రాజకీయ ప్రయోజనాలకోసం ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీయడం విచారకరం.. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్య.
2019లో చంద్రబాబే చేసిన ఇంకో వ్యాఖ్యను గమనించండి. మోదీ దేశంలోని ప్రతిష్టాత్మక వ్యవస్థలను ధ్వంసం చేశారు. బీజేపీ పాలనలో వ్యవస్థల స్వతంత్రత, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయి. సీబీఐ మొదలు ఆర్‌బీఐ వరకు... ఎన్నికల కమిషన్ వంటి సంస్థలను కూడా వదలిపెట్టడం లేదు.
ఈ రెండు వ్యాఖ్యలను చదివితే ఏమనిపిస్తుంది? చంద్రబాబు వంటి అవకాశవాద రాజకీయ నేతల వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటోందా? లేక బలపడుతోందా? అన్న భావన కలగదా! తాను అధికారంలో ఉంటే అంతా సజావుగా ఉన్నట్లు, అధికారంలో లేకపోతే వ్యవస్థలన్నీ పాడైనట్లు జనం అనుకోవాలన్నమాట. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌కుమార్ నియమితులైనప్పటి నుంచి వివాదాలు మరీ తీవ్రమైనట్లు అనిపిస్తుంది. గతంలో కూడా కొందరు సీఈసీలపై విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి వచ్చినవి తీవ్రమైన అభియోగాలు.
గతంలో టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్నప్పుడు దేశం మొత్తాన్ని గడగడలాడించారంటే అతిశయోక్తి కాదు. కాస్త దుందుడుకు అన్న విమర్శ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడాలంటే, అదికారులు రాజకీయ నేతలకు సహకరించాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు. చివరికి గోడలపై ఎన్నికల ప్రచారం చేయడానికి కూడా ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకునేవారు. అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో విబేధాలు రావడంతో, ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు ఎన్నికల కమిషన్‌ను త్రిసభ్య కమిషన్‌గా మార్చారు. ఆయన తనకు సన్నిహితుడైన జీవీజీ కృష్ణమూర్తిని నియమించారని అంటారు. శేషన్‌కు చెక్ పెట్టడానికి ఈ ఏర్పాటు జరిగిందన్న భావన అప్పట్లో ఉండేది. ఆనాటి నుంచి త్రిసభ్య కమిషనే కొనసాగుతోంది. కొన్నిసార్లు విమర్శలు వచ్చేవి.
కేంద్రంలో శక్తిమంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కొందరు ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేసి వెళ్లిపోయిన ఘట్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానిగా, బీజేపీ అదికారంలోకి వచ్చాక కొన్ని ఇలాంటివి జరిగాయి. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఒకరి కుటుంబ సభ్యులపై ఈడీని ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఎంపిక కమిటీలో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బదులుగా కేంద్ర మంత్రిని ఒకరిని నామినేట్ చేసే పద్దతిని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. లోక్‌సభలో విపక్ష నేతకు ఇందులో స్థానం ఉన్నా ఆ పాత్రను నామమాత్రం చేశారన్నమాట.
గత 2024 ఎన్నికలకు ముందు జ్ఞానేశ్‌కుమార్‌ను ఎంపిక చేసుకున్న వైనం, అంతకుముందు కేంద్రంలో ఈయన కీలక పాత్ర పోషించిన తీరు, గతంలో కేరళలో పనిచేసినప్పుడు వచ్చిన విమర్శలు, ప్రధాని, హోం మంత్రులకు ఈయన సన్నిహితుడన్న ప్రచార నేపథ్యం వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే సహజంగానే ఆయా వర్గాలకు అనుమానాలు కలుగుతాయి. దానికి తోడు పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో 2024 ఎన్నికలు జరిగిన తీరుతెన్నులపై ఎన్నో సంశయాలు వచ్చాయి. కొన్ని రాష్ట్రాలలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో లక్షల ఓట్ల తొలగింపు, లేదా పెండింగులో పెట్టడం, పోలింగ్ జరిగేనాటికి కూడా ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించకపోవడం, ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు, అర్ధరాత్రి దాటిన తర్వాత లక్షల ఓట్లు పోలైనట్లు చూపించడం, వీటిపై ఆధార సహితంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం వంటివి ఎన్నికల సంఘంలో పారదర్శత లేదన్న అభిప్రాయం కలిగించింది.
కొన్ని ఉదాహరణలు చూడండి.. పశ్చిమబెంగాల్‌లో 27 లక్షల ఓట్లను పెండింగ్‌లో ఉంచారట. వాటి సంగతి తేల్చకుండా ఎన్నికలు పూర్తి చేయడంలో ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వాటిని పరిశీలిస్తుంటే 97 శాతం ఓట్లు నిజమైనవేనని తేలుతోందట. ఏపిలో సాయంత్రం ఆరు తర్వాత ఏభై లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? అందులోను అర్దరాత్రి 12 గంటల నుంచి రెండుగంటల వరకు 17 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఎన్నికల సంఘం మౌనముద్ర దాల్చింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఫిర్యాదు చేసినా కిమ్మనలేదు. పరకాల ప్రభాకర్ వంటి వారు పరిశోధన చేసి సదస్సులు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నా, జవాబు ఇవ్వడం లేదు. ఎన్నికల వ్యవస్థపై అభాండాలు వేస్తారా అని కూడా అడగలేకపోయింది.
ఇదీ చదవండి: బాబుకు సోషల్ మీడియా భయం.. కరపత్రాల ప్రచారం తగ్గిందా?
