సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో బాణసంచా కాల్చడంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం (సెప్టెంబర్ 30) విచారణ జరిపింది. ఈ సందర్భంగా టపాసుల వినియోగంపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీలో బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని, అలాగని రోజంతా వాటి వాడకాన్ని అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.
బాణసంచాపై పూర్తి నిషేధం విధిస్తే కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతింటాయని కోర్టు పేర్కొంది. అదే సమయంలో, రోజంతా బాణసంచా కాల్చడానికి అనుమతిస్తే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లలతో సహా ప్రతి ఒక్కరిపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. బాణసంచా కాల్చడానికి నిర్దిష్ట సమయాలను,అనుమతించదగిన బాణసంచా రకాలను నిర్ణయించడం ద్వారా ఒక మధ్యేమార్గాన్ని కనుగొనాలని సూచించింది.
బాణసంచా తయారీలో బేరియం వినియోగం, శబ్ద స్థాయిలను (డెసిబెల్ స్థాయిలు) పరిశీలించేందుకు సంయుక్త పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.


