ఫ్లైదుబాయ్‌ హీరోకు ప్రధాని మోదీ వీడియోకాల్‌ | PM Modi Speaks to Flydubai Hero Captain Smit Praises His Courage | Sakshi
Sakshi News home page

ఫ్లైదుబాయ్‌ హీరోకు ప్రధాని మోదీ వీడియోకాల్‌

Oct 2 2026 12:13 PM | Updated on Oct 2 2026 12:47 PM

PM Modi Speaks to Flydubai Hero Captain Smit Praises His Courage

ఫ్లైదుబాయ్‌ విమానంలో పెను ప్రమాదాన్ని తప్పించిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం యూఏఈలోని అబుదాబిలో చికిత్స పొందుతున్న ఆయన .. ఘటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఆ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన ఆయన ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించగా.. మచ్చార్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

కో-పైలట్‌ తనపై ఎలా దాడి చేశాడో.. ఆ సమయంలో తనకు ధైర్యం ఇచ్చిన విషయాలేంటో కెప్టెన్‌ స్మిట్‌ మచ్చర్‌ ప్రధాని మోదీకి వివరించారు. దాడిలో తీవ్రంగా గాయపడి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ.. విమానం ఒక్కసారిగా కిందకు దిగడాన్ని గమనించానని చెప్పారు. ఆ సమయంలో ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఉందన్న భయంతో ఎలాగైనా కాక్‌పిట్‌ తలుపు తెరవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

“ఏదో విధంగా నిలబడి కాక్‌పిట్‌ తలుపు తెరిచాను. ప్రయాణికులు లోపలికి రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది” అని స్మిట్‌ వివరించారు. ప్రమాద సమయంలో తనకు ధైర్యం ఇచ్చింది హనుమాన్‌ చాలీసా అని, దానిని చదువుకుంటూ ధైర్యం తెచ్చుకున్నానని చెప్పారు. “ఆ భగవంతుడే నన్ను కాపాడాడు. మీతో మాట్లాడతానని నేను అనుకోలేదు. నాకు మీరే నాకు స్ఫూర్తి” అంటూ మచ్చార్‌ భావోద్వేగానికి లోనయ్యారు. 

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ స్మిట్‌ మచ్చర్‌ చూపిన సమయస్ఫూర్తి, ధైర్యాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ.. త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. నేను అందుబాటులో ఉంటాను అంటూ మచ్చార్‌కు మోదీ మాటిచ్చారు.

బుధవారం ఉదయం దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానంలో కో-పైలట్‌ దాడి చేసిన ఘటనలో కెప్టెన్‌ స్మిట్‌ మచ్చర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన కాక్‌పిట్‌ తలుపు తెరిచి సహాయం కోరడంతో పాటు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేసేందుకు కీలకంగా వ్యవహరించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కాపాడటంలో స్మిట్‌ మచ్చర్‌ పాత్ర కీలకంగా మారింది. గాయాలతో పోరాడుతూనే ఆయన చూపిన ధైర్యంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఘటన అనంతరం తొలుత సౌదీ అరేబియాలోని తబూక్‌ ఆస్పత్రిలో ఆయనకు వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌ చేశారు. ప్రస్తుతం స్మిట్‌ మచ్చర్‌ యూఏఈలోని అబుదాబిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని.. ఆయన మాట్లాడగలుగుతున్నారని.. త్వరలో కోలుకుంటారని వైద్యులు, ఇటు భారత రాయబార కార్యాలయమూ ఒక ప్రకటన చేసింది.

కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌ సాహసం చూసి దేశం గర్విస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకు ముందు అభినందించారు. మరో 9/11 తరహా దాడి జరగకుండా మచ్చార్‌ అడ్డుకోగలిగారంటూ పొగిడారు.  అంతేకాదు.. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన అధైర్య పడొద్దని.. భారత ప్రభుత్వం తరఫున అన్నివిధాల సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 

ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్‌ ఘటన.. వీడియోలో భయానక దృశ్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement