తెల్లని ఒంటిపై నల్లటి చారలు.. మెరిసే నీలి కళ్లతో ‘తేజస్’ వచ్చేసింది. గ్వాలియర్ నుంచి ఏకంగా 556 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ అరుదైన తెల్ల పులి డెహ్రాడూన్ జూకు కొత్త ఆకర్షణగా చేకూర్చింది. పులుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా వచ్చిన తేజస్.. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. దాదాపు నెల రోజుల తర్వాత సందర్శకులను అలరించేందుకు ఎన్‌క్లోజర్‌లోకి రానుంది.
తేజస్ రాకతో జూలో వన్యప్రాణుల వైవిధ్యం పెరుగుతుందని.. సందర్శకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని జూ అధికారులు భావిస్తున్నారు. అయితే కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు, ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యే వరకు తేజస్‌ను కొంతకాలం ప్రజలకు దూరంగా ఉంచనున్నారు. డెహ్రాడూన్ జూ, గ్వాలియర్ జూలాజికల్ పార్క్ మధ్య జరిగిన పులుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా తేజస్‌ను డెహ్రాడూన్‌కు తీసుకువచ్చారు. దీనికి ప్రతిగా డెహ్రాడూన్ జూకు చెందిన దాదాపు ఐదేళ్ల వయసున్న ‘భోలా’ అనే రాయల్ బెంగాల్ పులిని గ్వాలియర్‌కు తరలించారు.
గ్వాలియర్ నుంచి డెహ్రాడూన్ వరకు తేజస్ సుమారు 556 కిలోమీటర్ల దూరాన్ని రోడ్డు మార్గంలో ప్రయాణించింది ఈ ప్రయాణానికి 12 నుంచి 14 గంటలు పట్టింది. జంతువుతో పాటు పశువైద్యులు, అటవీశాఖ అధికారులు సహా మొత్తం 13 మంది సభ్యుల బృందం ప్రయాణించింది. తేజస్‌ను సుమారు 20 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. ఈ సమయంలో ఎన్‌క్లోజర్ కీపర్, పశువైద్యుడు మాత్రమే దాని వద్దకు వెళ్లారు. తేజస్ ఆరోగ్యం, ఆహారం, ప్రవర్తన, కొత్త వాతావరణానికి అలవాటు పడే విధానాన్ని నిశితంగా పరిశీలిస్తారు.
తెల్ల పులి అనేది ప్రత్యేకమైన జాతి కాదు.. దాని తెల్లని రంగుకు కారణం అరుదైన జన్యు లక్షణం. అల్బినో జంతువుల మాదిరిగా కాకుండా, తెల్ల పులులకు సహజమైన చారలు ఉంటాయి. ఇవి బెంగాల్ పులిలో కనిపించే సహజ రంగు వైవిధ్యంగా పరిగణించబడతాయి. వాటి అరుదైన రూపం కారణంగా ప్రపంచంలోని అనేక జూలలో తెల్ల పులులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇదీ చదవండి: నర్సింగ్ విద్యార్థిని కేసులో సంచలన ట్విస్ట్


