ఢిల్లీలో హైటెన్షన్‌.. భారీగా బలగాల మోహరింపు! | Jantar Mantar protest metro stations closed Security Alert | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో హైటెన్షన్‌.. భారీగా బలగాల మోహరింపు!

Oct 2 2026 9:10 AM | Updated on Oct 2 2026 9:10 AM

Jantar Mantar protest metro stations closed Security Alert

ఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు.. పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. జంతర్‌ మంతర్‌ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ మెట్రో 11 స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. జంతర్‌ మంతర్‌ వద్ద ప్రతిపాదిత ఆందోళన నేపథ్యంలో ప్రజల భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు న్యూఢిల్లీలో BNSS సెక్షన్‌ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ముందస్తు అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, ర్యాలీలు, ధర్నాలు, నినాదాలు, ప్రసంగాలపై ఆంక్షలు విధించారు. నిషేధాజ్ఞలు అమలు చేయడంతో రాజధానిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇక, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్‌ చేస్తోంది. అక్టోబర్‌ 2న ముంబైలోని శివాజీ పార్క్‌లో ఆందోళనకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే పిలుపునిచ్చారు. అయితే శివాజీ పార్క్‌లో కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి ఇవ్వలేదని, ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాలని సూచించారు. దీంతో, ముంబైలో హైఅలర్ట్‌ వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉండగా.. జంతర్‌ మంతర్‌ వద్ద ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (RAF) సిబ్బందిని మోహరించారు. అల్లర్ల నియంత్రణ వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జంతర్‌ మంతర్‌ సమీపంలోని జన్‌పథ్‌, పటేల్‌ చౌక్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌, రాజీవ్‌ చౌక్‌, సేవా తీర్థ్‌, మండీ హౌస్‌, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ మెట్రో స్టేషన్ల గేట్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేశారు. దీంతో ఆయా స్టేషన్ల వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement