బెజవాడ న్యాయవాదులపై లాఠీచార్జ్‌ | Police Take Lathicharge On Lawyers: Andhra pradesh | Sakshi
Sakshi News home page

బెజవాడ న్యాయవాదులపై లాఠీచార్జ్‌

Sep 30 2026 5:41 AM | Updated on Sep 30 2026 5:41 AM

Police Take Lathicharge On Lawyers: Andhra pradesh

ర్యాలీగా వస్తున్న న్యాయవాదులను బారికేడ్లతో అడ్డుకుంటున్న పోలీసులు

పోలీసుల వైఖరిని నిరసిస్తూ విజయవాడలో నిరసన ప్రదర్శన  

శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న న్యాయవాదులపై పోలీసుల ఓవరాక్షన్‌ 

మహిళా న్యాయవాదులను అసభ్యంగా తాకి ఖాకీల పైశాచికం 

రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల విధుల బహిష్కరణకు లాయర్ల పిలుపు 

రిలే దీక్షలకు బెజవాడ బార్‌ అసోసియేషన్‌ నిర్ణయం  

విజయవాడ లీగల్‌: న్యాయవాదుల పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ బెజవాడ బార్‌ అసోసియేషన్‌ పిలు­పు మేరకు మంగళవారం చేపట్టిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. ఒకదశలో న్యాయవాదులపై లాఠీ­చార్జ్‌ చేశారు. మహిళా న్యాయవాదులను అడ్డుకునే క్రమంలో వారిని తాకరానిచోట్ల అభ్యంతరకరంగా తాకారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ న్యా­యవాదులు రాష్ట్రవ్యాప్తంగా రెండురోజుల పాటు వి­ధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో చోటుచేసుకున్న అక్రమాలకు వ్యతిరేకంగా గళమెత్తిన న్యాయవాదులపై పోలీసులు రౌడీషిట్‌ తెరి­చే ప్రయత్నాలను నిరసిస్తూ విజయవాడలో న్యాయవాదులు మంగళవారం కోర్టులను బహిష్కరించి నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. 

కోర్టుల ప్రాంగణం నుంచి అంబేడ్కర్‌ స్మృతివనం వరకు ప్రదర్శనగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి న్యాయవాదులను ముందుకు వెళ్లకుండా నిలువరించగా.. వాటిని తోసుకుని న్యాయవాదులు ముందుకెళ్లారు. దీంతో పోలీసులు, న్యాయవాదుల మధ్య తోపులాట జరిగింది. ఈ దశలో న్యాయవాది దుస్తు­లు చినిగిపోయాయి. మహిళా న్యాయవాదులను సైతం పోలీసులు తోసివేశారు. న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌పై అక్రమంగా రౌడీషిట్‌ తెరిచేందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని, న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఆపాలని న్యాయవాదులంతా డిమాండ్‌ చేశారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న అడ్వొకేట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ ఇక్కడా ఆమలు చేయాలని కోరారు.  

అక్రమ కేసులు బనాయించడం అన్యాయం 
బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారా­యణ మాట్లాడుతూ.. న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు. క్రిమినల్‌ రికార్డు లేని న్యాయవాదులపై నోటీసులు కూడా జారీ చేయకుండా రౌడీషిట్లు తెరుస్తామని పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. నగరంలో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మహిళా న్యాయవాదులను మహిళా పోలీసులు లేకుండానే అసభ్యంగా తాకడం, వారిని తోసేయడం వంటి అనాగరిక చర్యలను ఖండిస్తున్నామన్నారు. 

నేడు, రేపు విధుల బహిష్కరణ
పోలీసుల వైఖరిని నిరసిస్తూ రా్రష్తవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో న్యాయవాదులంతా బుధ, గురువారా­లలో స్వచ్ఛందంగా విధులను బహిష్కరిస్తు న్న­­ట్టు బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. బెజవాడ కోర్టు కాంప్లెక్స్‌లో అనధికారికంగా ఉంటున్న పోలీసు రూములు, ఏపీపీ రూములకు తాళా­లు వేయనున్నట్టు తెలిపింది. కోర్టు కాంప్లెక్స్‌లోని­సీసీ కెమెరాల యాక్సెస్‌ను సూర్యారావుపేట పోలీసు­స్టేషన్‌ నుంచి తొలగించాలనే తీర్మానానికి న్యా­య­వా­దులంతా సంపూర్ణ మద్దతు 
ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement