టీవీకే అభ్యర్థిపై స్టాలిన్‌ దారుణ వ్యాఖ్యలు!? | Stalin Remarks on TVK Candidate Sathyabhama Trigger Body-Shaming Row | Sakshi
Sakshi News home page

టీవీకే అభ్యర్థిపై స్టాలిన్‌ దారుణ వ్యాఖ్యలు!?

Oct 3 2026 9:30 AM | Updated on Oct 3 2026 9:30 AM

Stalin Remarks on TVK Candidate Sathyabhama Trigger Body-Shaming Row

తమిళనాడు రాజకీయాల్లో ధారాపురం ఉప ఎన్నిక వేడి పుట్టిస్తోంది. అధికార పార్టీ టీవీకే అభ్యర్థి సత్యభామపై డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో వివాదానికి దారితీశాయి. ఆమెను ‘పెట్టీ బామా’, ‘పల్టీ బామా’ అని సంబోధించడంతో.. అవి బాడీ షేమింగ్‌ కామెంట్లేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. తక్షణమే స్టాలిన్‌ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్యభామ ధారాపురం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా గెలిచారు. ఎన్నికలు ముగిసిన కొద్ది వారాలకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమిళగ వెట్రి కగళం పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు అదే నియోజకవర్గం ఉప ఎన్నికలో టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె పార్టీ మార్పుపై డీఎంకే, అన్నాడీఎంకేలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. డబ్బులు తీసుకుని పార్టీ మారారంటూ ఆరోపణలు చేయగా.. సత్యభామ ఆ ఆరోపణలను ఖండించారు. 

ఈ క్రమంలోనే ధారాపురంలో ప్రచారం చేసిన స్టాలిన్‌.. ప్రజలు ఆమెను ‘పెట్టీ బామా’ అని పిలుస్తున్నారని, మరో పేరు ‘పల్టీ బామా’ అని అన్నారు. అనంతరం ఆమె శరీరాకృతిని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.

టీవీకే ఫైర్‌..
స్టాలిన్‌ వ్యాఖ్యలపై టీవీకే నేతలు తీవ్రంగా స్పందించారు. సత్యభామను కించపరిచేలా, ఆమె శారీరక రూపాన్ని ఉద్దేశించి మాట్లాడారని మండిపడ్డారు. ఇది మహిళలను, దళిత సమాజాన్ని అవమానించడమేనని టీవీకే నేత, ఆరోగ్యశాఖ మంత్రి అరుణ్‌రాజ్‌ విమర్శించారు. స్టాలిన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీవీకే మరో మంత్రి కీర్తన కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. 

ముందే మొదలైన ‘సూట్‌కేస్‌’ రచ్చ..
సత్యభామ పార్టీ మారినప్పటి నుంచే ధారాపురం ఉప ఎన్నికలో ఆమె చుట్టూ వివాదం నడుస్తోంది. డీఎంకే ఆమెను ‘పెట్టీ బామా’ అంటూ విమర్శిస్తూ ప్రచారం చేస్తోంది. పార్టీ మారేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలను సత్యభామ మాత్రం కొట్టిపారేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె చెబుతున్నారు. ఈ క్రమంలోనే మొన్నీమధ్యే  జరిగిన టీవీకే ప్రచార సభలో సత్యభామ భావోద్వేగానికి గురయ్యారు. 

తనపై అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎన్నికల్లో తనపై ఎంతో ఒత్తిడి ఉందని చెబుతూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌ ఆమెను ఓదార్చారు. అయితే ఈ పరిణామంపై కూడా డీఎంకే సెటైర్‌ వేసింది. స్వీట్‌ బ్రో సభలో కన్నీటి డ్రామానా? వహ్‌వా అంటూ డీఎంకే సీనియర్‌ నేత కనిమొళి సెటైర్లు వేశారు. 

ఇదిలా ఉంటే ధారాపురంతో పాటు మదురాంతకంలోనూ ఉప ఎన్నిక అక్టోబర్‌ 6న జరగనుంది.  డీఎంకే నుంచి ఎస్. సుగన్య, ఏఐఏడీఎంకే నుంచి కె. భానుమతి, నామ్‌ తమిళర్‌ కట్చి నుంచి ఎం. కార్తిక ధారాపురం బరిలో ఉన్నారు. ప్రచారం చివరి దశకు చేరుకున్న వేళ టీవీకే అభ్యర్థి సత్యభామ చుట్టూ సాగుతున్న ఈ మాటల యుద్ధం రాజకీయంగా మరింత వేడి పెంచుతోంది.

ఇదీ చదవండి: పూజారుల్ని ఇక కోర్టే ఎంపిక చేస్తుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement