సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా మెడికల్ కాలేజీలో విషాదం నెలకొంది. ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు మెడికల్ పీజీ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఈ నెల 24న మెడికో శైలజ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా నిన్న మరో మెడికో శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. దీంతో, ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది.
శైలజ, శ్రావణి ఇద్దరూ ఆంధ్రా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్నారు. ఈ నెల 24న శైలజ ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా చిన్న వాల్తేరులో అద్దె ఇంట్లో ఉంటున్న శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రావణి స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు ముందు శ్రావణి సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. తన మృతికి ఎవరూ బాధ్యులు కారని అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ రెండు ఘటనలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నాయి.
ఈ సందర్భంగా సాక్షి టీవీతో మెడికో శ్రావణి తల్లి పద్మ మాట్లాడుతూ..‘శ్రావణి ఒత్తిడి వలనే చనిపోయింది. ఈఎన్‌టీ కోర్స్ నచ్చలేదని నాకు చెప్పింది. ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి బయటకు వచ్చేస్తానని చెప్పింది. శ్రావణి చాలా బాగా చదువుకునేది. ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేసింది. కాలేజీలో ఒత్తిడి ఉంది అనేది వాస్తవం. మా కుటుంబంలో నా కుమార్తె మొదటి డాక్టర్ అని ఎన్నో కలలు కన్నాం. ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు. పోలీసులకు అన్ని వాస్తవాలు చెప్తా’ అని అన్నారు.
కాగా, ఐదు రోజుల క్రితమే మెడికో శైలజ ఆత్మహత్యకు పాల్పడ్డారు. విశాఖపట్నం మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌నగర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న విద్యార్థిని ఎండీ జనరల్ మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇటీవల జరిగిన పరీక్షలను అనుకున్న స్థాయిలో రాయలేకపోయానని, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యుల వద్ద బాధపడుతుంది. ఈ క్రమంలో గురువారం పరీక్ష ఉండగా ఉదయం ఇంట్లోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఏఎంసీ క్యాంపస్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై తోటి విద్యార్థులు, అధ్యాపకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరుసగా ఇద్దరు పీజీ మెడికల్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఆంధ్రా మెడికల్ కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘డబ్బులిస్తాం.. డప్పు కొట్టండి’


