తమిళనాడు రాజకీయాల్లో సినిమా–రాజకీయాల అనుబంధం కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఒకే సమయంలో ఇద్దరు స్టార్ హీరోల పేర్లు రాజకీయ చర్చలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగా.. తాజాగా మరో స్టార్ హీరో ధనుష్ పేరు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. దీనికి మరింత ఊతమిచ్చింది డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన తాజా వ్యాఖ్య.
ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కనిమొళి విజయ్ ప్రభుత్వ ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ.. ధనుష్ నటించిన ‘వేలైల్ల పట్టదారి’ (వీఐపీ) సినిమాను ఆమె గుర్తుచేశారు. ‘‘వేలైల్ల పట్టదారీలకు రూ.4 వేలు వచ్చాయా? రాలేదు. ధనుష్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చేశారు’’ అంటూ కనిమొళి చేసిన వ్యాఖ్య ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
అందుకే ధనుష్ ప్రస్తావన!
కనిమొళి అసలు టార్గెట్ విజయ్ ప్రభుత్వమే. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4 వేల సాయం, మహిళలకు రూ.2,500, ప్రతి కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు వంటి ఎన్నికల హామీల అమలుపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగానే ‘వేలైల్ల పట్టదారి’ సినిమాను ప్రస్తావించారు. ఆ చిత్రంలో ధనుష్ నిరుద్యోగ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌గా నటించారు. సినిమా పేరును రాజకీయ విమర్శకు వాడటం ఒక ఎత్తయితే.. ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశారు’’ అని ఆమె చెప్పడం మరో చర్చకు కారణమైంది.
ఇక్కడే అసలు రాజకీయ ఆసక్తి మొదలవుతోంది. ధనుష్ ఇప్పటివరకు రాజకీయ పార్టీని ప్రకటించలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పలేదు. అయినప్పటికీ ఆయన రాజకీయ ప్రవేశంపై కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి.
అసలు ధనుష్ ఏం చేశారు?
జూలైలో అభిమానుల కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ.. సినిమా వేడుకలకే అభిమానుల ఐక్యతను పరిమితం చేయకుండా సంక్షేమ కార్యక్రమాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. అభిమానులు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ వ్యాఖ్యలను కొందరు రాజకీయ సంకేతాలుగా చూశారు. అయితే ధనుష్ మాత్రం రాజకీయ పార్టీ ఏర్పాటు లేదా ఎన్నికల్లోకి రావడంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇక ఆయన అభిమాన సంఘాల కార్యకలాపాలు కూడా ఈ చర్చకు కారణమయ్యాయి. తమిళనాడులో పలు ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం, అభిమానులను సామాజిక సేవ వైపు మళ్లించడం వంటి పరిణామాలు కనిపించాయి. దీంతో ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? అన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
డీఎంకేకు ధనుష్‌పై ఆసక్తి ఉందా?
ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. కనిమొళి ధనుష్ పేరును విజయ్‌పై రాజకీయ విమర్శలోకి తీసుకురావడం యాదృచ్ఛికమేనా? లేదంటే ధనుష్ చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చను డీఎంకే కూడా గమనిస్తోందా? అన్న చర్చ మొదలైంది. అయితే అదే వ్యాఖ్య ధనుష్‌ను ఒక్కసారిగా విజయ్‌కు ప్రత్యామ్నాయ సినీ ముఖంగా రాజకీయ చర్చలోకి తీసుకొచ్చింది.
తమిళనాడులో ఇది చిన్న విషయం కాదు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్, కమల్‌హాసన్ వంటి సినీ ప్రముఖులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా విజయ్ కూడా సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో మరో ప్రజాదరణ కలిగిన నటుడి పేరు రాజకీయ చర్చలోకి వస్తే సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. పైగా ధనుష్ మామ(మాజీ) రజనీకాంత్ డీఎంకేకు దగ్గరే కావడం, విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక ధనుష్ వైఖరిలో వచ్చిన మార్పు.. మున్ముందు ఈ ప్రయత్నాలకు మార్గం సుగమం చేయొచ్చనే చర్చా నడుస్తోంది.
విజయ్‌కు ధనుష్ ప్రత్యామ్నాయమా?
ఇప్పటి పరిణామాలను కలిపి చూస్తే.. ఒకవైపు విజయ్ ప్రభుత్వంపై డీఎంకే బహిరంగ విమర్శలు చేస్తోంది. మరోవైపు విజయ్ సినిమా నేపథ్యం నుంచే వచ్చిన ధనుష్ పేరు రాజకీయ చర్చలోకి వచ్చింది. ఈ రెండింటినీ కలిపి చూస్తే కనిమొళి వ్యాఖ్యకు రాజకీయంగా మరో అర్థం వెతికే ప్రయత్నం జరగడం సహజం.
ధనుష్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా? వస్తే సొంతంగా రంగంలోకి దిగుతారా? లేక ఏదైనా రాజకీయ పార్టీతో కలిసి అడుగులు వేస్తారా? అన్నది మాత్రం మున్ముందు ఆయన తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
ఇదీ చదవండి: అఖిలేష్ అంతగా అలగడానికి కారణం ఏంటంటే..?


