ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలివ్వటం తప్పా?
కులం, మతం, పార్టీ చూడకుండా సాయం చేయటం నేరమా?
వెన్నుపోటు పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వలంటీర్లు
నిరంతరం సేవలందించినందుకు మాకిచ్చింది నెలకు రూ.5 వేలు
దుబారా తగ్గించడానికే మమ్మల్ని తొలగించామంటూ బాబు డబ్బా
ఇప్పుడేమో ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టేందుకు పన్నాగం
సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే రూ.15 వేలు!
ప్రభుత్వ తీరు అత్యంత దారుణం.. మాకు రూ.5 వేలు ఇవ్వటం దుబారా అని చెప్పి... ఇపుడు ప్రచారానికి వేలకు వేలా అని ప్రశ్న
ప్రభుత్వ ఖజానా నుంచి పార్టీ కార్యకర్తలకు చెల్లించడమేంటని నిలదీత
ప్రభుత్వ సొమ్మంటే ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము
దాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్ల ముసుగులో మీ కార్యకర్తలకు ఇవ్వటం కరెక్టా?
అసలు వలంటీర్లంటే మొదటి నుంచీ మీకెందుకంత ద్వేషం?
విజయవాడ వరదల్లో ఉపయోగించుకుని మరీ వదిలేశారేం?
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఇంటింటికీ వెళ్లి నేరుగా అందించాం. అధికారుల చుట్టూనో.. నాయకుల చుట్టూనో తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరినీ నేరుగా కలిసి.. వారు ఏ పథకానికి అర్హులో చెప్పి మరీ దాన్ని అందజేశాం. అదికూడా ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అనేది చూడకుండా.. ప్రకృతి వైపరీత్యాలొస్తే ప్రభుత్వం తరఫున సైన్యంలా పనిచేశాం. రాష్ట్రంలోని ప్రతి మూలకూ వెళ్లి సేవలందించాం. యావత్తు ప్రపంచాన్నీ కోవిడ్ మహమ్మారి కమ్మేసినప్పుడు.. ఇంట్లోంచి బయటకు రావటానికే జనం భయపడ్డప్పుడు... నేరుగా ఇళ్లకు వెళ్లి మందులిచ్చి మరీ రాష్ట్ర ప్రజలను ఆదుకున్నది మా సైన్యమే. అలాంటి మాకు గౌరవ పారితోషికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.5,000 మొత్తాన్ని ఉగాది సాక్షిగా రూ.10 వేలకు పెంచుతానని చెప్పి మరీ మోసం చేయటమే కాక... ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఒక్కో పోస్టుకు రూ.15 వేలు చెల్లిస్తామంటూ వెన్నుపోటు ప్రభుత్వం పాలసీ తీసుకురావడం దారుణం’ అని చంద్రబాబుపై వలంటీర్లు మండిపడుతున్నారు.
‘వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించిన సంక్షేమ పథకాలన్నిటినీ తానూ ఇస్తానని, మాకు గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతానని చెప్పి చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్ని తీసేయటమే కాదు.. గత ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలను కూడా అమలు చేయటం లేదు. కానీ ఇప్పుడేమో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలకు ఒక్కో పోస్టుకు రూ.15 వేలు ఇస్తామనటం అన్యాయం? ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను అందజేసే మాకు నెలకు రూ.5 వేలు ఇవ్వటం భారమని, దుబారా అని భావించిన చంద్రబాబు ఇపుడు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెట్టించుకుని ఒకో పోస్టుకు రూ.15 వేలు చెల్లిస్తామనటం దివాలాకోరుతనానికి పరాకాష్ఠ. ప్రజల సొమ్మును ఈ రకంగా దుర్వినియోగం చేయటం ఘోరం... నేరం కూడా’’ అని పలువురు వలంటీర్లు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు తమను తొలగించాక... దుబారాను తగ్గించారంటూ ఎల్లో మీడియా ఆయనను బాగా ప్రశంసించిందని వారు గుర్తుచేశారు. ‘‘కానీ విజయవాడకు భారీ వరదలొస్తే అక్కడ సేవలందించడానికి చంద్రబాబుకు, ఆయన మీడియాకు, ఆయన యంత్రాంగానికి అక్కరకు వచ్చింది మాత్రం మేమే. మళ్లీ విధుల్లోకి తీసుకుంటామంటూ పిలిచి మమ్మల్ని మరోసారి మోసం చేశారు’ అని వలంటీర్లు వాపోతున్నారు. 
