చికిత్సకు తెచ్చిన తోపుడు బండిపైనే మృతదేహాన్ని తోసుకుంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement