సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనానికి లోనైన ఆ సంఘం నేత మధుబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పోరాడుతుంటే ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారని.. అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టారు. తక్షణమే సస్పెన్షన్లు, పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులపై చర్యల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని మధుబాబు కోరారు. ఉద్యమ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కేసులు ఎత్తివేసి, సస్పెన్షన్లు తొలగించాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అక్టోబర్ 2లోపు కేసులు, సస్పెన్షన్లపై నిర్ణయం తీసుకోవాలని డెడ్‌లైన్ విధించారు. అప్పటిలోగా సమస్య పరిష్కారం కాకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు.
ఒంటరిగానే..
డెడ్‌లైన్ లోపు ఉద్యోగులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని మధుబాబు స్పష్టం చేశారు. అప్పటిలోగా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 3 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. తన హక్కుల కోసం, ఉద్యమంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగుల న్యాయం కోసం ఒంటరిగానే దీక్ష చేస్తానని తెలిపారు.
శ్రీకాకుళంలో ఆమరణ దీక్ష
ఆమరణ నిరాహార దీక్షను శ్రీకాకుళంలో చేపడతానని మధుబాబు ప్రకటించారు. మహిళలను ఇబ్బంది పెట్టిన వారికి వారి ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. మధుబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన భావోద్వేగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం మరింతగా కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే విజయవాడలో జరిగిన ధర్నాలో పాల్గొన్న పలువురు ఉద్యోగులపై పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించిన ప్రభుత్వం.. తాజాగా ఆ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులందరి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 27వ తేదీ విజయవాడలో నిర్వహించిన ధర్నాకు అనుమతి లేకపోయినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆ ధర్నాలో పాల్గొన్నారని ఎత్తి చూపుతూ ప్రభుత్వం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కార్యాలయం సోమవారం ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలు జారీ చేయగా.. ఆయా జిల్లాల కలెక్టర్ల సూచనతో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల నుంచి మండలాలు, పట్టణాల వారీగా మంగళవారం సాయంత్రానికే జాబితాలు సేకరించి పంపారు. తమ సమస్యల గురించి రెండేళ్లుగా పలుమార్లు విన్నవించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు 27వ తేదీ ఆదివారం ‘ఛలో విజయవాడ’ చేపట్టారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో మరింతగా కక్ష గట్టింది.
వాస్తవానికి 27వ తేదీ ఆదివారం ఉద్యోగులకు సెలవు. అయినప్పటికీ వారంతా ఆ రోజు ఎక్కడ ఉన్నారని ప్రభుత్వం ఆరా తీయడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సచివాలయ ఉద్యోగుల తీవ్ర స్థాయి ఆందోళనల నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీన పింఛన్ల పంపిణీకి ఏమైనా ఇబ్బందులెదురవుతాయా.. అని ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంది. పింఛన్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. మరో వైపు ప్రభుత్వం ఈ నెల 27న విజయవాడ ధర్నాలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మేజర్ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న 9 మంది సచివాలయ ఉద్యోగులకు మెమోలు ఇచ్చింది. మీకు జీతాలు ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలని అడగడం కలకలం రేపుతోంది.
ఇదీ చదవండి: మేం చేసిన పాపమేంటి బాబూ?