లబ్ధిదారు ఇంటికే వెళ్లి పింఛన్లు ఇస్తున్న వలంటీర్ (ఫైల్)
ఇది తెలుగుదేశం పార్టీ నిధి కాదు కదా?
ఇదంతా ప్రభుత్వ ఖజానాను నేరుగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు దోచిపెట్టడానికి దారుణమైన స్కెచ్ అని వలంటీర్లు ఆవేదన చెందుతున్నారు. ‘ఎన్నికల్లో గెలవటానికి సోషల్ మీడియా ప్రచారం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దానికి పార్టీ తరఫున డబ్బులివ్వాలి తప్ప రాష్ట్ర ప్రజలంతా పన్నుల రూపంలో చెల్లించిన ధనాన్ని ప్రచార యావ కోసం ధారాదత్తం చేయటం అన్యాయం. మేమైతే ఇంటింటికీ వెళ్లి కష్టపడ్డాం గనుక మాకు గౌరవ పారితోషికంగా రూ.5వేలు చెల్లించారు. ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసేదేంటి? సోషల్ మీడియాలో ప్రభుత్వానికి డప్పుకొడుతూ ఒక పోస్టు పెడితే రూ.15వేలు చెల్లిస్తామనటం ఎక్కడైనా ఉందా?’ అని వలంటీర్లు వేస్తున్న ప్రశ్నకు ప్రభుత్వం దగ్గరైతే సమాధానం లేదు.
మా కడుపులు కొట్టి ఇన్‌ఫ్లుయెన్సర్లకు జీతాలా?
2019 నుంచి 2024 వరకు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచాం. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికీ చేర్చాం. రూ.5 వేలు గౌరవ వేతనం తీసుకొని ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందించాం. అలాంటి మమ్మల్ని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు రూ.5 వేలు కాదు రూ.10 వేలు ఇస్తామన్న మాటలు నమ్మాం.. ఆశపడ్డాం. చివరకు ఈ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసింది.
– తాటిపాటి తిరుపాల్, 47వ సచివాలయ మాజీ వలంటీర్, కర్నూలు
దోచిపెట్టే కొత్త పాలసీ ఇది
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటింటికి అందించిన మాపై అప్పట్లో మీరు ఎన్నో నిందలు వేశారు. గౌరవ వేతనం రూ.5 వేలు నుంచి రూ.10 వేలకు పెంచుతానని చెప్పి సీఎం చంద్రబాబు మోసం చేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాత్రం ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు కొత్త పాలసీ తీసుకురావటం దారుణం.
– బి.చాందిని, మాజీ వలంటీర్, బాపులపాడు, కృష్ణా జిల్లా
రూ.వందల కోట్లు ఖర్చు చేయడం సమంజసమా?
కరోనా మహమ్మారికి భయపడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోయినా ప్రాణాలకు తెగించి సేవలందించాం. నెల రోజులు పనిచేసి గౌరవ వేతనం రూ.5వేలు పొందేవాళ్లం. దానికే ప్రజాధనం దుర్వినియోగం అంటూ నాడు నానా రాద్ధాంతం చేసిన కూటమి పెద్దలు.. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలి.
– ఉయ్యాల ఈశ్వర్‌కుమార్, మాజీ వలంటీర్, చాగంటివారిపాలెం, పల్నాడు జిల్లా