విశేషం ఏమిటంటే 2009లో కాని, 2019లో కాని ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ పైన, ఈవీఎంల పైన తీవ్ర విమర్శలు చేసి, అవి మానిప్యులేషన్‌కు గురి అవుతున్నాయని ఆరోపించారు. నిజానికి అప్పట్లో ఈవీఎంలపై ఈ స్థాయిలో సందేహాలు రాలేదు. అయినా వాటి ద్వారా అక్రమాలు చేయవచ్చని ఆయన అనేవారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడేమో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లేలా విమర్శలు చేయరాదని సుద్దులు చెబుతున్నారు. 2019లో ఆనాటి ప్రధాని మోదీపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది ఆయన ట్వీట్‌లే తెలియచేస్తాయి. సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలను ధ్వంసం చేశారని కూడా ఆనాడు ఆరోపించారు. ఇప్పుడేమో ఇలా అమాయకంగా మాట్లాడుతున్నారు. అవే ఆయన తెలివితేటలు.
చంద్రబాబు వ్యూహాత్మకంగా, ఎలాగొలా బతిమలాడి 2024 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల కమిషన్ పూర్తిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆనాటి బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తమకు ఏ ఏ అధికారి కావాలో చెబుతూ జాబితాను సమర్పిస్తే, చాలావరకు ఎన్నికల సంఘం అమలు చేసిందని చెబుతారు. సీసీ టీవీ ఫుటేజీ ఒకసారి లీక్ అయింది. దానిని టీడీపీ ప్రచారం చేసింది. అయినా అదెలా జరిగిందని ఈసీ అడగలేదు. ఎన్నికలయ్యాక కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్దిష్ట గడువుతో సంబందం లేకుండా వివిపాట్ స్లిప్‌లను దగ్దం చేసేయడం పలు సందేహాలకు అవకాశం ఇచ్చింది.
కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు కొన్ని బూత్‌లలో ఓట్లను తిరిగి లెక్క వేయాలని కోరుతూ దరఖాస్తు చేసినా అందుకు ఎన్నికల కమిషన్ అధికారులు సిద్దపడలేదు. దీనిపై న్యాయవ్యవస్థ వద్దకు వెళ్లినా ప్రయోజనం కలగకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన వ్యవస్థలు ఇలా వ్యవహరిస్తున్నాయేమిటా అని చాలామంది బాధపడ్డారు. కాని జరగవలసిన డామేజీ జరిగిపోయింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎన్నికల కమిషన్‌లో జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం చెప్పిన విధానం.. అన్నిటిని జర్నలిస్టు రితిక చోప్రా వెలుగులోకి తీసుకువచ్చిన కథనం సంచలనం అయింది. ఇందుకు ఆమె చేసిన కృషిని అంతా అభినందించాలి. ఎన్నికల కమిషన్‌లోని డొల్లతనం అంతా వెలుగులోకి వచ్చింది. అసలు ఇలా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు చట్టంలో ఎక్కడా అవకాశం లేదని, మాజీ ఎన్నికల ముఖ్య కమిషన్ ఖురేషి వెల్లడించారు. అయినా జ్ఞానేశ్‌కుమార్ ఎలా చేశారంటే ఏమి చెబుతాం. కేవలం బీజేపీ, దానికి మద్దతు ఇచ్చే పార్టీల కోసమే పనిచేస్తున్నారని, విపక్ష పార్టీల వాదనలను పెడచెవిన పెడుతున్నారన్న భావన కలిగితే వ్యవస్థకు ఎంత నష్టం. ఎవరు ఫిర్యాదు చేసినా అందులోని వాస్తవాలను విచారించి న్యాయం ఏమిటో తేల్చవలసిన ఎన్నికల వ్యవస్థే ఏకపక్షంగా మారితే ఎన్నికలు జరిగి ఏమి ఉపయోగం? ఇదంతా నియంతృత్వానికి దారితీయదా? అందువల్లే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలవరం సృష్టిస్తోంది.
జ్ఞానేశ్ రాజీనామాకు విపక్షంలోని కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, సమాజవాది, తదితర పార్టీలతో పాటు యువతకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామక విధానంపై పునఃసమీక్ష జరగాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. గతంలో తాము మద్దతు ఇచ్చినప్పటికీ, జరిగిన పరిణామాల రీత్యా దీనిలో మార్పు రావాలని ఆయన కోరారు. ఈ అంశంపై కొన్ని బీజేపీ మిత్రపక్షాలు కూడా జాగ్రత్తగా స్పందించాయి. వాటిలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈసీ వివరణ ఇవ్వాలని తొలుత సూచించారు. దానికి టీడీపీ అధినాయకత్వం కంగారుపడినట్లు ఉంది. తదుపరి ఈసి ఇచ్చిన వివరణ అంత సంతృప్లిగా లేనప్పటికీ, చంద్రబాబు నాయుడు బీజేపీకి కోపం రాకుండా వెంటనే స్పందించారు.
ఇంతకాలం ఏపిలో జరిగిన ఎన్నికల ప్రహసనంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా మాట్లాడని చంద్రబాబు దీనిపై మాట్లాడుతూ వ్యవస్థల విశ్వసనీయత గురించి ధర్మోపదేశం చేశారు. ఏపిలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అవకతవకలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం జరగలేదని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు వంటివి లేకుండా ఓటర్ల జాబితాలను తయారు చేయాలన్న చిత్తశుద్ది ఉంటే, ఆధార్ కార్డుకు లింక్ పెట్టి ఓట్లను ఖరారు చేస్తే సరిపోతుందని ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. అది చేయకుండా ఎన్నో విన్యాసాలను ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ చేస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఎలా కుదురుతుంది?
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


